సర్వశక్తులు ఒడ్డి ఆయన్ను హీరోని చేసిన వైకాపా 

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రధాన సమస్యల్లో రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సమస్య ఒకటి.  ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీని ముప్పతిప్పలు పెడుతున్న అధికార పక్షం సొంత ఎంపీ విషయంలో మాత్రం నానా తంటాలు పడుతోంది.  ఒక్కడికి వ్యతిరేకంగా పార్టీ మొత్తం పనిచేస్తున్నా ఏమీ సాధించలేకపోతున్నారు.  మొదట రాఘురామరాజు సామాజిక వర్గానికి చెందిన నేతలతోనే విమర్శలు చేయించి ఆయన దిష్టిబొమ్మలను సైతం దగ్దం చేసిన వైకాపా ద్వితీయాస్త్రంగా షోకాజ్ నోటీసును వాడింది.  కానీ రఘురామరాజు తెలివిగా దాన్నే తిప్పి వైకాపా వాడుక నామానికే ముప్పు తెచ్చారు.  
 
 
ఇక ఆ తర్వాతి ఆయిధంగా వైకాపా నేతల బృందం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి స్పీకర్ ద్వారా అనర్హత వేటు వేయించాలని చూస్తున్నారు.  కానీ సాంకేతికంగా అది కూడా అసాధ్యం.  ఎందుకంటే రఘురామరాజు అనర్హత వేటుకు గురయ్యేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, అనుచిత చర్యలకు పాల్పడలేదు.  తాజాగా విజయసాయిరెడ్డి రాష్ట్ర బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణను విమర్శించడంతో ఢీల్లీ పెద్దల మద్దతు దొరకని పరిస్థితి.  ఇక తాజాగా వైకాపా ఎమ్మెల్యేలు రఘురామరాజు మీద పోలీస్ పిర్యాధులు చేస్తున్నారు.  వీటి వలన కూడా రఘురామరాజు పదవికి వచ్చే డోకా ఏమీ ఉండదు.  ఇవన్నీ చూస్తున్న రాఘురామరాజు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 
 
 
వైకాపా మొత్తం ఒకవైపు చేరి ఒక్క ఎంపీని టార్గెట్ చేస్తుండటంతో ఆయన కాస్త బాగా ఫేమస్ అయిపోతున్నారు.  ఇప్పుడు ఏపీలో రఘురామరాజు పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.  ఒక్కమాటలో చెప్పాలంటే రఘురామరాజును వైకాపా ఒక రెబల్ హీరోను చేసింది.  ఇంకా చేస్తోంది కూడ.  ఒక వ్యక్తిని పది మంది చుట్టుముట్టి పడగొడితే పడిన వ్యక్తి మీదే సానుభూతి పెరుగుతుంది, అతనికే హీరోయిక్ ఇమేజ్ ఆపాదించబడుతుంది.  ప్రజెంట్ రఘురామరాజు పొజిషన్ అదే.  భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైకాపా ఒక ఎంపీ మీదకు సర్వ శక్తులు ఒడ్డుతుండటం ప్రజలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. 
 
 
సరిగ్గా రాజకీయం తెలిసిన ఏ నాయకుడూ ఇలా చేయరని, కేవలం ఒక ఎంపీని లొంగదీయడానికి సర్వం దారబోయరని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  ఈ పోరులో ఒకవేళ రఘురామరాజు ఓడినా కూడా కావాల్సినంత సింపతీని, పాపులారిటీని పొందుతారు.  ఒకవేళ వైకాపా ఓడితే పరువు పోగొట్టుకుంటుంది.  అన్నీ తెలిసే రఘురామరాజు పార్టీ నుండి బయటికి పోవట్లేదు.  అధిష్టానం క్రమశిక్షణా పరమైన చర్యలతో బహిష్కరిస్తే దర్జాగా బీజేపీలో చేరిపోవాలనేది ఆయన వ్యూహం.  ఆ ప్రకారమే సొంత పార్టీని రెచ్చగొడుతూ ఇంత వరకు తీసుకొచ్చారు.  ఇదేమీ గ్రహించలేని వైకాపా ఈగోతో రెచ్చిపోయింది. 
 
 
చివరకు ఒక సింగిల్ ఎంపీ మీద, అదీ సొంత ఎంపీ మీద ఫెయిల్యూర్ ప్రతాపం చూపుతున్న పార్టీ అనే అప్రదిష్టను మూటగట్టుకుంది.  సిసలైన రాజకీయం తెలిసిన వేరే ఏ పార్టీ అయినా ఇలాంటి విషయాల్లో వైకాపా తరహాలో వ్యవహరించి ఉండేది కాదు.ఇక ఈ అంశంలో అధిష్టానానికి సలహాలు ఇస్తున్న సలహాదారులు కూడా పంతంతో ఆలొచిస్తున్నారే తప్ప నెగ్గగల సలహా ఒక్కటి కూడా ఇవ్వలేదు.  ఇకనైనా వైకాపా మేలుకుని రాఘురామరాజు తమకు అక్కర్లేదు అనుకుంటే పార్టీ నుండి బహిష్కరించి చేతులు దులుపుకోవడమో లేదా ఇంత జరిగినా ఆయన తమ పార్టీలో ఉండాల్సిందే అనుకుంటే ఆయన మానాన ఆయన్ను ఒదిలేయడమో చేయాలి.  అంతేకానీ ఇంకా పొడిగించుకుంటూ పోతే స్వయంకృతాపరాధం తప్ప ఏమీ మిగలదు.