తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడిని ఓ కేసులో ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్టు చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇంకోపక్క టీడీపీకే చెందిన మరో నాయకుడి మీద దుండగులు దాడి చేశారు. టీడీపీ నేత పట్టాభిపై జరిగిన దాడిలో ఆయనకు గాయాలయ్యాయి. ‘ప్రశ్నిస్తే చంపేస్తారా.? అయితే, నన్నూ చంపేయండి..’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు టీడీపీ అధినేత చంద్రబాబు, తమ పార్టీకి చెందిన నేత పట్టాభిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై. తన ఇంటి నుంచి బయటకు వస్తుండగా పట్టాభి మీద దుండగులు దాడి చేయడం, అది కూడా హై సెక్యూరిటీ జోన్‌లో ఈ హత్యాయత్నం జరగడం పెను రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యింది. ఇదిలా వుంటే, ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పంచాయితీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేసిన ఓ మహిళా అభ్యర్థి భర్త అనుమానాస్పద మృతి నేపథ్యంలో, బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ రోజు పరామర్శించారు. ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ రాజకీయ ప్రత్యర్థులు టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డిని బెదిరించారు.
అతన్ని అపహరించి, మత్తుమందు ఇచ్చి అడవుల్లో వదిలేయగా, అటువైపుగా వెళ్ళిన పశువుల కాపర్లు, అపస్మారక స్థితిలో వున్న శ్రీనివాస్ రెడ్డిని గుర్తించి రక్షించారు. అయితే, ఇంటికి వచ్చాక రాజకీయ ప్రత్యర్థులు.. పోలీసులు అతన్ని వేధించారనీ, ఈ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని బాధిత కుటుంబం వాపోతోంది. శ్రీనివాస్ రెడ్డి మృతదేహం అనుమానాస్పద స్థితిలో చెట్టుకు వేలాడుతుండడంతో ఇది ఆత్మహత్య కాదు, రాజకీయ హత్య అనే ఆరోపణలకు బలం చేకూరింది. అసలేం జరుగుతోంది ఆంధ్రపదేశ్‌లో.? కొన్నాళ్ళ క్రితం స్థానిక ఎన్నికల నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలపై హత్యాయత్నాలు జరిగాయి. అప్పట్లో బోండా ఉమ, బుద్దా వెంకన్నల మీద హత్యాయత్నం జరిగిన విషయం విదితమే. అయితే, ఇదంతా పెద్ద డ్రామా అని వైసీపీ ఆరోపిస్తోంది. నిజమేంటోగానీ, రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపైనే వుంది. ఏది నిజం.? ఏది డ్రామా.? అన్నది తేల్చాల్సింది పోలీసులే.