2014 ఎన్నికలకు ముందర విజయశాంతి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అప్పటిదాకా ఆమె గులాబీ పార్టీలో వున్నారు. అప్పట్లో గులాబీ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అందులో విజయశాంతి కొనసాగి వుంటే, మంత్రి అయ్యేవారే.!
లేదంటే, కేంద్రంలో అయినా చక్రం తిప్పే పొజిషన్ గులాబీ పార్టీ ద్వారా విజయశాంతికి దక్కేది. కాంగ్రెస్ పార్టీలో కూడా విజయశాంతి ఎక్కువ కాలం వుండలేకపోయారు. బీజేపీలోకి రెండో సారి ఎంట్రీ కూడా అంత ఘనంగా ఏమీ లేదు విజయశాంతికి. ఇప్పుడు బీజేపీని వదిలేసి, కాంగ్రెస్‌లో చేరతారట.!
ఇంతేనా రాజకీయమంటే.? సోషల్ మీడియాలో సెటైర్లు వేయడం, మీడియా ముందరకొచ్చి హంగామా చేయడం.. ఇవి రాజకీయాల్లో కొంతమేర ఉపయోగపడతాయిగానీ, ఇదే రాజకీయమనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
‘హమ్మయ్య విజయశాంతి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది. సో, మేం అధికారంలోకి రావడం ఖాయం..’ అన్న భావన బీజేపీలో వ్యక్తమవుతోంది తప్ప, బీజేపీ నేతలెవరూ ఎన్నికల సమయంలో విజయశాంతిని బుజ్జగించేందుకు ప్రయత్నించడంలేదు.
అన్నట్టు, మళ్ళీ తెలంగాణ అంశాన్ని విజయశాంతి తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఎవరూ, తెలంగాణేతర పార్టీలను ఆదరించరన్నది విజయశాంతి ఉవాచ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, పదేళ్ళవుతోంది. ఇంకా తెలంగాణేతర.. అన్న ప్రస్తావన దేనికో.!
విజయశాంతికి, రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులున్నారు. ఏం లాభం.? ఆమె ‘తెలంగాణ’ ముసుగేసుకుని, ఆంధ్రాకి దూరమయ్యారు. తెలంగాణలోనూ రాజకీయంగా నిలదొక్కుకోలేకపోతున్నారు. ఎన్నికల ముందర పార్టీ మారడం ద్వారా ఇంకో ‘సదవకాశాన్ని’ విజయశాంతి వదులుకుంటున్నారా.? అంతేనేమో.!