తెలంగాణలో షర్మిల ‘ఖేల్’ ఖతం.! ఇప్పుడిక ఫోకస్ ఆంధ్రప్రదేశ్ వైపేనా.?

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ‘కథ’ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. ఇకపై వైఎస్ షర్మిల ఫోకస్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వుండబోతోందా.? అంటే, ఔననే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

‘మీ సంగతి మీరు చూస్కోండి..’ అంటూ వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద తాజాగా సెటైర్లు వేసిన వైఎస్ షర్మిల, ‘ఈ సమాధానమే, ఎవరికైనా వర్తిస్తుంది..’ అంటూ వైఎస్ జగన్ మోహర్ రెడ్డికీ చురకలంటించారు.

సరే, రాజకీయాలన్నాక, మాటలు విసురుకోవడం అన్నది పెద్ద విషయమే కాదు.! ‘చంపేస్తా.. నరికేస్తా..’ అంటూ మీడియా ముందు రెచ్చిపోయే నాయకులు, ఆ తర్వాత, రాజకీయ విరోధులతో కలిసిపోతుంటారు. అదే రాజకీయమంటే.

కానీ, వైఎస్ షర్మిల ఎట్టి పరిస్థితుల్లోనూ తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రాజకీయంగా కలిసే అవకాశం లేదంటే, వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ‘పార్టీ పెట్టడమే తప్పు.! పైగా, జగన్ మీద ఇంతలా అసహనం వెల్లగక్కడమా.?’ అన్నది వైసీపీ అభిమానుల వాదన.

ఇంతకీ, వైఎస్ విజయమ్మ ఎక్కడ.? ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారు.? కొడుకు – కుమార్తె ఒకే రాజకీయ వేదికపై వుండాలని కోరుకుంటున్నారా.? లేదంటే, కొడుకు మీదకి కూతుర్ని రాజకీయంగా ఎగదోస్తారా.? ఎగదోసేంత రిస్క్ వైఎస్ విజయమ్మ తీసుకోరు.. కుదిరితే, కలపడానికి చూస్తారంతే.

‘ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ షర్మిల నుంచి రాజకీయంగా సాయం తీసుకుంటాం. వైసీపీలో ఆమె చేరితే సరే సరి..’ అన్న మాటలు ఏపీ కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఓ వైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూనే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్ల అంత సానుకూలంగా లేని షర్మిల, ఏపీ రాజకీయాల్లో ఎలా వ్యవహరిస్తారన్నది హాట్ టాపిక్.! రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.