ఏపీలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ వైఎస్ షర్మిళ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న విమర్శలు, ఎంచుకున్న మార్గాలు, అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు అన్నీ… కాంగ్రెస్ పార్తీ అధిష్టాణం నిర్ణయాలేనా.. లేక, షర్మిళ తన సొంత అజెండా అమలుచేస్తున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
తాజా ఉదాహరణ విషయానికొస్తే… విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాదం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించిన చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చి రెండు నెలలే అయ్యింది.. ఇదంతా గత ప్రభుత్వం నిర్వాకం వల్ల అని వైసీపీ మీద పడ్డారు. మంత్రులూ ఇదే పాట పాడుతున్నారు!
దీనిపై వైసీపీ గట్టిగా విరుచుకుపడింది. ఈ సందర్భంగా హుందాగా స్పందించిన జగన్… ప్రమాధాలు జరిగినప్పుడు స్పందించిన తీరును చూడమని ప్రజలకు సూచించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు జగన్ ప్రభుత్వం రియాక్ట్ అయిన విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని వెళ్లడించారు. నాడు 24 గంటల్లో అన్ని కార్యక్రమాలూ చక్కబెట్టినట్లు వివరించారు.
ఈ సమయంలో షర్మిళ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీని ఇరుకునపెడుతూ, కూటమికి బలం చేకూర్చే పాత పనికి పూనుకున్నారు! ఇందులో భాగంగా… గత డిసెంబర్ లోనే సెజ్ లో భద్రతా ప్రమాణాలు ఏ మాత్రం బాగా లేవంటూ ఒక నివేదిక ప్రభుత్వానికి చేరిందని అయినా పట్టించుకోలేదని విమర్శించారు.
అంటే… ఈ సెజ్ లో మరణాల పాపం వైసీపీదే అని ఆమె కచ్చితంగా తేల్చే ప్రయత్నం చేశారు. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ కి ఏపీ చీఫ్ గా షర్మిల రాజకీయ వ్యూహాలు ప్రణాళికలు ఏమిటో స్పష్టంగా అర్ధం అవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇది పార్టీ స్టాండ్ అవునో కాదో తెలియదు కానీ.. కచ్చితంగా షర్మిళ సొంత ఎజెండానే అని అంటున్నారు.
వాస్తవానికి ఏపీలో వైసీపీ ఓటమి చెంది సుమారుగా మూడు నెలలు కావస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. సహజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అన్నీ.. అధికార పక్షం మీదే విమర్శలు చేస్తాయి. విపక్షంలో ఉన్న పార్టీని అసలు పట్టించుకోవు. ఎందుకంటే.. ప్రజలు కూడా అధికార పక్షం చేసే తప్పులపై విపక్షాలు తమ గొంతుకను వినిపిస్తాయని.
ఆ ప్రజలు ఇప్పటికే వైసీపీ చేసిన పలు తప్పుల కారణంగా 2024 ఎన్నికల్లో తీర్పు ఇచ్చేశారు. ఇప్పుడు.. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమకు ఏమి చేస్తోంది, ఎన్ని హామీలు నెరవేరించి, అన్ని హామీలకూ ఏరియర్స్ ఇస్తుందా మొదలైన చర్చ సాగుతోంది. ఇది వాస్తవం. అందుకే సూపర్ సిక్స్ తో అధికార పక్షంపై ఇప్పటికే ట్రోలింగ్స్ స్టార్ అయ్యాయి.
కానీ షర్మిల మాత్రం వైసీపీనే ఫుల్ గా టార్గెట్ చేస్తున్నారు. ఆమె ప్రెస్ మీట్ పెట్టినా, ట్వీట్ చేసినా, సభలో మైకందుకున్నా.. ఎక్కువ సమయం వైసీపీని విమర్శించడానికె చూస్తున్నారు అని అంటున్నారు. దీని వల్ల ఆమె ఏమి సాధిస్తారు.. ఈ తరహా రాజకీయాన్ని జనం ఎలా తీసుకుంటారు అన్నదే ఇక్కడ అత్యంత కీలక పాయింట్ గా ఉంది.
వైసీపీని ఎంత తగ్గించి ఇబ్బంది పెడితే.. ఆ వైపు ఉన్న ప్రజానికం అంతా కాంగ్రెస్ కు షిఫ్ట్ అవుతారనేది షర్మిళ వ్యూహం అయి ఉండోచ్చు. అయితే… ఇంతకు మించిన అమాయకత్వం, రాజకీయ అజ్ఞానం మరొకటి ఉండదనేది చాలా మంది చెబుతున్న మాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఏపీలో వైసీపీ ఓటమి పాలు అయింది.
