(వి. శంకరయ్య )
ఎన్టీఆర్ బయోపిక్ పై ఒక సినిమా వచ్చింది. మరో రెండు సినిమాలు నిర్మాణంలో వున్నాయి. ఈ రెండు సినిమాలు బయటికి వస్తేనే అసలు రగడ ప్రత్యక్ష మౌతుందేమో. నిర్మాణంలో వున్న ఒక సినిమాకు చెంది పగ ద్రోహం అనే చరణంతో ఇదివరలో ఒక పాట విడుదల అయి వివాదానికి కేంద్ర బిందువైనది. తాజాగా ఎందుకు ఎందుకు అంటూ మరో పాటను విడుదల చేశారు. వచ్చే రెండు సినిమాలలో ఎన్టీఆర్ వ్యక్తి గత జీవిత చరిత్ర అంశం అటుంచగా వివిధ దశల్లో ఇంకా జీవించి వున్న వారు ఆయన యెడల వ్యవహరించిన తీరును భిన్న కోణాలలో చిత్రీకరణ చేయ నున్నారు.అంటే ఒక విధంగా ఆయన బయోపిక్ ను వక్రీకరించడమే. ఈ అంశం వాస్తవంలో వివాదస్పదమైనదే. సమస్య ఏమంటే ఈ రాజకీయ క్రీడలో పవిత్ర మూర్తి ఎన్టీఆర్ ఒక ఉపకరణం కావడమే.
ఈ దేశంలో గాంధీ అంబేద్కర్ ఇంకా చాల మంది నేతలు ఏ ఒక్కరి సొత్తు కాదు. వీరు దేశ ప్రజల సొత్తు. ఆ కోవకే ఎన్టీఆర్ కూడా చెందుతారు. ఆలాంటి పవిత్ర మూర్తిని వారు ఎవరైనా గాని ఈ సమయంలో సినిమాలు తీసి వీధి కెక్కించడం తగునా? ఎన్టీఆర్ మీద సినిమాలు తీయాలని ఆయన కీర్తి ప్రతిష్టలకు బహుళ ప్రచారం కల్పించాలని నేడు మొహరించిన కొందరు ఈ పని ఎప్పుడో చేసి వుండ వుండ వచ్చు. . అటు తనయుడు గాని రెండవ సతీమణి గాని ఎన్నుకున్న సమయం పరిశీలించితే వీరికి ఏవేవో స్వంత ప్రయోజనాలు వున్నట్లు భావించేందుకు ఆస్కారముంది. ఒక వేళ తనయుడు సినిమా తీసేందుకు ఎన్నుకున్న సమయంపై గల వివాదం కాసేపు పక్కన బెడితే రెండవ సతీమణికి అనుకూలంగా ఇప్పుడే రెండవ సినిమా తీస్తున్నారంటే తప్ప కుండా వీరికి స్వార్థ ప్రయోజనం వుండి తీరుతుంది. ఈ పని వీరు గతంలో ఎప్పుడో చేసి వుంటే సినిమాలో వివాదాంశాలు వున్నా రాజకీయ రంగు పులుము కొనేది కాదు. అదే విధంగా తనయుడు కూడా ఇది వరకే ఈ పని చేసి వుంటే బాగుండేది. ప్రస్తుతం ఇరువురు ఎన్నుకున్న సమయం మాత్రం సరికాదు. అందుకే ఇరువురు రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఈ పనికి తల పడుతున్నారనే ఆరోపణలకు ప్రాతి పదిక ఏర్పడింది.
