వడ మధ్యలో రంధ్రం ఎందుకు చేస్తారో తెలుసా.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

గుండ్రంగా, బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే వడ కనిపించగానే ఆకలి రెట్టింపు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దక్షిణ భారత వంటకాలలో వడకు ఉన్న స్థానం ప్రత్యేకం. టిఫిన్ ప్లేట్‌లో వడ లేకపోతే ఏదో లోటుగా అనిపిస్తుంది. కానీ ఈ వడను చూస్తూ చాలామందికి ఒక్క సందేహం మాత్రం తప్పకుండా తలెత్తుతుంది.. దీని మధ్యలో రంధ్రంతోనే ఎందుకు చేస్తారో చాలా మందికి అర్థం కాదు. ఈ కథనంలో దీని గురించి తెలుసుకుందాం.

చాలామంది దీనిని కేవలం డిజైన్‌గా భావిస్తారు. కానీ వడ మధ్యలో ఉండే ఆ చిన్న రంధ్రం వెనుక ఆసక్తికరమైన చరిత్రతో పాటు శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి. పూర్వ కాలంలో వడలను పెద్ద సంఖ్యలో తయారు చేసి దేవాలయాలు, ఉత్సవాలు, గ్రామ సమావేశాలకు తీసుకెళ్లాల్సి వచ్చేది. అప్పట్లో బుట్టలు, డబ్బాలు లేనప్పుడు వడలను తాడులో గుచ్చి మోసుకెళ్లేవారు. ఆ అవసరమే వడ మధ్యలో రంధ్రం పెట్టే సంప్రదాయానికి బీజం వేసింది.

అయితే కాలక్రమంలో ఈ ఆచారం వంటక శాస్త్రానికి సరిపోయేలా మారింది. వడ మినపప్పు పిండితో తయారవుతుంది. ఈ పిండి చాలా మందంగా, గట్టిగా ఉంటుంది. ఒకవేళ వడ పూర్తిగా గుండ్రంగా, రంధ్రం లేకుండా ఉంటే, వేయించే సమయంలో బయట మాత్రమే ఉడుకుతుంది. లోపలి భాగం పిండి పిండిగా ఉండిపోతుంది. అదే వడ మధ్యలో రంధ్రం ఉంటే, వేడి నూనె ఆ రంధ్రం ద్వారా లోపలికి చేరుతుంది.

దీంతో వడ ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. నూనె సమానంగా అన్ని భాగాలకు తగిలి, వడ పూర్తిగా ఉడుకుతుంది. ఫలితంగా బయట భాగం కరకరలాడుతూ, లోపల భాగం మెత్తగా తయారవుతుంది. ఇదే మేదు వడకు ఉన్న అసలైన టెక్స్చర్ రహస్యం. అంతేకాదు, ఈ నిర్మాణం వల్ల వడ వేయించేటప్పుడు పగిలిపోదు, ఆకారం చెడిపోదు.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రంధ్రం ఉన్న వడ త్వరగా ఉడుకుతుంది. ఎక్కువసేపు నూనెలో ఉండాల్సిన అవసరం ఉండదు. అందుకే ఇది తక్కువ నూనెనే పీల్చుకుంటుంది. రంధ్రం లేని వడను వేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ నూనె గ్రహిస్తుంది. ఇది రుచికే కాదు, ఆరోగ్యానికీ అంత మంచిది కాదు. అంటే వడ మధ్యలో ఉండే ఆ చిన్న రంధ్రం కేవలం సంప్రదాయం కాదు.. రుచి, నిర్మాణం, ఆరోగ్యం.. మూడింటికీ కీలకమైన రహస్యం. ఇక నుంచి వడ తింటూ ఉంటే, ఆ రంధ్రాన్ని చూస్తూ చిరునవ్వు రావడం ఖాయం.