ప్రస్తుత రోజుల్లో గుండె పరీక్ష అనేది వృద్ధులకు మాత్రమే సంబంధించినది అన్న రోజులు పోయాయి. భారత్‌లో యువతలోనే గుండె సంబంధిత సమస్యలు అలార్మింగ్ స్థాయికి చేరుకోవడం, అందులోను ఆరోగ్యవంతులుగా కనిపించే యువకులు కూడా ఆకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశం. ముఖ్యంగా 20, 30 ఏళ్ల వయసులోనే హార్ట్ ఎటాక్‌లు జరగడం, పూర్తి ఆరోగ్యవంతులుగా కనిపించే క్రీడాకారులు, సినీ తారలు కూడా ఈ ప్రమాదానికి లోనవ్వడం అందరికీ షాక్ ఇస్తోంది.
కార్డియాలజీ నిపుణులు చెబుతున్నది ఏంటంటే.. ఈ గుండె సమస్యల వెనుక ప్రధాన కారణం మన జీవనశైలి మార్పులే అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి జీవనశైలి కారణంగా వచ్చే అధిక ఒత్తిడి, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, ధూమపానం, మద్యం.. ఇవన్నీ యువతలోనే గుండె సమస్యలకు ప్రధాన కారణాలు అవుతున్నాయి. గత దశాబ్దంలో ఈ సమస్యలు గణనీయంగా పెరిగాయి. అందుకే వృద్ధులే కాదు, యువత కూడా గుండె పరీక్ష చేయించుకోవడం తప్పనిసరని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది యువత ఫిట్‌గా కనిపించే ప్రముఖులు కూడా ఒక్కసారిగా గుండె సమస్యలతో ఆసుపత్రి చేరి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కేవలం నగరాల్లోనే కాదు, చిన్న పట్టణాల్లో కూడా యువతలో ధూమపానం, మద్యం, పొగాకు వంటి వ్యసనాల ప్రభావం ఎక్కువైపోతోందని చెబుతున్నారు. ఒకప్పుడు గుండె పోటు అంటే పెద్దల సమస్య అనుకునే వారు. ధమనులలో కొవ్వు నిల్వలు పెరగడం వల్ల గుండెపోటు రిస్క్ ఎక్కువ అవుతుందని భావించేవారు. కానీ ఇప్పుడు 30–45 ఏళ్లలోపు వయసువారిలోనే ఈ వ్యాధి తలెత్తుతోంది. ఇది యువతకు డెంజర్ సిగ్నల్ అని, ముందే గుండె పరీక్షలు చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అందుకే అప్పుడప్పుడు యువత గుండె పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఏవైనా సమస్యలు ఉన్నాయా.. ఉంటే ఎలాంటి జీవనశైలి మార్పులు చేయాలి.. దానిని ముందే గుర్తించి చికిత్స ప్రారంభించడం చాలా అవసరం. సరైన ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లు మార్చువడం.. ఇవన్నీ మన హృదయాన్ని కాపాడటానికి తప్పనిసరి మార్గాలు అని చెబుతున్నారు. అందుకే ఇక మీదట గుండె పరీక్ష వృద్ధులకే అని నిర్లక్ష్యం చేయకండి. ఒకసారి చేసుకుని చూడటం… ప్రాణాలను కాపాడే ముందస్తు అస్త్రం.
