ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)పై సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పథకం ప్రకారం ఓట్ల చోరీ జరిగిందని, దీని వెనుక ప్రధాని మోదీ ఉన్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఆధారాలతో మాట్లాడుతుంటే, ప్రధాని మోదీ బండారం బయటపడుతోందని ఆమె గురువారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
సాఫ్ట్‌వేర్‌ను హైజాక్ చేసి, ఆటోమేటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఓట్లను తొలగించడం దేశద్రోహంతో సమానమని షర్మిల అభిప్రాయపడ్డారు. నకిలీ ధృవపత్రాలు, తప్పుడు ఫోన్ నంబర్లతో ఓట్లను అక్రమంగా తొలగించడాన్ని ఉగ్రవాద చర్యగా ఆమె వర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘం, బీజేపీకి కీలుబొమ్మగా మారిందని ఆమె ఆరోపించారు. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాస్తూ, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆమె దుయ్యబట్టారు.
రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన విధంగా, తొలగించిన ఓటర్ల పూర్తి వివరాలను, వాటికి ఉపయోగించిన ఫోన్ నంబర్లు, ఓటీపీల సమాచారాన్ని వారం రోజుల్లోగా బహిర్గతం చేయాలని షర్మిల ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న వారికి ఈసీనే రక్షణ కల్పిస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు.
“ప్రధాని మోదీ కోసం అవసరమైన చోట దొంగ ఓట్లు సృష్టించడం, కాంగ్రెస్‌కు అనుకూలమైన చోట ఓట్లు తొలగించడం ద్వారా ఈసీ తన స్వయంప్రతిపత్తిని కోల్పోయింది” అని షర్మిల పేర్కొన్నారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తుందనే ఉద్దేశంతోనే, నకిలీ లాగిన్ల ద్వారా సుమారు 6 వేల ఓట్లను తొలగించారని ఆమె ఆరోపించారు.


