నారింజలను యాపిల్ తో పోల్చలేరు… బీజేపీ సర్కార్ ని ఏకిపారేసిన సుప్రీంకోర్టు!

ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో 2002 ఫిబ్రవరిలో జరిగిన గోద్రా రైలు దహనం ఘటన గురించి ప్రత్యేకంగ చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో హిందూ కరసేవకులు పలువురు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఒక వర్గంపై గుజరాత్ లో దాడులు జరిగాయి. ఈ ఘటనలో బిల్కిస్ బానో అనే మహిళ పై గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా ఆమె కుటుంబ సభ్యుల్లో ఏడుగురిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనలో 11 మంది జైలుశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే! అయితే… ఇప్పుడు వారు బయట తిరగడంపైనే సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును… గ్యాంగ్ రేప్ నేరపై జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం ఇటీవల పెరోల్ పై విడుదల చేసింది. దీంతో వారంతా జైలు నుంచి విడుదలయ్యి స్వేఛ్చా జీవులైపోయారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా గుజరాత్ బీజేపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఆన్ లైన్ వేదికగా తలంటేశారు నెటిజన్లు. ఈ క్రమంలో… సుప్రీంకోర్టులో ఈ వ్యవహారంపై పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు… గుజరాత్ ప్రభుత్వంపై సీరియస్ గా స్పందించింది.

బిల్కిస్ బానో పై సామూహిక అత్యాచారం చేయడంతోపాటు ఆమె కుటుంబంలోని ఏడుగురు సభ్యులను హత్య చేసిన 11 మంది దోషులను పెరోల్ పై జైలు నుంచి విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. “నేడు బిల్కిస్ బానోకు జరిగింది రేపు ఇంకెవరికైనా జరగొచ్చు” అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. కేసు తీవ్రత ఎంతో పట్టించుకోరా? పట్టించుకోకుండానే పెరోల్స్ ఇచ్చేస్తారా? ఖైదులో ఉన్న వారిపై దయ చూపేముందు వారు చేసిన నేరం తీవ్రతను గమనంలోకి తీసుకోరా? అని గుజరాత్ ప్రభుత్వాన్ని సీరియస్ గా నిలదీసింది అత్యున్నత న్యాయస్థానం.

ఇదే విషయంపై మరింత సీరియస్ అయిన సుప్రీం… దోషుల్లో ఒకరికి 1000 రోజులు, మరొకరికి 1200 రోజులు, ఇంకొకరికి 1500 రోజులు చొప్పున పెరోల్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. “ఇదేమీ సాదాసీదా హత్య కేసు కాదని గుర్తు చేస్తూ… సామూహిక అత్యాచారంతో ముడిపడిన హత్యల కేసు” అని గుజరాత్ ప్రభుత్వానికి గుర్తు చేసింది. ఈ సందర్భంగా… “నారింజలను యాపిల్ తో ఎలా పోల్చలేరో. ఒక్క హత్య కేసుతో సామూహిక హత్యల్ని కూడా పోల్చలేరు” అంటూ బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది దేశ అత్యున్నత ధర్మాసనం!

ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వానికి కొన్ని హెచ్చరికలు జారీ చేసిన సుప్రీం కోర్టు… దోషులకు ఊరటను ప్రసాదించేముందు దానికి కారణాలు ప్రభుత్వం చూపించకపోతే తామే సొంతంగా ఒక ముక్తాయింపునకు వస్తామని తేల్చి చెప్పింది. కేసుకు సంబంధించిన అసలైన పత్రాలను సమర్పించకపోవడాన్ని ధిక్కరణగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. దీంతో… గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీం వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి! మరి ఈ వ్యవహారంపై గుజరాత్ సర్కార్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందనేది ఆసక్తిగా మారింది!