చేవ చచ్చిన కాంగ్రెస్ నాయకత్వం 

Where are the top leaders of Congress and TeluguDesam parties
రాజకీయం అంటేనే ఒక రణక్షేత్రం. ఇక్కడ పోరాటయోధులకు, సాహసవంతులకు, ప్రాణాలను సైతం లెక్కచెయ్యని వారికి మాత్రమే స్థానం. అందుకే రాజ్యం వీరభోజ్యం అంటారు పెద్దలు. అఫ్ కోర్స్, వెన్నుపోటు పొడిచేవారికి, ద్రోహులకు, పిరికిపందలకు  కూడా ఒక్కోసారి అవకాశాలు లభిస్తాయి. కానీ వారు చరిత్ర హీనులుగానే లిఖించబడతారు. అలెగ్జాండర్, పురుషోత్తములు ఉన్నట్లే జయచంద్రులు, అంభి లాంటి కుట్రదారులు కూడా ఈ రంగంలో కనిపిస్తారు.  వీరోచితంగా పోరాటం చేసేవారే చివరకు విజయాన్ని సాధిస్తారు.  
 

Where are the top leaders of Congress and TeluguDesam parties

మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికలను, అంతకుముందు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికను ఒకసారి చూడండి.  ఈ ఎన్నికల్లో టీఆరెస్, మజ్లీస్, బీజేపీలోని యోధానుయోధులు అందరూ శక్తివంచనలేకుండా పోరాడారు. బీజేపి స్థానిక నాయకులే కాకుండా కేంద్రం నుంచి నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం శాస్త్రాస్త్రాలతో బరిలో దిగారు. కానీ, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన  రెండే రెండు ప్రముఖ పార్టీల నాయకులు ఎక్కడైనా కనిపించారా? కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల అగ్రనాయకులు ఎక్కడ?  
 
బీజేపీలో ఇప్పుడిప్పుడే పొడుచుకొస్తున్న యువనాయకులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్..వారి పోరాట పటిమ ఎలా ఉన్నదో చూసారు కదా! ఒక చిన్న జీవిని చంపడానికి పులి, సింహం లాంటి జంతువులు తమ యావత్శక్తిని వినియోగిస్తాయి.  అలాగే ఎంత భీభత్సంగా మాట్లాడటానికైనా ఆ నాయకులు వెనుకాడలేదు.  చివరికి పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని కూడా మాట్లాడటానికి సాహసించారు. అదీ పోరాటదీక్ష అంటే. ధర్మపురి అరవింద్ కు తండ్రి వారసత్వం ఉన్నది.  అదేమీ ఘనమైన వారసత్వం కాదు.  ధర్మపురి శ్రీనివాస్ రాష్ట్రవ్యాప్త ప్రాచుర్యం కలిగిన నాయకుడేమీ కాదు.  బండి సంజయ్ కు కూడా పెద్ద వారసత్వవైభవం ఏమీ లేదు.  మొన్న ఆయన కరీంనగర్ ఎంపీగా గెలిచేవరకు అతను ఎవరో కూడా చాలామందికి తెలియదు.  అలాంటి వ్యక్తి  హఠాత్తుగా హీరో అయిపోయాడు.  సాక్షాత్తూ ప్రధాని మోడీ కూడా సంజయ్ కు ఫోన్ చేసి మెచ్చుకునేంత ఘనుడయ్యాడు.  వారిలోని ఆ పోరాటతత్వం, దూకుడుతనం, తెంపరితనం, సాహసం వారిని ఈరోజు పెద్ద నాయకుల సరసన చేర్చినది.   
 
మరి ఎంతో గొప్ప వారసత్వ చరిత్ర, ముత్తాతల కాలం నుంచి దేశవ్యాప్తంగా కీరిప్రతిష్ఠలు, ముత్తాత, నాయనమ్మ, నాన్న దేశప్రధానులుగా సాధించిన ఖ్యాతి, పార్టీ అధ్యక్షురాలిగా  రెండుసార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన తల్లి…అడుగులకు మడుగులు ఒత్తే అనుచరులు, వేలకోట్ల రూపాయల సంపద ఉన్నప్పటికీ, రాహుల్ గాంధీ ఈ ఎన్నికల సమయాన తన పార్టీ ప్రచారం కోసం కనీసం హైదరాబాద్ లో అడుగైనా పెట్టారా? కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడానికి ఆవగింజంత అయినా తన పార్టీవారికి సహకారం అందించారా? ఎంత సోమరితనం! ఎంత పిరికితనం!!  రాహుల్ గాంధీ ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు.  ప్రచారం చేస్తే కేసులు పెడతారని ఆందోళన లేదు.  పార్టీ మొత్తం తమ కుటుంబ గుప్పెట్లో ఉన్నది.  పైగా యువకుడు.  వయసున్నవాడు. సింగం లా రంగంలో దూకి తన పార్టీకి విజయాలు చేకూర్చవలసినవాడు పిరికిపందలా, పిల్లిలా ఇంట్లో దాక్కున్నాడు. ఇలాంటి నాయకుల వలన పార్టీ అధోలోకాలకు వెళ్ళాక ఊర్ధ్వలోకాలను ఎలా చూడగలుగుతుంది?  ఏడేళ్ల క్రితం వరకు దేశంలో, ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ ఈరోజు నేల కరుచుకుని పోయిందంటే పిరికి సోమరి నాయకత్వమే కారణం. వైఎస్ రాజకేసేఖర రెడ్డి లాంటి ధీరులు ప్రజల్లోకి దూకి విజయాలు సాధించి పెడుతుంటే అనుభవించడం మరిగి, అదంతా తమ గొప్పే అని విర్రవీగుతూ సోమరితనంతో మేకను తిన్న కొండచిలువలా మత్తుగా పడిఉన్న రాహుల్కాం గాంధీ లాంటి వారిని  చూస్తుంటే జాలివేస్తుంది.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు