యముడి ప్రభావం అధికంగా ఉండే సమయం ఇదే.. ఆ తప్పులు చేస్తే యమపురికే..!

రాహుకాలం అశుభ సమయమని పండితులు చెబుతుంటారు. ఈ సమయంలో పనులు ప్రారంభిస్తే అవి సకాలంలో పూర్తికావని.. అడ్డంకులు ఎదురవుతాయని పండితులు చెబుతుంటారు. అయితే రోజులో రాహుకాలమే కాకుండా ప్రమాదకరమైన మరో సమయం ఉందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.. అదే యమగండం. ఇది ప్రతిరోజూ సుమారు గంటన్నర పాటు ఉంటుంది. పేరు చెప్పినట్లుగానే ఇది యమధర్మరాజుతో ముడిపడి ఉంటుంది. అందుకే ఈ సమయంలో చేసే పనులు మంచికన్నా చెడు ఫలితాన్నే ఇస్తాయని పూర్వీకులు, పండితుల నమ్మకం.

జ్యోతిష్కుల ప్రకారం, యమగండం మృత్యువుకు సంకేతం.. ఇది ఆటంకాల సమయం. ఈ సమయంలో నిర్లక్ష్యంగా వాహనం నడపడం అంటే మృత్యువుకి ఆహ్వానం పలకడమే అంటారు. ఎందుకంటే యమధర్మరాజు ప్రభావం ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. జరిగిన ప్రమాదం ప్రాణాలు తీసిపోకపోయినా, ప్రాణం తీయడానికి సమానమైన కష్టాలు తెస్తుందని విశ్వసిస్తారు.

భారతీయ సంస్కృతిలో శుభముహూర్తానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో, అశుభ సమయంలో జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యమని పండితులు చెబుతున్నారు. యమగండంలో వివాహం, నిశ్చితార్థం, గృహప్రవేశం, శుభారంభాలు చేయడం పూర్తిగా నిషేధం. ఎందుకంటే ఈ కాలంలో మొదలుపెట్టిన పనులు ఆగిపోవడం, మధ్యలో అడ్డంకులు రావడం లేదా అసలు ఫలితం లేకపోవడం జరుగుతుందని విశ్వాసం.

కొన్ని సందర్భాల్లో సంతానం పుట్టినా అది యమగండ సమయంలోనే జరిగితే తగిన శాంతి చేయించాల్సిందేనని పెద్దలు అంటారు. లేకపోతే ఆ పిల్లవాడి జీవితంలో నిరంతరం ఆటంకాలు ఎదురవుతాయని భావిస్తారు. అదే సమయంలో ఒక జీవన చక్రం ముగింపును సూచించే మరణ సంస్కారాలు, అంత్యక్రియలు మాత్రం ఈ కాలంలో చేయడం ఆచారం.

ప్రతి రోజు ఉదయం సూర్యోదయానికి అనుగుణంగా యమగండం సమయం మారుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎనిమిది భాగాలుగా విభజిస్తే దినచర్యలో ఇది ఒక ప్రత్యేక భాగం. అందుకే జ్యోతిష్కులు శుభం కోసం ఎంత కష్టపడితే, అశుభాన్ని దూరం పెట్టడంలో అంత జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు. భక్తి, భయం, విశ్వాసం.. ఇవన్నీ కలగలిపిన ఆచారంలో యమగండం ఒక అశుభ చిహ్నం మాత్రమే కాదు, మనం ప్రారంభించే పనుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండమని గుర్తు చేసే సమయమని కూడా పెద్దలు చెబుతుంటారు.