రాజకీయాల్లో ఇంకా ఓనమాలు నేర్చుకుంటున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేసినా, రావాల్సిన పొలిటికల్ మైలేజ్ రాకపోవడంతో, అత్యంత వ్యూహాత్మక అడుగులేస్తున్నారామె రాజకీయంగా.
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల పార్టీ పరిస్థితి ఏంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. వైఎస్ షర్మిల తప్ప, ఆ పార్టీ నుంచి పోటీ చేసే నాయకులెవరన్నది తెలియడంలేదు. షర్మిల కూడా, తాను పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన పాలేరు నియోజకవర్గం వైపు ఈ మధ్య కన్నెత్తి చూడటంలేదు.
ఇదిలా వుంటే, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిపోతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలో వైఎస్ షర్మిల, కాంగ్రెస్ ముఖ్య నేత, ఆ పార్టీ భావి ప్రధాని రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పారు. అది కూడా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేపథ్యంలో.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా, రాహుల్ గాంధీ స్పెషల్ ట్వీట్ వేశారు. కాంగ్రెస్ నేతగా పార్టీకి వైఎస్సార్ అందించిన సేవల్ని రాహుల్ గుర్తు చేసుకున్నారు. ఈ ట్వీటుపై వైఎస్ షర్మిల స్పందిస్తూ, రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
వైఎస్ షర్మిల, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళనున్నారనీ, ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారనీ ప్రచారం జరుగుతున్న సమయంలో, రాహుల్ గాంధీకి ఆమె ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పడం విశేషమే. వైఎస్ షర్మిల ట్వీటుని వైసీపీ మద్దతుదారులు తప్పు పడుతున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని దొంగలా చూపేందుకు కాంగ్రెస్ అప్పట్లో చేసిన ప్రయత్నాల్ని షర్మిల మర్చిపోయారనుకోవాలా.?