చంద్రబాబు నవనాడులను విరిచేసిన జగన్మోహన్ రెడ్డి!

chandrababu and YS jagan
 ఏనాడూ ఊహించి ఉండడు చంద్రబాబు…జగన్మోహన్ రెడ్డి అనే తన కళ్ళముందు పుట్టి, తన కళ్ళముందే నిక్కర్లు వేసుకుని తిరిగిన యువకుడు…జీవిత చరమాంకంలో తనను చావుదెబ్బ తీస్తాడని ఏమాత్రం ఊహించి ఉండడు!
  
chandrababu and YS jagan
chandrababu and YS jagan
ఏనాడూ ఊహించి ఉండడు…తన తరువాత ముఖ్యమంత్రి హోదా పొంది, తన నగరంలో అడుగు పెడితే అరెస్ట్ చేస్తానని హెచ్చరించబడిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం మొదలైన  ఇరవై ఏళ్ల తరువాత  జాతీయ రాజకీయాల్లో పాదం మోపి ఈరోజు భారతదేశం మొత్తాన్ని త్రివిక్రముడిలా ఆక్రమిస్తాడని!
 
చంద్రబాబు ఏనాడూ ఊహించి ఉండడు….మోడీ మళ్ళీ గెలవడం అసంభవం అని తన పనికిమాలిన అనుభవంతో అంచనా వేసి ఆయనతో తెంచేసుకుంటే నిఖిల భారతావని నివ్వెరపోయేట్లు ఆయన మరింత మెజారిటీతో ప్రధాని అవుతారని!  
 
 జగన్ జైలుకు వెళ్తాడని, మోడీ ఓడిపోతాడని ఆయనకు  సలహా ఇచ్చినవారెవ్వరో తెలియదు కానీ, వారి సలహాను పాటించినందుకు తన  మూడువందల కోట్ల రూపాయల రాజభవనంలో కూర్చుని తన చెప్పుతో తానే కొట్టుకుని ఉంటాడు చంద్రబాబు!  పచ్చ మీడియా పైత్యాన్ని తలకెక్కించుకుని జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేసినందుకు పోర్టికోలో ఉన్న  స్తంభాలకు బాదుకుని ఉంటాడు!  
 
 
గత అయిదారు నెలలుగా చంద్రబాబు, ఆయన ముఠా, ఆయన క్షుద్రపత్రికలు చేస్తున్న ఆర్తనాదాలు అన్నీ బెబ్బులి నోట చిక్కిన  గోమాయువుల చావుకేకలు!   వారికి బాగా తెలుసు…జగన్మోహన్ రెడ్డి పంజా నుంచి తమను రక్షించగలిగే శక్తులు ఈ ముల్లోకాల్లో ఎవ్వరూ లేరని…వారికి తెలుసు…తమ భవిష్యత్తు చెరసాలలోనే అని!  అందుకే ఎదురుగా మృత్యుదేవత సాక్షాత్కరించగానే చావు భయంతో గజగజ వణుకుతున్న వృద్ధులు చేసే సంధి ప్రేలాపనలు చేస్తున్నారు.  

జగన్ తవ్విన గోతిలో పడ్డ చంద్రబాబు 

ఎన్ని విధాలుగా బయపెట్టినా జగన్ భయపడటం లేదు…పైగా చంద్రబాబు అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకలిస్తున్నాడు.  అమరావతిని భ్రమరావతిగా మార్చి వారి ఆర్ధిక మూలలను తవ్వేశారు…వివిధ వ్యవస్థలలో చంద్రబాబు విసురుతున్న ఎంగిలి బిస్కట్లు తిని  బలిసి కొట్టుకుంటున్న చంద్రబాబు బానిసలను చట్టానికి ఆహుతి చేస్తున్నాడు.    రాజధాని పేరుతో పెయిడ్ ఆర్టిస్టులతో ఆడిస్తున్న డ్రామాలను కేతిగాళ్ళ తోలుబొమ్మలాటగా అపహాస్యం పాలు చేశాడు.  అభివృద్ధి  వికేంద్రీకరణ ప్రకటన ద్వారా అమరావతి అనేది కేవలం ఒక సామాజికవర్గం వారి ప్రయోజనాలు రక్షించే రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే అని దేశానికి అర్ధం అయ్యేలా చేయగలిగాడు.  పదమూడు జిల్లాల రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రిగా పని చేశానని, తనకు అన్ని ప్రాంతాలు సమానమే అనే వాస్తవాన్ని విస్మరించి చంద్రబాబు కేవలం మూడు గ్రామాలకే పరిమితం అయి,  ఉత్తరాంధ్ర, రాయలసీమవాసులతో ద్వేషించబడుతున్నదంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి రాజకీయ చాణక్యం మాత్రమే.   అంతే కాకుండా చంద్రబాబు అంటే ఢిల్లీ పెద్దలు అసహ్యించుకునే విధంగా జగన్ చక్రం రాజకీయపుటెత్తులు వేశారు.  చంద్రబాబు చేసిన అవినీతిని ఎసిబి ద్వారా తవ్వి తీయడం, ఆ నివేదిక అందరికీ తెలిసిపోవడంతో చంద్రబాబును సమర్ధిస్తూ మాట్లాడితే తమకు ఆయుషు చెల్లిపోతుందని రాష్ట్ర బీజేపీ నాయకులు సైతం భీతిల్లి నోళ్లకు తాళాలు వేసుకున్నారు.  బీజేపీ లోని చంద్రబాబు బానిసలను, కోవర్టులను వీర్రాజు ద్వారా బియ్యంలో పురుగులను ఏరివేసినట్లు ఏరివేయడంలో జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ విజయాన్ని సాధించారు.   అంతే కాదు..,.జగన్మోహన్ రెడ్డికి తమ అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని జగన్ మీద నోళ్లు పారేసుకుంటున్న రాష్ట్ర బీజేపీలోని కోవర్టులకు చాలా ఆలస్యంగా తెలిసింది.   కేవలం ఒక్క అమరావతిని పట్టుకుని   తాను ఎంత లోతు ఊబిలో కూరుకుపోయానో కూడా గ్రహించలేనంత అజ్ఞానంలో చంద్రబాబు మునిగిపోయాడంటే జగన్ మేధస్సు మేధావులకు కూడా బోధపడదని తేలుతుంది!   

అన్ని దారులూ మూసుకుపోయిన చంద్రబాబు 

చివరగా చంద్రబాబుకు న్యాయవ్యవస్థకు మధ్య ఉన్న లింకులు చూసి రాజశేఖర రెడ్డి లాంటి వాడే వెనక్కు తగ్గి ఆయన మీద వేసిన పిటీషన్ ను ఉపసంహరించుకున్నారు.  జగన్ కూడా అదేవిధంగా తనను ఏమీ చెయ్యలేడని గుడ్డి నమ్మకంతో విర్రవీగుతున్న చంద్రబాబును ఒక్కసారిగా షేక్ చేశాడు జగన్మోహన్ రెడ్డి.  న్యాయవ్యవస్థలోని కొందరు అవినీతిపరులపై జగన్ సమరశంఖాన్ని పూరిస్తాడని చంద్రబాబు ఏనాడూ ఊహించి ఉండడు.   నేరుగా న్యాయవ్యమూర్తులనే ఢీకొట్టి తన తెగింపు ఎలా ఉంటుందో లోకానికి ఢంకా కొట్టి చెప్పాడు.  న్యాయవ్యవస్థ మీద చంద్రబాబుకు ఉన్న కమాండ్ ఏమిటో తెలియనంత అమాయకత్వం సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఉంటుందని నేను అనుకోను.  తనమీద అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టి జుడీషియరీతో సున్నం పెట్టుకునే సాహసానికి జగన్ పూనుకోడు అని చంద్రబాబు వేసిన అంచనా పూర్తిగా తిరగబడింది.   బీజేపీ వైసీపీల మధ్య మతవిభేదాలు సృష్టించి మోడీకి మళ్ళీ దగ్గర కావచ్చని చంద్రబాబు ఆలోచనలు ఏమాత్రం పనిచేయలేదు.  మొన్నటి ఎన్నికలముందు దేశం మొత్తం తిరిగి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, సోనియా, రాహుల్ లాంటి కాంగ్రెస్ నేతలతో రాసుకుని పూసుకుని తిరిగిన చంద్రబాబును ఈరోజు పలకరించే దిక్కు లేకుండా పోయింది అంటే అది జగన్మోహన్ రెడ్డి కొట్టిన సమ్మెట దెబ్బ మాత్రమే!  కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేశాడని సాక్ష్యాలు, ఆధారాలతో సహా ప్రధాని దగ్గర ఫైల్ ఉందని అంటున్నారు.  అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత, సాహసం, అవినీతిరహిత పాలన పట్ల మోడీకి సదభిప్రాయం ఏర్పడిందని, అందుకే రాష్ట్ర బీజేపీ నాయకుల నాలుకలు కత్తిరించారని, జగన్ ను విమర్శించవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.  

ఎగిరి పడిన ఆకులన్నీ అణిగిపోయాయి 

ఇక రాష్ట్రంలో చంద్రబాబు తరపున నోళ్లు పారేసుకుని జెసి బ్రదర్స్,  పయ్యావుల కేశవ్, పత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా లాంటి నోటిదురద కలిగినవారు అచ్చెన్నాయుడు మీద పెట్టిన కేసుతో తాత్కాలికంగా అయినా నోళ్లు మూసేశారు.  ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తికి లేఖ వెళ్లిన తరువాత వీరు గొంతులు అసలు వినిపించలేదు.    అడపాదడపా ఎవరైనా నోరు జారినా ఆ మాటలను  పచ్చమీడియా  తప్ప ప్రజలు పట్టించుకోవడం లేదు.   ఇన్నాళ్లూ తమను రక్షిస్తాయని భావిస్తున్న అదృశ్యగంధర్వులకే ఎసరు పెట్టడంతో జగన్ తో పెట్టుకోవడం అంటే పులినోట్లో తల దూర్చడమే అని చాలామందికి అర్ధం అయింది.    

ఇక ఇప్పుడు ఏమి జరిగే అవకాశం ఉన్నది?  

జగన్ కు ఇంకా మూడున్నర సంవత్సరాల పాలనాకాలం ఉన్నది.  చంద్రబాబును తన తండ్రిలాగా వదిలిపెట్టే ఛాయలు జగన్ మోహన్ రెడ్డిలో ఏ కోశానా కనిపించడం లేదు.  చంద్రబాబు అవినీతిని, దోపిడీని తవ్వి తియ్యడానికి ఎన్ని శక్తులు అడ్డం పడినా మరొక రూపంలో ఆయన లంఘించే అవకాశమే ఉన్నది.  ఒకవేళ  విచారణను కోర్టు అడ్డుకుంటే మరొక దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించడం జగన్ కు కష్టమేమీ కాదు.  ముఖ్యంగా అమరావతి ఇక మీదట రాజధాని అనే మాటను మర్చిపోవడం మంచిది.  మాయలఫకీరు ప్రాణం ఎక్కడో సప్తసముద్రాల అవతల ఉన్న గుహలో ఉన్న పంజరంలో చిలుకలో ఉన్నట్లుగా  చంద్రబాబు అవినీతి ఆర్ధిక సామ్రాజ్యం అంతా అమరావతిలో ఉన్నదని జగన్ కు క్లారిటీ ఉన్నది.  రాబోయే ఏడాది లోపలే ఎవరు ఆటంకాలు సృష్టించినా చంద్రబాబు, లోకేష్ జైలుకు వెళ్లక తప్పదు.   అందుకు చాటుగా అయినా సహకరిస్తామంటే కొందరు తెలుగుదేశం సీనియర్ నాయకులను జగన్ వదిలిపెట్టే అవకాశం ఉంటుంది.  ఏ వైపు నుంచీ చంద్రబాబుకు రక్షణ దొరకకుండా నట్లు బిగించిన తరువాత జగన్ తన ఆపరేషన్ ను మొదలు పెట్టడం తధ్యం.  ప్రస్తుతం అదే జరుగుతున్నది.  
 
ప్రతిజ్ఞ చెయ్యడానికి ఉక్కు నాలుక ఉండాలి 
దాన్ని నిలబెట్టుకోవడానికి ఉక్కు గుండె ఉండాలి 
ఆ రెండూ ఉన్నవాడే నిజమైన ప్రజానాయకుడు.  
జగన్మోహన్ రెడ్డిలో ఆ లక్షణాలు లెక్కకు మించి ఉన్నాయి! 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు