సాధారణంగా పోలీసులు కానీ, దర్యాప్తు సంస్థలు కానీ ఎక్కడైనా దాడులు చేస్తుంటే… అది మీడియాలో హైలైట్ న్యూస్ అవుతోంది. 500 లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీకి దొరికితే… దానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేసి మరీ మీడియా పోటీపడి ప్రసారం చేస్తుంటుంది. అదంతా వారి వారి క్రియేటివిటీలో భాగమనుకుని వదిలేస్తే… తాజాగా ఏపీ సీఐడీ… మార్గదర్శి చిట్స్ పై దాడులు చేస్తుంది. అధినేతలను విచారిస్తుంది. జీవితంలో మొదటిసారి రామోజీరావుని ఏపీ సీఐడీ అధికారులు కుర్చోబెట్టి.. పడుకోబెట్టి మరీ విచారిస్తున్నారు! అయినా కూడా… తెలుగు మీడియాలో కథనాలు, కవరేజ్ లు కనిపించడం లేదు!
అవును… ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కు ఈడీ నోటీసులు అందించినదగ్గరనుంచి మొదలు… కవిత హైదరబాద్ లో ఇంటినుంచి ఎలా బయలుదేరారు – ఏ చీర కట్టుకున్నారు – ఫేస్ లో హావభావాలు ఎలా ఉన్నాయి – ఆమె తన భర్తతో ఏమి మాట్లాడారు – ఫ్లైట్ లో ఏ పక్కన కూర్చున్నారు – ఇంట్లో ఎంత ఒత్తిడిలో ఉన్నారు… ఇలా రకరకాల క్రియేటివిటీతో వార్తలు లైవ్ లో ప్రసారం చేశారు! అది తప్పని కాదు… ప్రజాజీవితంలో ఉన్నవారిపై వారి అభిమానులు, ఆయా పార్టీల కార్యకర్తలు అంత ఆతృతగా ఉంటారు కాబట్టి… అది తప్పదు!
అయితే… రామోజీరావు కూడా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. తెలుగు రాష్ట్రాలను ఒకరకంగా శాసించే శక్తి. రామోజీకి కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. రామోజీకి ఏమిజరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృతతో ఉన్న అభిమానులు ఉంటారు. వారంతా టీవీల ముందు కూర్చుని చూసి ఉంటారు. అలాంటి రామోజీపై ఏపీ సీఐడీ దాడులు చేస్తుంటే… ఇంటి ముందు ఆగిన సీఐడీ కారు నెంబరు – విచారణాధికారుల సంఖ్యతో మొదలు… విచారణ పూర్తి చేసి బయటకు వచ్చేవరకూ… లైవ్ విత్ బీజీఎం తో టీవీలు దద్దరిల్లిపోతాయని అంతా భావించారు. కానీ… టోటల్ మీడియా సైలంట్!
రకరకాల క్యాప్షన్స్ పెట్టుకుని.. ప్రజలకోసమే పుట్టిన మీడియా సంస్థలు.. ప్రజాస్వామ్య పరిరక్షణకై వెలిసిన టీవీ ఛానళ్లు, పత్రికలూ.. మీము రిపోర్ట్ చేస్తాం మీరు ఏమైనా చేసుకోండి అనే సంస్థలు సైతం… ఈ విషయాన్ని ప్రచురించడానికి – ప్రసారం చేయడానికి ముందుకు రాలేదు! “ధైర్యం చేయలేదు” అని అనలేం కానీ… ఆసక్తి చూపించలేదు అనొచ్చు! ఫలితంగా… రామోజీ లెవెల్ ని తగ్గించేశారని చెప్పుకోవచ్చు.
అవును… రామోజీ అభిమానులు హర్ట్ అవుతున్న విషయం అదే! ఎవరెవరి గురించో ప్రజలకు ఆగకుండా సమాచారం అందిస్తూ.. అభిమానులకు అప్ డేట్స్ ఇచ్చే మీడియా… రామోజీ విషయంలో ఎందుకు సైలంటు గా ఉంది. మరి ముఖ్యంగా… తెలుగు మీడియా రామోజీని వెలివేసిందా? రామోజీకే పేపరు – టీవీ ఉన్నాయి కదా.. మేము చూపించాలేంటి? అనుకున్నాయా?… ఏది ఏమైనా… ఈ విషయంలో రామోజీ అభిమానులు హర్ట్ అవుతున్నారు. ఇకపై అయినా… రామోజీ ని విచారిస్తున్న సీఐడీ విచారణలు, మార్గదర్శిలోని వాస్తవాలు – అధికారుల వివరణలు మొదలైనవి… నిత్యం ప్రసారం చేయాలని.. ఫలితంగా రామోజీ అభిమానులకు కాస్త ధైర్యం చెబుతూ ఉపశమనం కలిగించాలని కోరుకుంటున్నారు!
మరి… ఇకనైనా రామోజీరావు విషయంలో మీడియా కాస్త మంచి మనసుతో ఆలోచిస్తుందా… లేక, ఇదే చులకన భావం చూపిస్తుందా అన్నది వేచి చూడాలి!