పాపం…చంద్రబాబు ఊహించి ఉండరు…
ఒక క్రైస్తవ మతస్తుడిని ఆంధ్రులు ముఖ్యమంత్రిగా ఆమోదిస్తారని! కులాభిమానం ఎక్కువగా కలిగి ఉండే ఆంధ్రులు ఇంకా మతపిచ్చి ధోరణులకు దిగజారలేదు అని ఆయన గ్రహించలేదు. ఇటలీ దేశస్తురాలైన క్రైస్తవురాలు సోనియా గాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి కావడానికి నాటి బీజేపీ ఎన్ని అస్త్రాలను ప్రయోగించి అడ్డుకున్నదో చూశాము. ఆమె ప్రధాని అయితే గుండు గీయించుకుంటానని ప్రతిజ్ఞ చేశారు సుష్మ స్వరాజ్. ఇలాంటి ప్రతిఘటనలు ఎదురై భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి అవకాశాలు లుప్తం అవుతాయేమో అని భయపడి మన్మోహన్ సింగ్ ను ప్రధాని పదవిలో కూర్చోబెట్టి తాను తెరవెనుక పెత్తనం చెలాయించారు సోనియా. జగన్ మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు రాబట్టి అయన సునాయాసంగా ముఖ్యమంత్రి కాగలిగాడు కానీ, బొటాబొటీ మెజారిటీ వచ్చినట్లయితే అప్పటికప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొనేసి మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారు అనడంలో సందేహం అవసరం లేదు.
ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యం
ఇపుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే….జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేమని చంద్రబాబుకు ఏనాడో అర్ధం అయింది. ఇక మిగిలిందల్లా జగన్ పాటించే మతం. జగన్ మీద ఎలాగైనా ప్రజలకు విరక్తి కలిగించాలి. జగన్ మీద ద్వేషం పెంచాలి. జగన్ అనే ఒక క్రైస్తవుడు పాలిస్తే రాష్ట్రం మొత్తం క్రైస్తవం అవుతుందని ప్రజలను భయభ్రాంతులకు గురి చెయ్యాలి. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని చెప్పగానే హిందువులను క్రైస్తవులుగా మార్చే దుర్మార్గం అంటూ ఆర్తనాదాలు చేశారు. ఎన్ని కేకలు పెట్టినా జనం మాత్రం నమ్మలేదు. ఇక హిందువుల మనోభావాలను గాయపరిచే కొన్ని సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో చోటు చేసుకున్నాయి. అవి యాదృచ్చికంగా జరుగుతున్నాయా లేక వాటివెనుక కుట్ర ఉన్నదా అనేది దర్యాప్తు జరిగితే తెలుస్తుంది. అంతర్వేది పుణ్యక్షేత్రంలో మొన్న జరిగిన రధ దహనం తీవ్ర దుమారాన్ని రేపింది. దీనిని సాకుగా తీసుకుని మతకలహాలు రెచ్చగొట్టాలని తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ప్రయత్నించాయి. అయితే తక్షణ చర్యలు తీసుకుని ప్రతిపక్షాల కుట్రలను భగ్నం చేశారు జగన్. రధాన్ని తగులబెట్టడం వెనుక రహస్యాన్ని ఛేదించడానికి ఏకంగా సిబిఐ విచారణను కోరాలని నిర్ణయించడం ద్వారా ప్రత్యర్థుల నోళ్లకు ఒకేసారి తాళం వేశారు జగన్.
మరి చంద్రబాబు పాలనలో?
ఆంధ్రప్రదేశ్ లో దైవాపచారాలు జరగడం ఇదే తొలిసారి కాదు. చంద్రబాబు పాలనలో ఇంతకన్నా ఘోరాలు జరిగాయి. పరమ పవిత్రమైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అర్ధరాత్రి తాంత్రిక పూజలు జరిగాయి. పుష్కరాల పేరుతో చంద్రబాబు ప్రచార పిచ్చికి ఇరవై తొమ్మిది మంది భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా పుష్కరాల పేరుతో నలభై ఆలయాలను బుల్డోజర్లతో కూల్చి వేశారు చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే అయిదు వందల ఏళ్ల చరిత కలిగిన శ్రీవారి ఆలయం ముందున్న వెయ్యికాళ్ల మంటపాన్ని కేవలం వ్యాపారం కోసం కూల్చివేయించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూజలు పునస్కారాలు, యాగాలు చేసినపుడు చంద్రబాబు పాదాలకు ధరించిన బూట్లను విప్పరు. అయినప్పటికీ ఈ సోకాల్డ్ స్వాములు, పీఠాధిపతులు, భక్తులు ఒక్కసారి కూడా నోరు విప్పిన పాపాన పోలేదు. సిబిఐ దర్యాప్తు కోసం ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా ఆనాడు పోరాడలేదు. ఎందుకంటే ఎవరిని ఎలా “సంతృప్తి” పరచాలో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే ఆయన చేసిన దైవద్రోహాలను ఏ పార్టీ కూడా నిరసించదు. జగన్మోహన్ రెడ్డికి ఆ విద్య తెలియదు మరి!