ఎన్టీఆర్ బయోపిక్ పై వచ్చిన సినిమా ఎన్నికల ముందు తీశారనే ఆరోపణ తప్ప ఈ సినిమాలో రాజకీయ రభస లేదు. అంతవరకు మేలు జరిగింది. వివాదం ఏదైనా వుంటే రెండవ సినిమాలో వుండ వచ్చు. లేకనూ పోవచ్చు. ప్రస్తుతం వచ్చిన సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ వైఖరి స్పష్టంగా లేదని ఇంకా ఏవేవో విమర్శలు వున్నా అవన్నీ కూడా పక్కన బెడితే ఎన్నికల ముందు సినిమా తీయడం అందుకు ప్రతిగా మరో సినిమా నిర్మాణం కావడం వివాదాస్పదంతో ఒక పాట విడుదల కావడందీనిపై ఫిర్యాదులు ఆరోపణలు వెల్లువెత్తడం వలన ఇరువురు కలగలసి పవిత్ర మూర్తి ఎన్టీఆర్ ను వీధికి తేవడమే అసలు సమస్య.
. ఎందుకు ఎందుకు అనే చరణంతో తాజాగా రెండవ సతీమణిని ఎన్టీఆర్ ఎందుకు స్వీకరించ వలసి వచ్చిందో నిగూఢంగా వివరిస్తూ రెండవ పాట విడుదల అయింది.ఇలా ఒకరి కొకరు పోటీ పడి ఎన్నికల ముందు ఎన్టీఆర్ ను వివాదాలలోని లాగడం ఆయనను ఆరాధించే అశేషజన సామాన్యం బాధ పడటం మాత్రం వాస్తవం.
ఎన్టీఆర్ జీవితం మహోన్నత మైనది. ఆయన జాతి సొత్తు అయినట్లు ప్రజల కోసం తుది శ్వాస వరకు పరితపించారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం పథకం ఉమ్మడి ఎపిలో కొన్ని ప్రాంతాల్లో ఆహారపు అలవాట్లను సమూలంగా మార్పు చేసింది.ఈ వాదనను కొందరు వక్రీకరించారు. ఎన్టీఆర్ తను అమలు చేసిన ఈ పథకం ద్వారా ప్రజలకు ఆహారపు అలవాట్లు మార్పు చేయడంకాకుండా . ఆహార సులభంగా అందే వ్యవస్థను తీసుకు వచ్చి చరిత్ర సృష్టించారు.
ఎన్టీఆర్ జీవితంలో భిన్న కోణాలు వుండవచ్చు. గాంధీ నిజ జీవితం గురించి ఆ మధ్య భిన్న మైన వార్తలు రావడం మన మెరుగుదుం. అది ముఖ్యంకాదు. జీవించి నంత కాలం ఎవరి కోసం ఏ విధంగా కృషి చేశారనేది – ఆ కృషిలో ఎవరు ఏవిధంగా ఆయన ఎడల వ్యవహారించారనేది ముఖ్యం. ఈ అంశంపైననే ప్రస్తుతం వివాదం సృష్టించుతూ వారి వారి ప్రయోజనాలు నెరవేర్చుకొనేందుకు తంటాలు పడుతున్నారు.
ఎన్టీఆర్ ఘనతను చెప్పడమంటే సూర్యుని ముందు దివిటీ పట్టడమే.
చెన్నారెడ్డి కాలంలో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాగుతున్న రోజుల్లో ఎన్టీఆర్ తన సినిమాలో తెలుగు జాతి మనది అనే పాట పెట్టి ఉద్యమం ముందు నెట్టుకు రావడం ఆ రోజుల్లో అంత సాహసానికి ఎవరైనా తల పడ గలరా?ఆయన గుండె ధైర్యం ఒక చరిత్ర. అంతేకాదు. తన సినిమాలో ఒక సన్నివేశంలో రాజసభలో కులం గురించి ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు ఈ రోజు కొమ్ములు తిరిగి వారు ఎవరైనా సరే నిజ జీవితం లో అటుంచి సినిమాలలోనైనా చెప్ప గలరా? డటీస్ ఎన్టీఆర్. ఆలాంటి మహోన్నత వ్యక్తి గురించి సినిమాలు తీయడం సమస్య కాదు. అవసరం కూడా. రెండు తరహాలలో రెండు సినిమాలు రావడం ఎప్పుడైనా సహజమే. అయితే ఎన్నికల ముందు రావడం ఎపి ప్రజలకే కాదు-జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నేతగా దేశ ప్రజలకు తెలిసిన నేపథ్యంలో ఈ సినిమాల నిర్మాణం ఆయనకు మచ్చ తేచ్చే ప్రమాదం పొంచి ఉంది.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాక ముందే ఎపి ప్రజలు ఆయనను దైవంగా భావించే వారు. అదే ఆయన కీర్తిని ఆకాశపు టంచులకు తీసుకెళ్లింది.రాయల సీమ కరవు సహాయ నిధికి జోలి పట్టడం సీమలో రాజకీయంగా పురుడు పోసుకొని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారు చేయలేని పనిని సీమకు ప్రాజెక్టులకు చేసిన రూప కల్పనను చరిత్ర పుటల నుండి ఎవరూ తొలగించ లేరు. ఎవరైనా సరే ప్రజలతో అనుబంధం గల అంశాలపై సినిమాలు తీయాలి.వారే ఆయనకు నిజమైన వారసులు.
సంవత్సరం గుర్తు లేదు గాని పంతొమ్మిది వందల 70 దశకంలో విశాలాంధ్ర దిన పత్రికలో సినిమా సెక్షన్ ఎడిటర్ గా పని చేస్తున్న రోజుల్లో విజయవాడలో వరస బెట్టి అగ్ని ప్రమాదాలు జరిగాయి. దాదాపు నెల రోజులు పాటు ఏదో ఒక మూల అగ్ని ప్రమాదం సంభవించేది.
అగ్ని బాధితులకు ఆర్థిక సాయం చేయాలని సిపిఐ ప్రధాన కార్యదర్శిగా వుండిన చండ్ర రాజేశ్వరరావు సలహామేరకు వారం రోజులు ఏలూరు రోడ్డులో వుండిన విజయ టాకీస్ లో బెనిఫిట్ షోలు వేశాము. ఇదంతా ఎందుకు చెప్ప వలసి వుందంటే ఎన్టీఆర్ ను అడిగి రెండు చిత్రాలు తీసుకు వచ్చేందుకు మద్రాసు వెళ్లాను..
ఉదయం 6 గంటలకే ఆయన నివాసం వద్దకు వెళ్లేసరికి ఆ పాటికే దాదాపు పది బస్సులు ఆ రోడ్డులో నిలిచి వున్నాయి. బస్సుల్లో వచ్చిన వారు కొన్ని వందల మంది ఆయన ఇంటి ముందు క్యూ కట్టి నిలుచుకొని వున్నారు. నన్ను సిబ్బంది ఒక గదిలో కూర్చో బెట్టారు. 7 గంటలకే ఎన్టీఆర్ మేకప్ తో రెడీగా వున్నారు. 7గంటలకు ఎన్టీఆర్ వరండాలో నిలుచుంటే బస్సులో వచ్చిన వారు వరసగా వచ్చి ఆయనకు మొక్కడమే కాదు. పాదాలను తాకి నమస్కరించి వెళ్లిన ఆ దృశ్యం ఈ రోజుకు నా కళ్లకు కట్టినట్లు వుంది.
సినిమా జీవితంతోనే తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ఆరాధ్యదైవ మైనారు. రాజకీయాలో ప్రవేశించి ఎపి కీర్తికి ప్రాచుర్యం కలిగించడమే కాకుండా ఆత్మ గౌరవం నినాదంతో ముందు తరాలు కూడా మరచి పోలేని ప్రజా సంక్షేమపథకాలు అమలు చేసి అమరు లైనారు. దురదృష్టకరమైన అంశమేమంటే ఆయన ఘన కీర్తి పణంగా పెట్టి ఎన్నికల ముందు సినిమాలు తీయడమే.
(వి. శంకరయ్య, రాజకీయ వ్యాఖ్యాత ఫోన్ నెం 9848394013)