కవితకు ఇచ్చిపడేసిన షర్మిళ… తెరపైకి లిక్కర్ సెటైర్లు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ విచారణ సమయంలో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ సమయంలో అసలు సూత్రదారి కవిత అరెస్ట్ అవుతారంటూ కథనాలొచ్చాయి. అయితే ఇంతలో బీజేపీ – బీఆరెస్స్ ల మధ్య ఏమి జరిగిందనేది తెలియదు కానీ… అరెస్ట్ ఆగిపోయిందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు!

ఆ సమయంలో కవితకు సడన్ గా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్స్ అంశం గుర్తుకువచ్చింది. తమ సొంత పార్టీలో మహిళలకు 10శాతం కూడా స్థానం ఇవ్వరనే పేరున్న కవిత… దేశం మాత్రం 33% ఇవ్వాలంటూ ఎక్కడలేని ప్రేమ చూపించడం మొదలుపెట్టారు! దీంతో ఈడీ కేసులను తప్పుదోవ పట్టించడానికే అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే తాజాగా “బీ ది ఛేంజ్‌ యు వాంట్‌ టూ సీ” అంటూ 33% మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవితకు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సలహా ఇచ్చారు. నిజంగా కవితకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే.. రానున్న ఎన్నికల్లో 33% అమలు చేయించాలని ఆమె ట్విట్టర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా దొంగ దీక్షలు కాదు.. ధమ్ముండాలంటూ తనదైన శైలిలో ఛాలెంజ్ విసిరారు!

అవును… దేశం మొత్తం సంగతి తర్వాత, ముందు బీఆరెస్స్ లో సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవిత తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూటిగా సుత్తిలేకుండా సూచించారు షర్మిళ. దీంతో కవితకు నోట మాట రాలేదనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో… బీఆరెస్స్ లో 115 సీట్లలో 7 స్థానాలు ఇస్తే చిత్తశుద్ధి ఉన్నట్టా అని నిలదీశారు.

మరీ ఇలా ముఖం మీద మాట్లాడితే బీఆరెస్స్ నేతలు, కవిత.. కుడితిలోపడ్డ ఎలుకల్లా విలవిల్లాడిపోతారు అంటూ కామెంట్లు వినిపిస్తోన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది! ఇదే సమయంలో తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నా కేబినెట్‌ లోనూ ప్రాధాన్యత దక్కలేదని షర్మిళ గుర్తు చేశారు.

ఇదే సమయంలో… “లిక్కర్, రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ ల గురించి కాకుండా, మీ నాన్నతో మాట్లాడి.. కేబినెట్‌ లో, పెద్దల సభలో, నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్‌ ఇప్పించాలి” అంటూ సెటైర్‌ వేశారు షర్మిళ. దీంతో… పుండుమీద కారం చల్లినంత పనిచేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయని తెలుస్తుంది.

ఏది ఏమైనప్పటికీ… తెలంగాణలో కవిత ను ఉక్కిరిబిక్కిరి చేయడానికి షర్మిళ ఒక్కరు సరిపోతారనే కామెంట్లు తాజగా రాజకీయవర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

కాగా… ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సమయంలో కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమంటూ అప్పట్లో కామెంట్లు వినిపించాయి! అయితే… తదనంతర కాలంలో కవిత పేరు మళ్లీ వినిపించలేదు! కారణం… తెలియరాలేదు!