ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’లో తన సొంత పార్టీ కార్యకర్తలను, స్థానిక ప్రజలను కలవడానికి ‘పాసులు’ జారీ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పాసుల వ్యవహారంపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందిస్తూ జగన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
లోకేష్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో “ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు VIP పాసులు విన్నాం గానీ…. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..!” అంటూ జగన్ తీరును ఎద్దేవా చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్ కార్యక్రమాలకు కట్టిన పరదాలు, కొట్టిన చెట్లను గుర్తు చేస్తూ లోకేష్ ఈ సెటైర్లు వేశారు.
గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత జగన్ ప్రజలతో, కార్యకర్తలతో మరింత సన్నిహితంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, పులివెందులలో జరిగిన ఈ పాసుల వ్యవహారం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. తన తండ్రి వై.ఎస్.ఆర్. వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లిన జగన్, అంతకుముందు రోజు పులివెందులలో ప్రజల సమస్యలను వినడానికి ‘ప్రజా దర్బార్’ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు వస్తారని అంచనా వేసి, భద్రతా కారణాల దృష్ట్యా ఈ పాసులను జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పాసులు ఇవ్వడంపై ఇతర పార్టీల నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో ప్రజల మధ్య దూరం పెంచే ఈ చర్య జగన్ ప్రజాస్వామ్య విరుద్ధమైన నాయకత్వానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ పాసుల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు. దీనిపై మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా విమర్శలు ఎక్కుపెడుతూ జగన్పై ఒత్తిడి పెంచుతున్నారు.


