ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో సంభవిస్తున్న పరిణామాలు పరిశీలిస్తే మున్ముందు దేశ సమగ్రతకు పెను సవాళ్లు ఎదురు కానున్నాయి. అటు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇటు వివిధ రాష్ట్రాలలో అధికారంలో వున్న ప్రాంతీయ పార్టీలనేతల వ్యవహార సరళి పెడదారి పడుతున్నాయి. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వున్న సమయంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య పలు సందర్భాల్లో ఘర్షణలు తలెత్తాయి.
కేరళలో నంబూద్రి పాద్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అదే విధంగా ఎన్ టి రామారావు అధికారం చేపట్టిన సందర్భంలో గవర్నర్ ను ఉపయోగించి రాజ్యాంగ ఉల్లంఘనకు తలపడింది. ఇంకా చెప్పాలంటే హిందీ భాష అంశంలో తమిళ నాడులో పెద్ద ఉద్యమమే సాగింది. ఇందిర గాంధీ అత్యవసర పరిస్థితి విధించి పౌర హక్కులను అతి క్రూరంగా అణచివేశారు. అందుకు వ్యతిరేకంగా జయ ప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవంపేర దేశ వ్యాప్తంగా ఉద్యమం సాగింది. పలువురు నేతలను ఎట్టి విచారణ లేకుండా డిటెన్యూలుగా జైలు పాలు చేశారు.
ఇన్ని విపత్కర పరిస్థితులు సంభవించినా ఏనాడు దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం గోచ రించలేదు. ప్రతి సందర్భంలో కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య తలెత్తిన సంఘర్షణ రాజకీయ నేతలు అధికారుల అతినీతి అంశాలపై పోరాటం సాగలేదు. ఏ సమయంలో కూడా ప్రాంతీయ పార్టీల నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేసినపుడు అవినీతికి పాల్పడిన నేతలను అధికారులను కాపాడేందుకు వీధుల్లోనికి వచ్చి ధర్నాలకు దిగలేదు. తమ వారిని కాపాడుకొనే ఆరాటాన్ని ప్రజా స్వామ్యం దేశ భవిష్యత్తు కాపాడే పోరాటంగా చిత్రించలేదు.
అయితే నేడు అంతా తద్భిన్నంగా సాగు తోంది. ప్రాంతీయ పార్టీల నేతలు తమతమ రాష్ట్రాలకు సర్వ సత్తాక ప్రతి పత్తి గల పాలకులుగా వ్యవహరించు తున్నారు. తమ నేతలు అధికారులు దిగబడిన అవినీతి కూపం నుండి వారిని కాపాడే క్రమంలో ప్రజా స్వామ్యం దేశం ప్రమాదంలో పడిందని చెప్పి ప్రజలను నమ్మించేందుకు విఫల యత్నం చేస్తున్నారు.
ఈ దొంగాటకు ప్రధమంగా ఎపిలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. 2014 టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు నెలల్లో అధికారుల బదలీలో డబ్బు చేతులు మారి అవినీతి కంపు ముక్కు పుట్టాలను అదర గొట్టింది. చాల మందికి గుర్తు వుండక పోవచ్చు. ఈ సందర్భంగా ఒక ఎన్ జి ఓ నేత తిరుపతిలో మాట్లాడుతూ ముందుగా రాజకీయ అవినీతి కట్టడి చేయండి. తదుపరి అధికారులు అవినీతికి అడ్డుపడు తుందని సవాలు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోటీ కాళ్ళుగా వున్న మీడియానే పలుమార్లు ఇసుకేస్తే రాలనంత అని చెక్ డ్యాం ల్లో కోట్లు కొట్టుకు పోయాయని వింత వింత కథనాలు వండి వార్చింది. బ్యాంకులను మోసం చేసినకేసులలో టిడిపి నేతలు ఎంత మంది లేరు.? ఇద్దరు ఎమ్మెల్సీలను పార్టీ నుండి తూ తూ మంత్రంగా సస్పెండ్ చేశారు కదా?రాష్ట్రంలో పన్నులు ఎగొట్టిన సంస్థలపై దాడులు జరిగితే ముఖ్యమంత్రి కి వచ్చిన బాధ ఏమిటి?
