మొన్నామధ్యన “సరిలేరు నీకెవ్వరూ” అనే సినిమాలో నటించకపోయి ఉన్నట్లయితే ఈ తరం యువతకు విజయశాంతి అంటే ఎవరో తెలిసేది కాదు. ఎందుకంటే ఆమె సినిమారంగానికి దూరమై సుమారు పదునాలుగేళ్ళు దాటింది. అయితే ఆమె వైభవం ఏమిటో ముప్ఫయి ఏళ్ళు పైబడినవారికి కచ్చితంగా తెలుస్తుంది. హీరోయిన్ గా చండప్రచండంగా సుమారు పదిహేను సంవత్సరాలు వెలిగిపోయారు. ఆమె సమకాలీన అగ్రహీరోలు అందరూ ఆమెతో నటించడానికి తహతహలాడారు. తెలుగులోనే కాదు, తమిళంలో కూడా విజయాలను సాధించారు. చిరంజీవి నటించిన ఘరానా మొగుడు అనే ఒక సూపర్ హిట్ సినిమాను తమిళంలో రజనీకాంత్ తో విజయశాంతిని జంటగా తీస్తున్నప్పుడు అందులో రజనీని చెంపదెబ్బ కొట్టే సన్నివేశం ఒకటి ఉన్నది. రజనీకాంత్ కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆ సన్నివేశాన్ని భయపడుతూ ఏదోరకంగా మేనేజ్ చేద్దామని రజనీకాంత్ కు నిర్మాత దర్శకుడు వివరించినపుడు “నన్ను కొట్టేది విజయశాంతి కదా…ప్రేక్షకులు అంగీకరిస్తారు..గో ఎహెడ్” అన్నారట ఆయన! అదీ విజయశాంతి సత్తా అంటే!
రాములమ్మగా మారిన విజయశాంతి
ఒకప్పుడు అగ్రహీరోలయిన ఎన్టీఆర్, అక్కినేనిలనే ధిక్కరించి వారితో సినిమాలు చెయ్యకుండా చిన్నహీరోలతో చేస్తూ కూడా తన స్టార్ డమ్ ను నిలబెట్టుకున్న జమున లాగా విజయశాంతి కూడా చిరంజీవితో ఏవో పొరపొచ్చాలు వచ్చినపుడు ఆయన పక్కన నటించడానికి నిరాకరించడమే కాక మళ్ళీ తన కెరీర్ లో చిరంజీవితో నటించలేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో సమానంగా హిట్స్ సాధించి నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. దాసరి నారాయణరావు సినిమాలు ఒకదశలో ఐదారేళ్ళ పాటు పరాజయాలు వెంటాడుతున్నప్పుడు విజయశాంతితో తీసిన “ఒసేయ్ రాములమ్మా” అనే సినిమాను తీసి ఘనవిజయాన్ని సాధించారు. ఆ సినిమా ఊపుతో మళ్ళీ ఐదారేళ్ళు దాసరి సినిమాలు తీశారు. ఆ సినిమా నుంచే విజయశాంతికి “రాములమ్మ” అనే పేరు స్థిరపడి పోయింది.
రాజకీయ అరంగేట్రం బీజేపీతోనే
సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మీదపడుతున్న వయసు దృష్ట్యా ఇక రావని తలచి 1998 లో ఆమె ఆ సమయంలో అధికారంలో ఉన్న బీజేపీ లో చేరింది. వెంకయ్యనాయుడు, అద్వానీ ఆమెకు రాజకీయ గురువులు అప్పట్లో. హైదరాబాద్ లో విజయశాంతి నటిస్తున్న ఒక సినిమా ప్రారంభోత్సవానికి ఢిల్లీనుంచి స్వయంగా అద్వానీయే వచ్చారంటే అప్పట్లోనే ఆమెకు బీజేపీ ఎంత విలువ ఇచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.