గడచిన మూడు నెలల్లో వైసీపీ నుంచి కొంతమంది నెతలు టీడీపీకి, జనసేనకు జనాలు వెళ్తున్నారు తప్ప కాంగ్రెస్ వైపు ఒక్కరు కూడా తొంగి చూడటం లేదు! అలా టీడీపీ, జనసేనలకు వెళ్లే నేతల సంఖ్య కూడా అతి స్వల్పంగా ఉంది. కూటమి ఈ స్థాయిలో భారీ విజయం సాధించిన తర్వాత వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జంపింగ్ లు ఉంటాయని చాలా మంది భావించి ఉండొచ్చు.
కానీ… అసలు అలాంటి ఆలోచన వైసీపీ నేతలు చేస్తున్నట్లు లేరని అంటున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ.. చోటా మోటా నేతల జంపింగ్ లపై బాబు ఎంతో ఆశపెట్టుకున్నారని.. చివరి వరకూ ప్రయత్నించారని.. అయితే వైసీపీ నేత్లు స్ట్రాంగ్ గా నిలబడటంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయ్యిందని చెబుతున్నారు.
అంటే… ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ… జగన్ పై ఆ పార్టీ నేతలు, కేడర్ లో విశ్వాసం తగ్గలేదన్నమాట. పైగా… చంద్రబాబు గెలుపు ఈవీఎం మెషిన్స్ పుణ్యమే అంటూ కొంతమంది వైసీపీ స్రేణులు బలంగా నమ్ముతున్న వేళ కూటమివైపు గొడ దూకడానికి వైసీపీ నేతలు చాలా మంది ముందుకు కదలడం లేదని చెబుతున్నారు.
అయితే ఈ విషయం గ్రహించలేదో ఏమొ కానీ… విపక్షంలో ఉన్న వైసీపీనే టార్గెట్ చేస్తూ తనదైన రాజకీయాలు చేస్తున్నారు. నిజానికి ఈ రోజుకే కాదు 2029 నాటికి కూడా ఏపీలో కూటమికి బలమైన ప్రత్యర్ధిం అసలైన ప్రత్యర్థి వైసీపీయే! వైసీపీ అధినేత జగన్ తప్పులు చేసి ఉండవచ్చు. కానీ నాయకుడిగా ఆయన ఫెయిల్ అవలేదు. ఆయన నాయకత్వ లక్షణాలు చూసే పార్టీ క్యాడర్ నిలిచి ఉంది.
పైగా వైఎస్సార్ వారసత్వం విషయంలోనూ జగన్ కే ఎక్కువ మార్కులు పడతాయి. హస్తం గుర్తు అభిమానులు భావిస్తున్నట్లు 2029 నాటికి ఏపీలో కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకున్నా కూడా వైసీపీతో సమానంగా అయితే రాదు! మరి వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం రావాలీ అంటే వైసీపీని కూడా కలుపుకుని పోయే విధంగా రాజకీయం ఉండాలని అంటున్నారు.
2029 నాటికి జాతీయ స్థాయిలో ఇండియా కూటమి బలం పెంచుకున్నా ఏపీలో పొత్తులే పెట్టుకోవాలి. ఆ పొత్తులు వైసీపీతో సాగాలీ అన్నా ఇప్పటి నుంచే తగిన అనుకూల వాతావరణం ఏర్పాటు కావాలి. పైగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాణం పెద్దల సంగతి కాసేపు పక్కనపెడితే… ఇండియా కూటమిలో కీలక నేతలు జగన్ తో స్నేహం కోరుకుంటున్నారని అంటున్నారు.
మరి ఈ విషయం మరిచో, తెలియకో, చెప్పేవారు ఎవరూ లేకో, చెప్పినా వినిపించుకోకో తెలియదు కానీ… వైసీపీని ఇదే పనిగా విమర్శిస్తూ షర్మిల రాజకీయం చేస్తే కాంగ్రెస్ పార్టీ పెద్దలే భారీ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు అని అంటున్నారు. మరి షర్మిల అక్కడివరకూ తెచ్చుకుంటారా.. లేక, వైసీపీ విపక్షంలో ఉందని గుర్తెరిగి ప్రజల తరుపున కూటమిపై పోరాడతారా అన్నది వేచి చూడాలి!