ఈ నేపథ్యంలో ఎపిలోనికి సిబిఐ రాకుండా టెక్నికల్ సాకు చూపి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. అంత వరకైతే పర్వాలేదు. ఈ ప్రకోపం ఎంత వరకు వెళ్లిందంటే కేంద్ర నిధులు ఇవ్వడం లేదు కాబట్టి మేము పన్నులు ఎందుకు కట్టాలని రాజ్యాంగ బద్ద పదవిలో వున్న ముఖ్యమంత్రి మాట్లాడటం ఆశ్చర్య మేస్తోంది. రాజధాని హైకోర్టు అంతా కోస్తాలో నెల కొలపడంపై సీమలో తీవ్ర మైన అసంతృప్తి వుంది. తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని ఉద్యమాలు సాగుతున్నాయి. రేపు ఆ ప్రాంతం వాళ్ళు మేము పన్నులు కట్ట మంటే ముఖ్యమంత్రి ముఖం ఎక్కడ పెట్టు కుంటారు?
ఎపి ముఖ్యమంత్రి వద్ద పాఠాలు నేర్చుకొన్నారేమో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవినీతి ఆరోపణలు వున్న పోలీసు అధికారిని ప్రశ్నించేందుకు వచ్చిన సిబిఐ అధికారులను నిర్బంధించడమే కాకుండా వీధుల్లో కూర్చుని ధర్నా దిగడం ఏరక మైన ప్రజా స్వామ్యం? పైగా ఈ కేసు సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశాలతో విచారణ సాగుతోంది.ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు విభ్రాంతి కరంగా వున్నాయి. సిబిఐ ఆఫీసును రాష్ట్ర పోలీసులు చుట్టు ముడితే వీరందరిని కేంద్ర బలగాలు ముట్టడి చేశాయి. పైగా రాజకీయాలు ఎట్లుండినా మరొక రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి అంగీకరించ లేదంటే ఈ ధోరణి దేశాన్ని ఎక్కడికి తీసు కెలుతుందో? ఇంకొక కొస మెరుపు ఏమంటే ఆ మధ్య మమత బెనర్జీ నిర్వహించిన బహిరంగ సభను మించి పోయే విధంగా మార్క్సిస్టు పార్టీ లక్షలాది మందితో సభ నిర్వహించితే ఆ ప్రభావం ప్రజలపై పడకుండా మరో రచ్చకు ఆమె తెరదీశారు. ఒకవేపు వామపక్షాలు మరో వేపు బిజెపి చుట్టు ముడు తుంటే ఊపిరి సలప లేక ముఖ్యమంత్రి వీధుల కెక్కిందేమో.
ప్రాంతీయ పార్టీల నేతల విచ్చినకరమైన విధాలకు తోడు ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు దేశ సమైక్యతకు ముప్పు తెచ్చే విధంగా వున్నాయి. కేరళలో అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశంపై సర్వోన్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంటే తిరిగి కోర్టును ఆశ్రయించకుండా తన పార్టీ వారిచేత ఆందోళన చేయించారు. పైగా కేరళ వెళ్లి రాష్ట్రం ప్రభుత్వంపై రాళ్ళు వేసి వచ్చారు. దీంతో ప్రధాని దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం ఏమిటి? కోర్టు తీర్పులు నచ్చని వారు తిరిగి కోర్టు తలుపులు తట్ట కుండా వీధుల్లో తేల్చుకోమనేనా?
ఈ దేశంలో అవినీతి అక్రమాలు లేని రాష్ట్రంలేదు. అందరూ గొంగటిలో అన్నం తింటూ వున్నారు. ఈ స్థితిలో ఎవరైనా వెంట్రుకలు వెతకితే ప్రజలను మోసం చేయడమే. వచ్చే ఆరు నెలల తర్వాత ఎవరు రాజో ఎవరు పకీరు తెలియని పరిస్థితిలో అందునా ప్రతి పక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ లాంటి దాడులు జరిగితే వాస్తవంలో వారు అవినీతికి పాల్పడి వున్నా రాజకీయ మాటున సులభంగా తప్పించు కొనే వీలు కేంద్ర ప్రభుత్వమే కల్పించుతోంది. అదే సమయంలో బిజెపి తనను తను ఆత్మ హననం చేసు కొంటోంది.
(వి. శంకరయ్య ::ఫోన్ నెం. 9848394013 )