భారతదేశంలో ఇంతవరకూ కనీవినీ ఎరుగని అపూర్వఘట్టం! న్యాయవ్యవస్థను, రాజకీయవ్యవస్థను అతి పెద్ద కుదుపుకు లోను చేసిన సంఘటన…అత్యంత దుర్భేద్యమైన న్యాయవ్యవస్థ మీద నోరు విప్పడానికి తలపండిన రాజకీయవేత్తలు సైతం భయపడతారు. రాజకీయరంగంలో చేరేవారికి విద్యార్హతలు అవసరం లేదు. ఐదో తరగతి తప్పినవాడు కూడా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి సైతం అయిపోగల స్వేచ్ఛ మన రాజ్యాంగం కల్పించింది. కానీ, న్యాయమూర్తి కావాలంటే న్యాయశాస్త్రాన్ని మధించాలి. న్యాయవాదిగా పదేళ్ళపాటు ప్రాక్టీస్ చెయ్యాలి. కేసుల్లో విజయం సాధించాలి…ఇంకా అనేకానేక అర్హతలు ఉంటాయి. అందుకే న్యాయమూర్తులు చాల సున్నితంగా ఉంటారు. వారిని నిందలతో బాధిస్తే ఆ ప్రభావం వారి వృత్తి మీద పడుతుందనే ఉద్దేశ్యంతో రాజ్యాంగపరంగా న్యాయమూర్తులకు రక్షణ కల్పించారు. వారిని విమర్శిస్తే కంటెంప్ట్ అఫ్ కోర్ట్ కింద కేసు పెట్టి శిక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. అందుకే వారి తీర్పులు నచ్చినా నచ్చకపోయినా వారిని విమర్శించడానికి ఎవరూ సాహసించరు.
ఎవ్వరూ ఊహించని సాహసం
అలాంటి మనదేశంలో ఏకంగా న్యాయవ్యస్థపై రణభేరి మోగించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఔరా! ఏమా సాహసం!! అంటూ నిఖిల ప్రపంచం నిరుత్తరులై చూస్తుండగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు ఎలా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారో, ప్రభుత్వాన్ని ఎలా అడ్డుకుంటున్నారో, ఏవిధంగా చంద్రబాబు కోరికలను శాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని తీర్చుతున్నారో, వారికి సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ ఎలా సహకరిస్తున్నారో ఆధారాలు సాక్ష్యాలతో సహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మొన్న ఢిల్లీ వెళ్ళినపుడు అందించినట్లు ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లమ్ ప్రకటించడం యావద్దేశం నిర్ఘాంతపోయింది! ఎసిబి విచారణలు అడ్డుకోవడం, నేరగాళ్లకు రక్షణగా నిలవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ నైతికంగా బలహీనను చెయ్యడానికి న్యాయమూర్తులు ప్రయత్నించడం మొదలైన అక్రమాలకు గౌరవ హైకోర్టు పాల్పడుతున్నదని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకంతో సుప్రీమ్ కోర్టుకు లేఖ వెళ్లడం ప్రకంపనలు సృష్టించింది. ఎల్లో మీడియా ఆ వివరాలను ప్రసారం చేయకపోవచ్చు…ప్రచురించక పోవచ్చు…కానీ, జాతీయస్థాయి పత్రికలు మాత్రం హెడ్ లైన్స్ లో ప్రచురించాయి. కొన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ జగన్ చేసిన ఫిర్యాదుపై ట్వీట్స్ చేశాయి.
హద్దులు మీరుతున్న హైకోర్టు
నిజానికి ఇలాంటి దృశ్యాన్ని చూసేరోజు దగ్గర్లోనే ఉన్నదని నేను ఏనాడో ఊహించాను. కానీ, మరీ ఇంత దగ్గరగా వస్తుందని మాత్రం అనుకోలేదు. గత ఏడాది కాలంగా తమ ప్రభుత్వాన్ని చీకాకు పెడుతున్నప్పటికీ, వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగ వ్యవస్థ అయిన ప్రభుత్వాన్ని కించపరుస్తున్నా, జగన్ ప్రభుత్వం అత్యంత సంయమనాన్ని ప్రదర్శించింది. చివరకు పదిమంది కరోనా రోగుల మరణానికి కారకుడైన డాక్టర్ ను అరెస్ట్ చెయ్యకూడదని, కేసులు పెట్టకూడదని, విచారణ చెయ్యకూడదని ప్రభుత్వ అధికారాన్ని ధిక్కరించే స్థాయికి హైకోర్టు ఆగడాలు పెరిగిపోయాయి. ఇక మౌనం వహించి లాభం లేదని, తాడోపేడో తేల్చుకోవాలని జగన్ తన పులిపంజా విసిరినట్లు తేటతెల్లం అవుతున్నది. న్యాయమూర్తుల నామధేయాలను ఉటంకిస్తూ ఒక్కొక్కరు ఎన్నెన్ని అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో, ఎవరికి మేలు కలిగే విధంగా తీర్పులు ఇస్తున్నారో సోదాహరణంగా సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి సమర్పించారంటే జగన్ ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారనేది సుస్పష్టం.
అవధులు లేని పరాక్రమం
హైకోర్టు న్యాయమూర్తుల మీద ఆరోపణలు చెయ్యడం ఒక ఎత్తైతే, మరో ఆరు మాసాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న జస్టిస్ ఎన్వీ రమణపై నేరుగా పేరుపెట్టి మరీ ఆరోపణాస్త్రాలు సంధించడానికి ఎంత గుండె ధైర్యం కావాలి? అందులోనూ తనమీద అక్రమార్జన కేసులు ఉన్నాయి. వాటి విచారణలో భాగంగా కొన్నాళ్లు రిమాండ్ ఖైదీగా గడపాల్సివచ్చింది. వాటి మీద విచారణ జరగబోతోంది. అయినప్పటికీ ఏమాత్రం అదరక బెదరక, న్యాయమూర్తుల అవినీతిపై, అక్రమాలపై జగన్ పాంచజన్యం పూరించారంటే అసలు జగన్ అంటే ఏమిటో అర్ధం కావడం లేదు. తనను కుట్రపూరితంగా జైలుకు పంపించినా సరే, న్యాయవ్యవస్థ అంతు తేల్చడానికి జగన్ సిద్ధమయ్యాడంటే…వామ్మో….
న్యాయమూర్తులు కూడా అవినీతికి అతీతులు కారు అంటూ దేశం మొత్తం ఢంకా కొట్టి మరీ చెప్పేశాడు జగన్.
ఇపుడేం జరుగుతుంది?
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి…న్యాయమూర్తుల పట్ల చేసిన ఆరోపణలను ఆధారాలతో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి సమర్పించిన తరువాత….ఆ సమర్పించిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించిన తరువాత…సుప్రీమ్ కోర్ట్ తగిన చర్యలు తీసుకోకుండా ఉండటం సాధ్యం కాదేమో! జగన్ ఇంతటితో ఆగుతాడని నేను అనుకోను. సుప్రీమ్ కోర్ట్ చర్యలు సంతృప్తికరంగా లేకపోతే ప్రధానమంత్రి, రాష్ట్రపతిని సైతం కలిసి మళ్ళీ వినతిపత్రాలు ఇచ్చే అవకాశం ఉన్నది. జస్టిస్ రమణ మీద జగన్ లిఖిత పూర్వకంగా చేసిన ఆరోపణల కారణంగా ఆయన విచారణ ఎదుర్కోక తప్పదేమో…తాత్కాలికంగానైనా ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకం ఆగిపోతుంది. ఒకేవేళ ఆయన్నే ప్రధాన న్యాయమూర్తిని చేస్తే అవినీతి ఆరోపణలున్న వ్యక్తిని సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని చేశారన్న అపఖ్యాతి శాశ్వతంగా ప్రధాని, రాష్ట్రపతుల ఖాతాల్లో నిలిచిపోతుంది. అవినీతి ఆరోపణలున్న వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారంటే విదేశాల్లో కూడా మన ప్రతిష్ట దిగజారవచ్చు.
ఏ విధంగా చూసినా, జగన్ విసిరిన ఆఘాతం మామూలుగా లేదు. జగన్ ఇంతగా ప్రళయకాలరుద్రుడుగా మారుతాడని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. ఈ విషయంలో జగన్ విజయం సాధించనీ లేకపోనీ, ఒక పటిష్టమైన వ్యవస్థలోని లొసుగులను నిర్భయంగా బయటపెట్టి పోరాడిన వీరాధివీరుడుగా జగన్ కీర్తిచంద్రికలు కలకాలం నిలుస్తాయి. భవిష్యత్తులో జగన్ తో మరికొన్ని గొంతులు కలవడం ఖాయం. కోర్టుల వ్యవహారశైలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇతర ముఖ్యమంత్రులు కూడా జగన్ కు చేదోడుగా నిలుస్తారు. ప్రజల్లో ఇప్పటికే న్యాయవ్యవస్థ చులకన అయిపొయింది. ఇక ప్రజలు కూడా గొంతులు విప్పాల్సివస్తుందేమో! ఒక తేనెతుట్టెను కడు ధైర్యంతో కదిపాడు జగన్మోహన్ రెడ్డి! ఇంతటి సాహసాన్ని ప్రదర్శించిన ముఖ్యమంత్రిని భారతదేశం ఇంతవరకూ చూడలేదు. జగన్ విసిరిన ఖడ్గం వ్యవస్థల దుర్మార్గాలను ఖండిస్తుందా లేక జగన్ నే బలి తీసుకుంటుందా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. పిరికితనం అనే లక్షణం రక్తంలో లేనివాడు ఎలా ఉంటాడో జగన్ నిరూపించాడు. ప్రళయగర్జన చేసే మృగరాజుకు ముందు చూపే కానీ వెనుకచూపు ఉండదు కదా!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు