తాజాగా భారత్ వేదికగా జరిగిన మహిళల క్రికెట్ వన్డే వరల్డ్ కప్ను టీమిండియా అద్భుత ప్రదర్శనతో కైవసం చేసుకుంది. ఈ విజేత జట్టులో సభ్యురాలిగా ఉన్న కడప బౌలర్ నల్లపురెడ్డి శ్రీచరణి రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి వచ్చిన శ్రీచరణికి, సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ స్వయంగా ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబుతో భేటీ అయిన ఆమె.. వరల్డ్ కప్ విశేషాలు పంచుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్… మహిళల క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని అభినందించారు.

ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు శ్రీచరణి ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు వారికి తెలిపారు.
శ్రీచరణికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జట్టులోని తోటి క్రికెటర్లకు ఆయా రాష్ట్రాలు నజరానాలతో పాటు ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి.

ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో కడప లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. తద్వారా టీమిండియా చారిత్రాత్మక తొలి ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించింది. శ్రీచరణి ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టింది. తద్వారా టోర్నీలో భారత్ తరపున రెండవ అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గానూ నిలిచింది. కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన శ్రీచరణి, వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై అద్భుత ప్రదర్శనతో తన సత్తా చాటుకుంది.
ఈ ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న శ్రీచరణికి… హోంమంత్రి వంగలపూడి అనిత, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ ఛైర్మన్ రవి నాయుడు తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి విజయవాడకు శ్రీచరణిని భారీ ర్యాలీగా తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీచరణి, మిథాలీ రాజ్‌ను ఎంపీలు, మంత్రులు, శాప్ ఛైర్మన్ వెంటపెట్టుకుని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.

