వినుకొండలో ఏం జరిగింది?… ఏమో సార్ నాకు కనబడదు!

పల్నాడు జిల్లా వినుకొండలో ఏమి జరిగింది?.. ఏమి జరిగింది!?.. ఏమీ జరగలేదు!! బుధవారం తొలి ఏకాదశి కావడంతో అంతా కోలాహలంగా గడిపారు.. పల్నాడులో రామలింగేశ్వరుడి దర్శనం కోసం భక్త జన సందోహం కిక్కిరిసిపోవడంతో పోలీసులు బందోబస్తులో బిజీగా ఉన్నారు. కొత్త ఎస్పీ కూడా అక్కడే ఉన్నారు.

అంతే…! ఓ హో అదా…! ఆ పక్కన బస్టాండ్ సెంటర్ దగ్గర ఏదో చిన్న గొడవ జరిగిందంట.. ఎవరో ఎవరినో కత్తితో నరికేశారంట.. ఈ దాడిలో బాదితుడి చెయ్యి తెగి నేలపై పడిందంట.. తలపైనా నిలువుగా నరకడంతో ఆ భాగం విడిపోయిందంట. అయినా కూడా నిందితుడు ఆగలేదంట. నరుకుతూనే ఉన్నాడంట.

జనం అలా చూస్తుండిపోయారంట.. కొంతమంది ఈ దారుణాని సెల్ ఫోన్ లో చిత్రీకరించారంట.. నడి రోడ్డుపైనా ఇది జరగడంతో ట్రఫిక్ కి ఎంతో కొంత ఇబ్బంది కలిగి ఉంటుందంటావా అని కొంతమంది డిస్కషన్ చేసుకుంటున్నారు.. ఈ దాడిలో బాధితుడు చనిపోయాడంట. ఇందులో నిందితుడు టీడీపీ వ్యక్తి అని, బాధితుడు వైసీపీ కార్యకర్త అని వైసీపీ వాళ్లు అంటున్నారంట.

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలుగా చూపిస్తున్నారంట. మరోపక్క… అబ్బే అలా ఏమీ కాదు.. ఇద్దరూ వైసీపీ కార్యకర్తలే అని అధికారంలో ఉన్న టీడీపీ ట్వీట్ చేసిందంట. మరి ఎవరు ఏ పార్టీనో మనకు ఎలా తెలుస్తుంది! ఒక పార్టీ వాళ్లు అయితే ఇలా రోడ్డుపై నరికేసుకో వచ్చేమో!! మరి పోలీసులు ఏమంటున్నారు?

ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కొత్త ఎస్పీ.. షార్ప్ గా, స్పీడ్ గా ఎంక్వైరీ చేశారంట.. రాజకీయ పార్టీలకు ఏమీ సంబంధం లేదని చెప్పే ప్రయత్నమో ఏమో కానీ.. వ్యక్తిగత కక్షలతోనే, అని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారంట. దీంతో… ప్రభుత్వ పెద్దల సూచనలు తూ.చ. తప్పకుండా కొత్త ఎస్పీ బాగానే పలికారంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారంట.

ప్రజలు.. సోషల్ మీడియా.. మీడియా.. పార్టీలు.. నేతలు.. కాకుండా… అసలైన వాళ్లు ఏమంటున్నారు? అసలైన వాళ్లంటే… ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, యువనాయకుడు నారా లోకేష్ వంటివారు ఏమైనా స్పందించారా..? లేదు… వాళ్ల వాళ్ల పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారని అంటున్నారు.

ఏపీ ప్రజలు బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిని నమ్మారు.. కచ్చితంగా వారందరి రుణం తీర్చుకుంటా.. ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చంద్రబాబు చెబుతున్నారంట. విజయవాడలో ప్రారంభమైన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి తెలుసుకోవడం, మొదలైన పనుల్లో పవన్ బిజీగా ఉన్నారని అంటున్నారు.

ఇక.. ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇది అని లోకేష్ ట్వీట్ చేశారంట. రోడ్డుపై యాచక మహిళకు దుస్తులు లేకపోవడంతో భీమిలి సీఐ ఆమెకు దుస్తులు ఇచ్చారని.. పోలీసులు ప్రజలతో మమేకం అయిపోతున్నారనడానికి ఇది ఉదాహరణ అని హోంమంత్రి అనిత అభినందించే పనిలో ఉన్నారంట!

అంటే… వినుకొండలో జరిగిన విషయంపై నేరుగా వీరెవరూ ఇప్పటివరకూ స్పందించలేదా?.. కనీసం ప్రెస్ మీట్ పెట్టడం చేయలేదా?.. చివరాఖరుకి ట్వీట్ కూడా పెట్టలేదా?.. అంటే వినుకొండలో ఏమీ జరగలేదు.. రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఉంది.. పల్నాడు మరింత ప్రశాంతంగా ఉందని వీరంతా భావిస్తున్నారా?.. ఏమో సార్ నాకు కనబడదు!!