ఆంధ్రపదేశ్‌లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ ఫలితాలు వచ్చేశాయి. అధికార పార్టీ నేతలేమో 90 శాతం స్థానాలు తామే గెలుచుకున్నామని చెబుతున్నారు. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సైతం, తామే అత్యధిక స్థానాల్లో గెలిచామని చెప్పుకుంటోంది. జనసేన పార్టీ ప్రభావం పెద్దగా కనిపించలేదని టీడీపీ, వైసీపీ అనుకూల మీడియా సంస్థలు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇవి పార్టీల పరంగా జరిగిన ఎన్నికలు కావు. ‘పార్టీ రహిత ఎన్నికలు..’ అని టీడీపీ, వైసీపీ గతంలోనే స్పష్టం చేశాయి. కానీ, పంచాయితీ ఎన్నికల్లో రాజకీయాలు, సాధారణ రాజకీయాలకు మించి నడిచాయి. ఒక్కో ఓటుకి కొన్ని చోట్ల 10 వేల రూపాయలదాకా సమర్పించుకున్నాయి కొన్ని పార్టీలు. పార్టీల గుర్తుల మీద కాకుండా, ఆ గుర్తులతో సంబంధం లేని వేరే గుర్తులతో జరిగిన ఎన్నికలివి. సాధారణంగానే అధికార పార్టీ మద్దతుదారులను ఇలాంటి ఎన్నికల్లో విజయం వరిస్తుంటుంది. ఇప్పుడూ అదే జరిగింది. అయితే, కాస్త భిన్నంగా విపక్షాలు కూడా పట్టు నిలుపుకున్నట్లే కనిపిస్తోంది.
విపక్షాల మద్దతుదారులు కొన్ని చోట్ల మంచి విజయాల్ని అందుకున్నారు. అయినాగానీ, పార్టీలతో సంబంధం లేకుండా చూడాల్సిన ఎన్నికలు ఇవి. వాస్తవాలు ఇలా వుంటే, గెలుపు తమదేనని టీడీపీ చెప్పుకున్నా, వైసీపీ చెప్పుకున్నా, ఇంకే పార్టీ చెప్పకున్నా.. పంచాయితీ ఎన్నికల ప్రక్రియను అవమానించినట్లుగానే భావించాలని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రద్దు చేసిన దరిమిలీ, ఈ పంచాయితీ ఎన్నికల్ని రాజకీయ కోణంలో అస్లసు చూడకూడదన్నమాట. ఎవరేమనుకున్నా, వాస్తవాలు ఎలా వున్నా, తామే గెలిచామని చెప్పుకోవడం ద్వారా ఆయా రాజకీయ పార్టీలు తమ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుకునేందుకు ప్రయత్నిస్తాయి. అంతే తప్ప, ఈ పంచాయితీ ఎన్నికల గురించిన రాజకీయ విశ్లేషణ చేయడం కూడా శుద్ధ దండగేనన్నది ప్రజాస్వామ్యవాదుల అభిప్రాయంగా కనిపిస్తోంది.