బీహార్‌లో బీజేపీ దుమ్ము రేపింది.. మధ్యప్రదేశ్‌లోనూ సత్తా చాటింది.. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గాలి గట్టిగానే వీచింది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ గెలిచాక, ఆ పార్టీ శ్రేణులు, తమ తదుపరి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అంటున్నాయి. అయితే, దేశంలోని మిగతా రాష్ట్రాలకూ, ఆంధ్రప్రదేశ్‌కీ చాలా తేడా వుంది. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌లను పోల్చిచూసినా స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి రాజకీయంగా.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి ప్రత్యర్థి ఎవరు.?
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కి పోటీ ఇచ్చే బలమైన పార్టీ ఏది.? అన్నదానిపై గందరగోళం వుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అయినా, ఆ పార్టీ నాయకత్వ లేమితో సతమతమవుతోంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అత్యంత తయనీయం తెలంగాణలో. ఇక, బీజేపీ తెలంగాణలో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. అందులో ఒకటి మజ్లిస్ వ్యతిరేక ఓటు బ్యాంకు. దాంతో, బీజేపీ.. తెలంగాణలో తన సత్తా చాటడానికి కొన్ని అవకాశాల్ని పొందుతోంది, వాటిని సద్వినియోగం చేసుకుంటోంది కూడా.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి పూర్తి భిన్నం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికొస్తే, బీజేపీ అక్కడ ఏనాడూ ప్రధాన రాజకీయ పార్టీ అన్న చందాన వ్యవహరించలేదు. కీలక విషయాల్లో బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌కి మొండిచెయ్యి చూపుతూ వస్తోంది. ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకు కొంతైనా అక్కడ వుందా.? అంటే అదీ లేదు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా అధికార వైసీపీకి ప్రత్యామ్నాయం టీడీపీనే. ఒకవేళ టీడీపీ పూర్తిగా నిర్వీర్యమైపోతే, అప్పుడు ఇంకో పార్టీ ఆ ఖాళీని భర్తీ చేసే అవకాశముంటుంది.. కానీ, ఆ ఛాన్స్ బీజేపీకి రావడం కష్టమే. కొద్దోగొప్పో టీడీపీ తర్వాత అడ్వాంటేజ్ జనసేనకే వుండొచ్చు.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే..
తెలంగాణలో టీడీపీ కంటే, కాంగ్రెస్ కంటే బీజేపీ బాగా ఫేర్ చేయగలదని ఎవరైనా ఊహించారా.? కానీ, బీజేపీ సాధించింది. కాబట్టి, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎదిగేందుకు అవకాశాలున్నాయి తప్ప.. రాష్ట్ర రాజకీయాల్ని ఇప్పట్లో బీజేపీ శాసించేంత సీన్ లేదు. అలాగని, బీజేపీ.. ఏపీలో పుంజుకోవడం అసాధ్యమని చెప్పలేం. వైసీపీకి ధీటుగా ఎదగాలంటే, బీజేపీ కేంద్ర నాయకత్వం.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల సానుకూలంగా వుండాలి.