సిబిఐ విచారణలో ఏమి తేలుతుంది?
ఏ చిన్న సంఘటన జరిగినా…సాధారణ పోలీసు కానిస్టేబుల్ సైతం పరిష్కరించే కేసులలో కూడా సిబిఐ దర్యాప్తు కోరడం ఇటీవల కాలంలో ఒక జాడ్యంగా మారింది. చంద్రబాబు హయాంలో సిబిఐ ని రాష్ట్రంలో నిషేదించినపుడు ఒక్క పార్టీ కూడా నోరు మెదపలేదు. కనీసం హైకోర్టు కూడా దాన్ని తప్పు అని చెప్పలేదు. జగన్ పరిపాలన వచ్చేసరికి ప్రతిదానికి సిబిఐ కావాలి. కేంద్రం జోక్యం చేసుకోవాలి! అయితే రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తుంటే “మాకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు..సిబిఐ విచారణ కావాలి” అని గోల చేస్తారు. ప్రభుత్వం అంగీకరించి సిబిఐ విచారణకు ఆదేశిస్తే “సిబిఐ విచారణలో ఏమి తేలుతుంది? అంతా బోగస్” అని మళ్ళీ వాళ్ళే అరుస్తారు. ఎవరేమనుకున్నప్పటికీ, ప్రజల మనోభావాలను గౌరవించి అంతర్వేది దుర్ఘటన పై సిబిఐ విచారణకు ఆదేశించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలను ఆత్మరక్షణలో పడేశారు జగన్. ఇక ఇప్పుడు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. సాధారణంగా తమ రాష్ట్ర పోలీసులను కాదని కేంద్రం చేతిలో కేసులను పెట్టడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వమూ సిద్ధం కాదు. కానీ, జగన్ మాత్రం నిర్భయంగా సిబిఐ విచారణకు ఆదేశించడం ద్వారా తనపై ప్రజల్లో కలిగే అపోహలను తొలగించగలిగారు. రాష్ట్ర పోలీసులపై నిందలు పడకుండా నివారించగలిగారు. “తన తప్పుంటే సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశిస్తారు?” అని ప్రజలు నమ్మేలా చేయగలిగారు. సిబిఐ విచారణకు ఆదేశించారు కాబట్టి ఈరోజు మేము చెయ్యాలనుకున్న ఆందోళనను విరమించుకుంటున్నాము” అని ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. మూడు రాజధానులకు మాకు అభ్యంతరం లేదని నిన్న హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చెయ్యడం ద్వారా వైసిపి పట్ల తమ వైఖరి ఏమిటో కేంద్రం స్పష్టం చెయ్యడంతో బీజేపీ కూడా సైలెంట్ అయిపొయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా మిగిలిపోయింది.
వీరందరి లక్ష్యం ఒకటే…జగన్ ను అప్రతిష్ట పాలు చెయ్యడం. ఏదో విధంగా ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టడం…జగన్ కు వ్యతిరేకంగా కుహనా ఉద్యమాలను సృష్టించడం..కులగజ్జి మీడియాతో ఇరవైనాలుగు గంటలు వ్యతిరేక ప్రచారం చేయించడం, కోర్టుల్లో పిల్స్ వెయ్యడం ద్వారా ఆటంకాలు కలిగించడం….బహుశా వారి కోరికలు నెరవేరకపోవచ్చు. అయినప్పటికీ మున్ముందు ఇలాంటి ఆటంకాలను జగన్మోహన్ రెడ్డి మరెన్నో ఎదుర్కోక తప్పదు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు