ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని, వారిపై చర్యలు తీసుకుంటే, పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తామని ఆయన సవాల్ విసిరారు.
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటోంది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్ష హోదాపై అధికార పక్షం నుంచి స్పష్టమైన హామీ రాలేదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికార పక్షం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది.
ఈరోజు మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యాన్ని గౌరవించని ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూపిస్తాం” అని హెచ్చరించారు.
“అసెంబ్లీకి వెళ్ళనందుకు మాపై చర్యలు తీసుకుంటే, మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్తాం” అని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించలేమని ఆయన పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించి ప్రతిపక్షానికి తగిన హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇది కేవలం మాటలకే పరిమితమా లేక నిజంగానే రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్తారా అన్న చర్చ మొదలైంది. ఒకవేళ ఉపఎన్నికలు జరిగితే, అది ప్రజల మధ్య తమ బలపరీక్షగా భావించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ పరిణామం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను మరింత రసవత్తరం చేయనుందని భావిస్తున్నారు.


