వైఎస్ జగన్ వయసు రీత్యా చిన్నవాడే కావొచ్చు.. కానీ రాజకీయాల్లో మాత్రం ఆరితేరిపోయారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు కూడ సాధ్యంకాని రీతిలో రాజకీయం నెరుపుతున్నారు ఆయన. ఇన్నాళ్లు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా కులం ప్రాతిపదికన ఏర్పడిన ఓటు బ్యాంకునే నమ్ముకుంటూ వచ్చారు. ఒక కులాన్ని ఎక్కువగా ఆదరిస్తూ ఆ కులం ఓట్ల మీదే అధికారాన్ని, ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ బీసీలను అక్కునచేర్చుకుని రాజకీయం చేస్తే చంద్రబాబు నాయుడు కూడ దాన్నే ఫాలో అయ్యారు. కమ్మవర్గాన్ని అందరికంటే మిన్నగా చేరదీసి రాజకీయం నడిపారు. ఒకానొక దశలో రాయలసీమ రీజియన్ మొత్తాన్ని వదిలేసి కోస్తాఆంధ్ర, తెలంగాణ జిల్లాల ఓటు బ్యాంకుకే పరిమితమైన ఆయన 2014లో కూడ కోస్తాఆంధ్ర ఓట్ల మీదే సీఎం అయ్యారు.
ఇక వైఎస్ జగన్ సంగతి చూసుకున్నా అంతే. మొదటి నుండి రెడ్డి సామాజికవర్గం మద్దతును కలిగిన ఆయన ఆ వర్గాన్ని దన్నుగా చేసుకుని ప్రతిపక్షంలో నిలిచారు. 2019 ఎన్నికలకు బీసీలను కొంతమేర తనవైపుకు తిప్పుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే సామాజికవర్గాల ఓటు బ్యాంకులు శక్తివంతమైనవే అయినప్పటికీ నమ్మదగినవి కావు. ఎప్పుడు ఎటు మళ్లుతాయో చెప్పలేం. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆ వర్గాన్ని అలరించడానికి ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా ఎన్నికల చివర్లో వేరొకరు ఒక గట్టి మంత్రం వేస్తే అటువైపు మళ్లిపోతుంటారు. ఈ అనుభవం గత ఎన్నికల్లో చంద్రబాబుకు కలిగింది. బోలెడు ఆశలు పెట్టుకున్న బీసీలు హ్యాండ్ ఇవ్వడంతో టీడీపీ పేకమేడలా కుప్పకూలింది. చంద్రబాబు ఎన్ని చేసినా చివర్లో కొంత శాతం బీసీలు జగన్ కు జైకొట్టారు.
అందుకే ఈ ప్రమాదం తనకు కలగకూడదని ముందే జాగ్రత్తపడుతున్నారు జగన్. ఇలా సామాజికవర్గాల ఓటు బ్యాంకునే నమ్ముకుని కూర్చోకుండా సపరేట్ ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకుంటున్నారు. అది కులాలకు అతీతమైన ఓటు బ్యాంక్. అందులో అన్ని కులాలవారు ఉంటారు. సంక్షేమం అనే పునాదుల మీద ఈ ఓటు బ్యాంకును నిర్మిస్తున్నారు జగన్. ఇప్పటికే వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలుచేసిన జగన్ రానున్న మూడేళ్ళలో ఇంకా పెద్ద పెద్ద పనులే చేస్తున్నారు. అందులో మొదటి అడుగుగా ఉచిత ఇళ్ల పట్టాలు, ఇళ్ళతో జనంలోకి వచ్చారు.
మొత్తం 30.7 లక్షల మందికి నివాస పట్టా స్థలాలను కేటాయించనున్నారు. 50,940 కోట్ల అంచనా వ్యయంతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.28,080 కోట్ల వ్యయంతో మొదటి విడతలో 15.6 లక్షల ఇళ్ళు, రెండవ విడతలో మిగిలిన 12 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించడానికి పూనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ విలువ లక్ష కోట్లకు పైమాటే. నిజానికి ఈ భారాన్ని మోయగల శక్తి ఏపీ ప్రభుత్వానికి లేదు. కానీ జగన్ మొండి ధైర్యంతో ముందుకు దూకేశారు. అప్పులు చేసి అయినా సరే ఈ పనులు పూర్తిచేయాలని డిసైడ్ అయ్యారు. ఆయన అనుకున్నట్టే సకాలంలో అప్పులు పుట్టి, రాష్ట్ర ఆదాయం ఎంతో కొంత మెరుగుపడి వచ్చే ఎన్నికల నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తైతే జగన్ కు తిరుగనేదే ఉండదు.
ఇళ్ళు, స్థలాలు పొందిన మొత్తం 30.7 లక్షల కుటుంబాలు జగన్ పేరును రెండు మూడు దశాబ్దాల కాలం గుర్తుపెట్టుకుంటాయి. దగ్గర దగ్గర 31 లక్షల కుటుంబాలలో మొత్తం ఓటర్లు కోటి 10 లక్షలకు పైగానే ఉండొచ్చు. కోటి 10 లక్షలు అంటే మామూలు ఓటు బ్యాంక్ కాదు. అధికారాన్ని పువ్వుల్లో పెట్టి జగన్ కు అందివ్వగల సామర్థ్యం ఉన్న ఓటు బ్యాంక్. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా దాన్ని భగ్నం చేయడం అసాధ్యం. మరి దుర్భేద్యమైన ఈ ఓటు బ్యాంక్ జగన్ కు పూర్తి మద్దతు తెలిపితే అది ప్రత్యర్థుల మీద అణుబాంబు పడ్డట్టే. మరి ఈ ఓటు బ్యాంక్ నిర్మాణంలో జగన్ ఎంతవరకు సఫలమవుతారో కాలమే చెప్పాలి.