బీజేపీ సర్జికల్‌ స్ట్రైక్‌ నినాదం ఉత్తిదేనా.?

Whether the BJP has adopted the slogan of Surgical Strike

‘మేం గెలిస్తే.. పాత బస్తీలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తాం.. రోహింగ్యాలు, పాక్‌ అనుకూలుర వల్లనే పాత బస్తీ ఎదుగూ బొదుగూ లేకుండా పోతోంది.. పాత బస్తీని భాగ్యనగరం చేయబోతున్నాం..’ అంటూ గ్రేటర్‌ ఎన్నికల వేళ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అయితే, ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ తెలంగాణ మంత్రి కేటీఆర్‌, బండి సంజయ్‌కి ఘాటుగానే సమాధానమిచ్చారు. గ్రేటర్‌ ఎన్నికలు జరిగాయి.. ఫలితాలూ వచ్చాయి. బీజేపీ కోరుకున్న విజయమూ దక్కింది. మెజార్టీ సీట్లు టీఆర్‌ఎస్‌కి వచ్చినా, బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీకి సంబంధించినంతవరకు గ్రేటర్‌ ఎన్నికల్లో కనీ వినీ ఎరుగని విజయమిది. మరి, ఇంత పెద్ద విజయం సాధించాక, సర్జికల్‌ స్ట్రైక్‌ మొదలవ్వాలి కదా.! కానీ, ‘పాతబస్తీలో వున్న రోహింగ్యాలు, పాకిస్తానీలను ఏరిపారెయ్యాలంటే, పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం స్వేచ్ఛనివ్వాలి..’ అంటూ బండి సంజయ్‌ కొత్త పల్లవి అందుకున్నారు.

Whether the BJP has adopted the slogan of Surgical Strike
Whether the BJP has adopted the slogan of Surgical Strike

కేంద్రంలో అధికారంలో వున్నది బీజేపీనే. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆ కోణంలో చూస్తే, పాత బస్తీలో నిజంగానే రోహింగ్యాలు అక్రమంగా నివసిస్తోంటే, పాకిస్తాన్‌కి చెందినవారు అక్కడ వుంటోంటే.. కేంద్రం ఏం చేస్తోంది.? నిజానికి, ఇది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాదు. దేశ భద్రతకు సంబంధించిన అంశం. ఇలాంటి విషయాల్లో రాష్ట్రానికి ఎంత బాధ్యత వుంటుందో, అంతకన్నా ఎక్కువ బాధ్యత కేంద్రానికే వుంటుంది. గ్రేటర్‌ ఎన్నికలైపోయాయ్‌.. చేతులు దులిపేసుకుందాం.. అన్న చందాన బండి సంజయ్‌ తాజా వ్యాఖ్యలు వున్నాయి తప్ప, హైద్రాబాద్‌ పట్ల బాధ్యతతో ఏమాత్రం ఆయన మాట్లాడుతున్నట్టు లేదు పరిస్థితి. ట్రాఫిక్‌ చలానాల్ని రద్దు చేస్తామన్నారు.. ఇంకేవేవో మాటలు చెప్పారు. వీటన్నిటిపైనా కేంద్రాన్నే ఒప్పిస్తారో.. రాష్ట్ర ప్రభుత్వంపైనే ఒత్తిడి తెస్తారో.. బీజేపీకి ఓట్లేసిన ప్రజలకు బండి సంజయ్‌ సమాధానం చెప్పి తీరాల్సిందే. ‘మాకు మెజార్టీ సీట్లు రాలేదు కాబట్టి.. మాకేంటి సంబంధం.?’ అంటూ బుకాయించే ప్రయత్నం చేస్తే, భవిష్యత్తులో బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి వుండదు.