ఏ వెలుగులకీ జగన్ లిక్కర్ పాలసీ?

YS Jagan liquor policy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్యం విధానం విమర్శలకు దారితీస్తోంది. మద్యం ధరలను విపరీతంగా పెంచడం, మధ్య వినియోగాన్ని తగ్గించడానికి ఇలా చేశామని ప్రకటించడం ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని, దీని వెనుక  వైఎస్సార్ సిపి   మద్యం మాఫియా ఉందని  విమర్శలు వినిపిస్తున్నాయి. ఎపి ప్రభుత్వ మద్యం విధానం సరిగా లేదని వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రియమిత్రుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ కొన్ని వారాల క్రితం మీడియా ముందుకు వచ్చి విమర్శించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మద్యం ధరలు ఇంత ఎక్కువగా ఉండడానికి కారణమేమిటని ఆయన ప్రశ్నించారు. పాపులర్  బ్రాండ్స్ ఎందుకు మాయమయ్యాయని ఆయన అడిగారు. డాం , డం , డిష్ అనే విచిత్రమైన పేర్లు గల వందలాది చీప్ బ్రాండ్లను ప్రభుత్వ దుకాణాల్లో ఎందుకు అనుమతిస్తున్నారని ఆయన ప్రశ్నిచారు.

Read More – లిక్కర్ పై జగన్ డేరింగ్ డెసిషన్

ఇప్పుడు కరోనా తర్వాత పెద్ద సమస్యగా మద్యపాన వ్యసన పరుల సమస్య ముందుకు వస్తోంది. ఎక్కువ ఖరీదు పెట్టి కనీసం చీప్ లిక్కర్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న వారు శానిటైజర్లను , నకిలీ శానిటైజర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో శానిటైజర్లను  అమ్మేవారిని, కొనేవారిని నిందించలేం. ప్రజారోగ్యాన్ని కాపాడవలసిన  బాధ్యత గల ప్రభుత్వాన్నే నిలదీయవలసి ఉంటుంది. దీనిపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం తక్షణ నివేదిక కోసం  ఆదేశించలేదు. విచారణలు కొనసాగుతూనే ఉండగా శానిటైజర్ కేసులు రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. శానిటైజర్లను నియంత్రించినా నకిలీ మద్యానికి జనం అలవాటుపడతారు.

ఏపీలో మద్యం ధరల పైన, ప్రభుత్వం కొని అమ్ముతున్న వందలాది పిచ్చి  బ్రాండ్ల వివరాలపైనా ఉండవల్లి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దరఖాస్తు చేశారు. ఆ వివరాలు వచ్చిన వెంటనే ఆయన మళ్ళీ పబ్లిక్ లోకి వచ్చే అవకాశముంది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే చిన్న డిస్టలరీలు పెట్టి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం అమ్ముకుంటున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఆర్టీఐ యాక్ట్  ద్వారా ఈనాడు రామోజీరావుకు చెందిన  మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలను వెలుగులోకి తెచ్చి ఆ సంస్థ మూతపడేలా చేసిన చరిత్ర ఉండవల్లిది. ప్రజల నుంచి డిపాజిట్లు తీనుకునే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రవేట్ లిమిటెడ్ ఇప్పుడు లేదు. ఈనాడు పత్రిక, మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్ధలు మాత్రమే, అవికూడా  నామమాత్రంగా మాత్రమే  నడుస్తున్నాయి.

Read More – ఎన్టీఆర్ వైసిపి సొంతం కానున్నారా?

జగన్ చెబుతున్న అంచెలంచెలుగా మధ్య నిషేధం ఆచరణ సాధ్యంగా కన్పించడం లేదు. ఇటువంటి విధానం వల్ల పెద్దలకు లాభాలు,పేదలకు చావులు వస్తున్నాయి. ధైర్యం తెచ్చుకుని ఎన్ఠీఆర్ లాగా సంపూర్ణ మధ్య నిషేధం విధించాలి. లేదంటే యుపి, రాజస్థాన్ వంటి అనేక రాష్ట్రాలలాగా తక్కువ రేట్లకు ప్రభుత్వ డిపోలలో తయారైన  మద్యాన్ని అమ్మాలి. అటూ ఇటూ కానీ విధానాలను అనుసరించడం వల్ల అటు ప్రభుత్వానికి కానీ ఇటు సామాన్యులకు గానీ మేలు జరగదు. అధికార పార్టీని ఆశ్రయించిన లిక్కర్ వ్యాపారులే బాగుపడతారు. దీనిపై ప్రభుత్వం మంత్రులతో కాకుండా బుద్ధి జీవుల, సంఘ సంస్కరణ అభిలాషుల సలహాలు తీసుకోవడం మంచిది. మద్యంపై ఒక స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం అనుసరించాలి.