YS Jagan’s Sensational Tweet: మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి మరియు వైసీపీ సీనియర్ నాయకుడు జోగి రమేశ్ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ అరెస్టుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ అక్రమ అరెస్టు అని ఖండిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలతో ట్వీట్ చేశారు.

జోగి రమేశ్ అరెస్టు అనేది నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ చేసిన చర్య అని జగన్ ధ్వజమెత్తారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అడ్డంగా దొరికిపోయి, దాని నుంచి తప్పించుకోవడానికి తమ పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అన్యాయంగా అరెస్టు చేయించారని జగన్ ఆరోపించారు.

టీడీపీ హయాంలోనే కల్తీ మద్యం గత 18 నెలలుగా ప్రభుత్వం, పాలన టీడీపీదేనని, పట్టుబడ్డ నకిలీ మద్యం కూడా మీ (టీడీపీ) హయాంలోనిదే అని జగన్ స్పష్టం చేశారు. పట్టుబడ్డవారిలో మీ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి, అలాగే చంద్రబాబుతో, ఆయన కొడుకుతో, మంత్రులతో, ఎమ్మెల్యేలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే అని జగన్ పేర్కొన్నారు.

“మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది, మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్‌ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టుషాపుల్లోనే, పర్మిట్‌ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కాని బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని” జగన్ మండిపడ్డారు.

అరెస్టు వెనుక ఇతర కారణాలను కూడా జగన్ తన ట్వీట్‌లో ప్రస్తావించారు:

నిన్న కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి, అలాగే ‘మోంథా’ తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. నకిలీ మద్యం వ్యవహారంపై జోగి రమేశ్‌ హైకోర్టులో సీబీఐ విచారణకు పిటిషన్‌ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందన్నారు.

“నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు?” అని జగన్ ప్రశ్నించారు. “మీ జేబులో ఉన్న సిట్‌ మీరు ఏం చెప్తే అది చేస్తుంది. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా?” అని ప్రశ్నిస్తూ, ఇది రాక్షస పాలన అని జగన్ తన ట్వీట్‌ను ముగించారు.

జగన్ చేసిన ఈ సంచలన ఆరోపణల నేపథ్యంలో, రాష్ట్రంలో కల్తీ మద్యం కేసు, జోగి రమేశ్ అరెస్టు వ్యవహారంపై రాజకీయ వేడి మరింత పెరిగింది.

Chiranjeevi Meets Hyderabad CP Sajjanar, But Why? | Natti Kumar | Telugu Rajyam