ముందస్తు ముచ్చట: కేసీఆర్ – జగన్… మధ్యలో మోడీ!

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు శ్రీకారం చుట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ముఖ్య‌మంత్రి కార్యాల‌య వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు.. ప్ర‌స్తుతం ఢిల్లీ వెళ్తున్న ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఇదే విష‌యంపై మోడీతో చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివ‌రి నాటికి తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఆ ఎన్నికలు, వాటి ఫలితాలూ ఏపీలో ప్‌టభావం చూపించే అవ‌కాశం ఉంది. దీంతో… జగన్ ముందస్తు ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా.. వరుసగా హస్తిన యాత్రలు చేపడుతున్నారని చెబుతున్నారు.

అవును… తెలంగాణ‌తోపాటు, ఏపీలోనూ ముందస్తు ఎన్నిక‌లు నిర్వహించేలా జ‌గ‌న్ ప్లాన్ చేస్తున్నారట. వాస్తవానికి ముంద‌స్తుకు వెళ్లాల‌ని అనుకునే ఏ ప్రభుత్వమైనా.. రాజీనామా చేసి కేబినెట్‌ ను ర‌ద్దు చేసినా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం దానికి ద‌న్నుగా నిలిస్తేనే ముందస్తు సాధ్యం అవుతుంది. అలాకనిపక్షంలో… స‌మ‌యం వ‌చ్చేవ‌ర‌కు ఆగాల్సిందే. అంటే.. షెడ్యూల్ వచ్చే వ‌ర‌కు కూడా రాష్ట్రపతి పాల‌న విధించే అవ‌కాశం ఉంది.

ఇది పూర్తిగా కేంద్రంలో అధికారంలో ఉన్న వారి చేతిలోనే ఉంటుందని అంటుంటారు! ఈ విష‌యం గ్రహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. త‌న‌కు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఉన్నప్పటికీ మౌనం వ‌హించారట. ప్రభువ ర‌ద్దు చేస్తే.. కేంద్రం రాష్ట్రప‌తి పాల‌న‌కే మొగ్గు చూపుతుంద‌ని, తనకు అనుకూలంగా బీజేపీ సర్కార్ నిర్ణయం తీసుకోదని కేసీఆర్ ఫిక్సయ్యారని అంటున్నారు. ఫలితంగా.. ముందస్తు ఆలోచన పక్కనెట్టి, షెడ్యుల్ ప్రకారమే ఎన్నిక‌ల‌కు వెళ్తున్నారు.

అయితే.. సీఎం జ‌గ‌న్‌ కు, కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్న నేప‌థ్యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల విష‌యంపై మోడీని ఒప్పించాల‌నేది సీఎం జ‌గ‌న్ ప్లాన్‌ అట. అందులో భాగంగానే… ఢిల్లీ టూర్ పెట్టుకున్నార‌నేది తాడేప‌ల్లి వ‌ర్గాల మాట‌గా ఉంది. మరి హస్తిన కేంద్రంగా వస్తున్న ఈ జగన్ ముందస్తు ఆలోచనల గురించి పూర్తి విషయాలు, జగన్ నిర్ణయాలు, మోడీ అనుమతుల గురించి తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఎదురుచూదాల్సిందే!