ఆంధ్రప్రదేశ్ నందు కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజుకు కనీసం 5000 లకి తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 15.9 లక్షల శాంపిల్స్ పరీక్షించగా 85,776 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ నెంబర్ ఇంకో రెండు రోజుల్లో లక్ష దాటిపోయేలా ఉంది. ఇప్పటికే కరోనా వ్యాప్తిలో మూడో స్థానంలో ఉన్న మనం ఇంకొద్ది రోజుల్లో రెండో స్థానానికి వెళ్లినా ఆశ్చర్యం అక్కర్లేదు. మహా నగరాలు, మెట్రో సిటీలు ఉన్న రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రాలో వైరస్ వ్యాప్తి చెందడం చూస్తే సర్కార్ వైఫల్యం ఎలా ఉందో అర్థమవుతుంది. భారీ సంఖ్యలో టెస్టులు చేస్తున్నారనే పేరున్నా నివారణ చర్యలు తీసుకోవడంలో మాత్రం బాగా వెనుకబడ్డారనే అపవాదు కూడ ఉంది. అంతేకాదు వైరస్ వ్యాప్తికి అవకాశమిచ్చేలా స్వీయ తప్పిదాలు కూడా జరిగాయి, జరుగుతున్నాయి.
ఎన్నికలకు ముందు జగన్ మద్యపాన నిషేదం అంటూ మాటిచ్చారు. నిజంగా ప్రభుత్వం ఆ మాటకు కట్టుబడే ఉంటే దాన్ని అమలుచేయడానికి కరోనా పరిస్థితుల కంటే బెటర్ టైమ్ ఇంకొకటి దొరకదు. కానీ జగన్ సర్కార్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్న సమయంలో ఎవరైనా మరింత జాగ్రత్త వహిస్తారు. కానీ ఏపీలో అదే సమయానికి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇంకేముంది రెండు నెలలు మందుకు మొహం వాచిన జనం భారీగా షాపుల ముందు క్యూ కట్టారు. ఫలితంగా లిక్కర్ దుకాణాలన్నీ కరోనా హాట్ స్పాట్లుగా మారాయి. మద్యం షాపులు ఓపెన్ అయిన రోజు నుండి రాష్ట్రంలో కేసుల పెరుగుదల గణనీయంగా పెరిగింది.
ఈ దుష్ప్రభావం గ్రామాల మీద గట్టిగా పనిచేసింది. ఎందుకంటే బ్రాందీ షాపుల ముందు క్యూలో నిలబడి తొక్కుకునే జనం అంతా కూలీ నాలీ చేసుకునే వారే. పగలంతా కష్టపడేవారు సాయంత్రానికి కూలి డబ్బుతో బయటికొచ్చి బ్రాందీ షాపుల ముందు తలపడుతుంటారు. అసలే ప్రభుత్వం తక్కువ స్టాక్ ఉంది త్వరపడండి అన్నట్టు ప్రచారం చేసుకుంది. దీంతో సామాజిక దూరం, మాస్కులు కట్టుకోవదం లాంటి నిబంధనలు మర్చిపోయారు జనం. ఆ జనమంతా గ్రామాల్లో నివసించేవారే. పొద్దున్నే టౌనుకొచ్చి ఎంతో కొంత సంపాదించుకుని రాత్రికి గ్రామాలకు చేరుకునేవారే. కానీ చేరుకోవడానికి మధ్యలో చాలామంది మద్యం దుకాణాలను సందర్శించి కరోనా అంటించుకుని మరీ ఇళ్లకు వెళుతున్నారు.
ఫలితంగా గ్రామాల్లో కుటుంబాలకు కుటుంబాలే వైరస్ బారినపడుతున్నాయి. జిల్లాల్లో అత్యధికంగా జనం ఒకచోట చేరుతున్న స్థలాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి మందు షాపులే. పెళ్లిళ్లకు, చావులకు ఇంతమంది మాత్రమే హాజరుకావాలని షరతులు పెట్టిన సర్కార్ మద్యం అమ్మకాలకు మాత్రం అదేదో మెడిసిన్ అన్నట్టు ఎన్నో వెసులుబాట్లు కల్పించడం చూస్తే మద్య నిషేదం అనేది నెరవేరని మాటే అనిపిస్తోంది. ఇవి చాలవన్నట్టు మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాన్ని ఇంకో గంట అంటే రాత్రి 9 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఎక్స్ట్రా గంట ఎందుకయా అంటే రోజువారీ అమ్మకం లెక్కలు చూసుకోవడానికి సిబ్బంది కోసం ఈ గంట పెంపు అంటూ సిల్లీ కారణం చెప్పారు.
మరి ఆ గంట ఓన్లీ లెక్కలే చూసుకుంటారా అమ్మకాలు చేయరా అంటే అబ్బే అదేం లేదు. ఎలాగూ తెరిచే ఉంటారు కాబట్టి కొనుక్కునే వాళ్లు వచ్చి కొనుక్కోవచ్చు. ఈ పద్దతి చూస్తే జనం ప్రభుత్వ పెద్దలకు మరీ ఇంత అమాయకుల్లా కనిపిస్తున్నారా అనిపిస్తోంది. మద్యం దుకాణాల సమయం గంట పెంచడం అంటే వైరస్ వ్యాప్తి చెందడానికి ఇంకో గంట అనుకూల పరిస్థితులు కల్పించినట్టే అవుతుంది. ఫలితం పాజిటివ్ కేసులు పెరుగుతాయి. మద్యం కొని సర్కార్ ఖజానా నింపిన మందు ప్రియులు, వారి కుటుంబాలు వారి మూలంగా ఇతర జనం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలి. ఈ రకమైన వైరస్ ఫ్రెండ్లీ నిర్ణయాలతో ముందుకెళితే ఎన్ని నివారణ చర్యలు తీసుకున్నా కరోనా కట్టడి అనేది కలలో మాటే అవుతుంది తప్ప సాధ్యం కాదు.