CM Chandrababu: ఏపీని నెంబర్ వన్‌‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ లాజిస్టిక్స్ కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఏర్పాటు చేసి, 2046 నాటికి అన్ని పోర్టులను పూర్తి చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

విశాఖపట్నంలో జరిగిన ‘ఈస్ట్‌ కోస్ట్‌ మారిటైమ్‌ లాజిస్టిక్స్‌ సమ్మిట్‌’లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఏపీకి ఉన్న 1,053 కిలోమీటర్ల తీరప్రాంతం ఒక గొప్ప వరం అన్నారు. పోర్టుల ఆధారంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఏపీలో ఆరు పోర్టులు పనిచేస్తున్నాయని, మరికొన్ని పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. భవిష్యత్తులో రోడ్డు, రైలు, సముద్రం, ఎయిర్ లాజిస్టిక్స్ రంగాలను విస్తృతంగా అభివృద్ధి చేసి, దక్షిణాదిలో ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 90 శాతం కార్గో బల్క్ రూపంలో రవాణా అవుతున్నప్పటికీ, ఎయిర్ కార్గో ద్వారా వేగంగా సరకు పంపిణీ చేయవచ్చని చెప్పారు. ఫార్మా, ఆక్వా, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందని, ఈ రంగాలకు లాజిస్టిక్స్ బలోపేతం అవసరమని అన్నారు.

రాష్ట్రంలో టెక్నాలజీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇంటింటికీ విద్యుదుత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అలాగే, ఏఐ, క్వాంటమ్ వ్యాలీ, డ్రోన్లు, రోబోటిక్స్, ఐవోటీ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు.

దేశంలో నదుల అనుసంధానం అత్యవసరమని, గంగా నుంచి కావేరి వరకు నదులను కలిపితే నీటి భద్రత సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశం షిప్‌బిల్డింగ్ రంగంలో వెనుకబడి ఉందని, ఏపీలో మూడు, నాలుగు ప్రాంతాలను షిప్‌ల నిర్మాణానికి కేటాయించామని చెప్పారు. మంచి ప్రతిపాదనలతో ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం వయబిలిటీ ఫండింగ్ ద్వారా మద్దతు ఇస్తుందని తెలిపారు.

వైజాగ్ త్వరలో డేటా హబ్‌గా మారనుందని, ఇక్కడ డేటా సెంటర్ రాబోతోందని సీఎం వెల్లడించారు. అలాగే, జీఎంఆర్ సంస్థ ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతుందని వివరించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో మరిన్ని డిఫెన్స్, మెరైన్ షిప్‌బిల్డింగ్, కంటైనర్ టెర్మినల్స్‌ ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నాయని చంద్రబాబు తెలియజేశారు.

కన్నీళ్లు పెట్టిన కవిత..| MLC Kavitha Crying About Her Brother KTR | BRS | Telangana | Telugu Rajyam