పాకిస్థాన్‌తో సంబంధాలపై యూట్యూబర్‌పై నిఘా.. వ్యక్తిగత డైరీలో పాజిటివ్ నోట్స్!

Jyoti Malhotra: ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ప్రస్తుతం తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ‘ట్రావెల్ విత్ జో’ అనే పేరుతో ట్రావెల్ వీడియోలు చేసే ఈ యువతి, పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలతో హర్యానా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మే 16న హిసార్‌ జిల్లాలోని న్యూ అగర్సైన్ ఎక్స్‌టెన్షన్‌లో ఆమెను అదుపులోకి తీసుకుని, ఆధారాలను సేకరిస్తున్నారు.

ఈ కేసు ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), మిలిటరీ ఇంటెలిజెన్స్‌ అధికారుల చొరవతో విచారణ దశలో ఉంది. జ్యోతి నివాసంలో జరిపిన సోదాల్లో ఆమె వ్యక్తిగత డైరీ, పాత పత్రాలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేకంగా డైరీలోని పేజీలు ఇప్పుడు దర్యాప్తుకు కీలకంగా మారాయి.

ఆమె 2012 క్యాలెండర్‌తో ఉన్న పాత డైరీలో పాకిస్థాన్ పర్యటన గురించి రాసిన విషయాలు, ప్రేమపూర్వకంగా వివరించిన అనుభవాలు చర్చనీయాంశంగా మారాయి. “పాకిస్థాన్ ప్రజలు ఎంతో ఆదరించారు”, “లాహోర్‌లో రెండు రోజులు సరిపోలేదు”, “మనసుల్లోని బాధలు పోతే సరిహద్దుల దూరం ఎప్పటికైనా తగ్గిపోతుంది” వంటి వ్యాఖ్యలు ఆమె భావోద్వేగాన్ని తెలియజేస్తున్నాయి.

అయితే, ఈ అభిప్రాయాలు సాధారణ పర్యాటక అనుభవంగా చూసే వారున్నారు, మరోవైపు దీనిని పాకిస్థాన్‌కు సహానుభూతిగా భావిస్తూ గూఢచర్యానికి ముడిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. “పాకిస్థాన్‌లో ఆలయాలు తెరచాలి, హిందువులకు వీసా సౌలభ్యం ఉండాలి” అంటూ ఆమె రాసిన అభిప్రాయాలు కొందరికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. విచారణ పూర్తయ్యే వరకు ఇది అనుమానమే కానీ, ఆమె వ్యాఖ్యల ప్రభావం మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.