వైఎస్ జగన్ పాలన పట్ల పాజిటివ్ టాక్ ఎంతలా అయితే ఉందో నెగెటివ్ టాక్ కూడా అదే స్థాయిలో ఉంది. మంచి కంటే చెడే వేగంగా వ్యాపిస్తుందనే వాస్తవాన్ని నిజం చేస్తూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకంటే ప్రభుత్వం యొక్క పొరపాట్లు, వారి మీద వస్తున్న ఆరోపణలు గట్టిగా ఎలివేట్ అవుతున్నాయి. ఎలాంటి వివాదాల నుండైనా బయటపడవచ్చు కానీ రాజ్యాంగ వ్యవస్థల జోలికి వెళ్లి బయటపడటం చాలా కష్టం. ప్రస్తుతం వైఎస్ జగన్ సర్కార్ ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటోంది. తాజాగా ప్రముఖ పత్రిక, ఛానెల్ ఒకటి ‘న్యాయ దేవతపై నిఘా’ పేరుతో సంచలన కథనాన్ని ప్రచురించింది. పైగా విశ్వసనీయ సమాచారం ఉండబట్టే కథనాన్ని ప్రచురిస్తాం అంటూ బల్లగుద్ది చెప్పారు. ఈ కథనంలో ప్రముఖ న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, ఆ ట్యాపింగ్ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమేనని పేర్కొంది.
ఫోన్ ట్యాపింగ్ అనేది నిఘా వర్గాలు అసాంఘిక శక్తుల వ్యూహాలను, పన్నాగాలను తెలుసుకోవడానికి వాడే విధానం. ఇంకా చెప్పాలంటే ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడానికి ఈ సాంకేతికతను వినియోగిస్తారు. అలాంటి ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని జడ్జీల మీద ప్రభుత్వం ప్రయోగించిందని సదరు పత్రిక చేసిన ఆరోపణ. కొన్ని రోజుల క్రితం హైకోర్ట్ జడ్జి ఒకరు తన ఫోన్ కు వచ్చిన లింక్ ఒకదాని ఓపెన్ చేశారట. అప్పటి నుంచి ఆయన ఫోన్ కు వస్తున్న కాల్స్ వాటికవే డైవర్త్ కావడం, సందేశాలు వాటికవే రీడ్ అయిపోవడం, కాల్స్ ఉన్నట్టుండి డ్రాప్ అవడం జరిగిందట. దీంతో ఆ న్యాయమూర్తి సంబంధిత నెట్వర్క్ ప్రతినిధులను సంప్రదించగా తమవైపు నుండి అంతా సక్రమంగానే ఉందని క్లారిటీ ఇచ్చారట వారు. ఇలాంటి సమస్యే ఇంకొందరు జడ్జీలకు కూడా ఎదురైందట. దీంతో అందరూ కలిసి నిపుణులను పిలిచి పరిశీలన చేయించగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని గుర్తించారట.
ఆ న్యాయమూర్తుల పేర్లు అయితే బయటకు రాలేదు కానీ ట్యాపింగ్ జరిగిందని మాత్రం పత్రిక చాలా నమ్మకంగా చెప్పింది. మొదటి నుండి ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మీద అసంతృప్తితో ఉందని అందుకే ఈ పన్నాగం పన్నిందని తేల్చేశారు. ఈ వార్త చదివిన జనం మొదటి నుండి జరిగిన ఎపిసోడ్స్ మొత్తాన్ని రీకలెక్ట్ చేసుకుని పత్రిక కథనం మీద గురి పెట్టేసుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆయన ప్రభుత్వానికి కోర్టులో తరచూ అసంతృప్తికరమైన వాతావరణమే ఎదురవుతోంది. సర్కార్ తీసుకునే నిర్ణయాలను సరైనవి కాదని అనడమే కాదు రాజ్యాంగ విరుద్దమైన నిర్ణయాలను ఎలా తీసుకుంటారు అంటూ మొట్టికాయలు కూడా వేసింది హైకోర్టు. ఒకానొక దశలో ఆదేశాలను పాటించలేదని కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని మందలించింది. దీంతో వైసీపీ నేతలు కొందరు న్యాయ వ్యవస్థలనే కించపరిచేలా మాట్లాడారు.
ఒకరేమో చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేస్తున్నారని అంటే ఒకరు పాలనలో కోర్టుల జోక్యం పెరుగుతోందని, కోర్టులే నిర్ణయాలు తీసుకుంటే ఇక పాలకులు, ప్రభుత్వం ఎందుకంటూ మండిపడ్డారు. నేతలే అలా మాట్లాడేసరికి కార్యకర్తలు చెలరేగిపోయారు. నరికేయాలి, కరోనా పేషెంట్లు ఉన్న వార్డుల్లో వదలాలి లాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా చర్యలు చేయడం న్యాయ వ్యవస్థ మీద దాడి చేయడమేనని ప్రముఖ న్యాయ నిపుణుడు హరీశ్ సాల్వే మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో దేశం మొత్తం ఏపీ ప్రభుత్వ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. న్యాయవాదులు కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలకు నోటీసులు సైతం పంపారు. ఆ కేసుల గురించి మాట్లాడిన వైసీపీ కీలక నేత ఒకరు నోటీసులు అందుకున్న కార్యకర్తలను కాపాడుకుంటాం అంటూ హామీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత జరిగిన జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణల వివాదం కూడా పెద్ద దుమారాన్నే రేపింది.
ఈ పరిణామాలన్నీ కలిసి ప్రభుత్వానికి నిజంగానే కోర్టుల మీద కోపం ఉందని, అందుకే మాటల దాడి చేస్తుందని ఒక వర్గం ప్రజలు అనుకునేలా చేశాయి. సోషల్ మీడియాలో ఈ విషయం ప్రస్పుటంగా బయటపడింది. ఈ అభిప్రాయానికి తాజా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు జత కావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. తమకు వ్యతిరేకంగా తీర్పులు వస్తుండటంతో ప్రభుత్వం అభద్రతా భావంలో పడి ఈ ట్యాపింగ్ ప్రక్రియను నమ్ముకుందా, అలా చేస్తే అది ముమ్మాటికీ పెద్ద నేరమే అంటున్నారు. ఈ అనుమానాలు మరింత బలపడితే ప్రభుత్వం ప్రతిష్టకు పెద్ద దెబ్బే తగులుతుంది. కాబట్టి ప్రభుత్వం తన తప్పు లేకుంటే నిజంగానే న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయా లేదా.. ఒకవేళ అవుతుంటే దాని వెనుక ఉన్నది ఎవరు వంటి నిజాలను నిగ్గుతేల్చి తమ పవిత్రతను నిరూపించుకోవాలి.