తల్లి తెలంగాణ పేరుతో సొంత దుకాణం
ఆ తరువాత కేంద్రంలో బీజేపీ ఓడిపోయాక ఇక రాజకీయ ఆశలు నెరవేరవని తలచి సొంతంగా తల్లి తెలంగాణ అనే పార్టీని పెట్టుకున్నారు. సినిమాల్లో సంపాదించిన కోట్లాది రూపాయలు పార్టీ పోషణకు కర్పూరం అయిపోతుండటంతో త్వరలోనే మేలుకుని కేసీఆర్ పంచన చేరి కేసీఆర్ తో చెల్లి అనిపించుకున్నారు. కేసీఆర్ చలవతో లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆమెకు సహజంగా ఉండే ఆభిజాత్యంతో ఎవ్వరిముందు చేతులు కట్టుకుని నిలుచునే తత్త్వం కాకపోవడంతో తెరాసలో ఇమడలేక సస్పెండ్ అయ్యారు. ఇక అక్కడుంచి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె సినిమా గ్లామర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం పనికిరాలేదు. ఆమె ఇమేజ్ కాంగ్రెస్ పార్టీనుంచి ఒక్క కార్పొరేటర్ ను కూడా గెలిపించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోవడం, బీజేపీ దేదీప్యమానంగా వెలిగిపోతుండటంతో ఆమె కన్ను చాలాకాలంగా ఆపార్టీ మీద పడింది.
పూబాట పరచిన బీజేపీ అధినాయకత్వం
ఆమె మనసులో భావాలను గమనించిన బీజేపీ నాయకులు బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్ రెడ్డి, అరవింద్ లాంటి వారంతా పొలోమని విజయశాంతి ఇంటికి వెళ్లడం, ఆమెను పార్టీలోకి ఆహ్వానించడం, మరుసటిరోజే ఆమెను ఢిల్లీ తీసుకెళ్లడం, క్షణాల్లో ఆమెకు జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లు దర్శనం ఇవ్వడం, అమిత్ షా ఆమెకు శాలువా కప్పి పార్టీలో చేర్చుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ పార్టీలో చేరిన వెంటనే కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేశారు విజయశాంతి.
రగిలిపోతున్న జనసైనికులు
వారం రోజులక్రితం బీజేపీ తో అధికారికంగా పొత్తు ఉన్న జనసేనాధిపతి పవన్ కళ్యాణ్, ఆయన ప్రధాన సహచరుడు నాదెండ్ల మనోహర్ (ఆ పార్టీలో వారిద్దరూ తప్ప ఇంకెవరున్నారు అని నన్ను అడగొద్దు ప్లీజ్) “జెపి నడ్డా మమ్మల్ని ఆహ్వానించారు” అని ఇక్కడ సొరకాయ కోతలు కోసి తీరా ఢిల్లీ వెళ్ళాక నడ్డా ఇంటి గడప తొక్కడానికి మూడు రోజులు ఎదురు చూసిన వైనం, అమిత్ షా వీరిద్దరికి మహాలఘుదర్శనం కూడా ఇవ్వకపోవడం తలచుకుంటూ జనసైనికులు విజయశాంతికి ఢిల్లీలో దక్కిన ఘనస్వాగతాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. “మా పవన్ కళ్యాణ్ కు ఏమి తక్కువ? విజయశాంతి కన్నా తీసిపోయాడా? ఢిల్లీలో చచ్చే చలిలో, మంచులో రెండు రోజులు నీట్ గా గడ్డం చేసుకుని పడిగాపులు కాసినప్పటికీ మా నాయకుడి ముఖం కూడా చూడలేదు. బీజేపీ నేతలు. కేంద్ర నాయకులను కలుస్తామని మా పవన్ చెప్పినప్పటికీ ఒక్క కేంద్ర మంత్రి కూడా కలవలేదు. మీడియా పాయింట్ దగ్గర కూడా అన్నీ మా వాడు చెప్పడమే తప్ప బీజేపీ నాయకుడు ఒక్కడు కూడా పవన్ తో కలిసి మేము ఫలానా అంశాన్ని చర్చించాము అని ప్రకటించలేదు. మరి విజయశాంతి వెళ్ళగానే అందరూ ఎగబడ్డారు. అమిత్ షా ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. మా నాయకుడికి ఇంత పరాభవమా? మా నాయకుడి గాలిని ఇంత ఘోరంగా తీస్తారా” అంటూ లోలోపల తెగ నీలుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏమైనప్పటికీ ఇరవై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నా విజయశాంతి ప్రభావం ఏమిటో, ఎలా ఉంటుందో మనం ఇంతవరకూ చూడలేదు. రాబోయే ఎన్నికల్లో విజయశాంతి లోక్ సభ టికెట్ తప్పకుండా కోరుతుంది. అందుకు బీజేపీ అంగీకరించే అవకాశం కూడా ఉన్నది. మొత్తానికి మొన్న గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను దూరంగా పెట్టిన స్థానిక బీజేపీ నాయకులు విజయశాంతికి మాత్రం పెద్ద పీట వెయ్యడం గొప్ప విశేషంగా చెప్పుకోవాలి.