“దమ్ముంటే మా మీద విచారణ చేయించండి” అని ఉత్తరకుమారుడుగా పిలవబడే లోకేష్ నాయుడు… విజయసాయిరెడ్డి భాషలో చెప్పాలంటే చిట్టినాయుడు ప్రతిరోజూ తన గదిలో కూర్చుని రెట్టలు వేస్తుంటాడు. “నేను నిప్పులా బతికాను” అని రోజుకు పదిసార్లు పళ్ళు నూరుతుంటాడు చంద్రబాబు నాయుడు. సరే కదా అని విచారణ చేయిద్దామని సిట్ వేస్తె “గత ప్రభుత్వాల మీద విచారణ చెయ్యడం దుష్ట సంప్రదాయం. కాబట్టి అలా జరగకుండా ఆదేశాలు ఇవ్వండి” అని హైకోర్టుకు వెళ్లి మొరపెట్టుకుంటారు!
కుంభకోణాల సమ్రాట్టు
చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి అనేది ఆకాశం అంటింది. అంతవరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినవారెవ్వరూ అవినీతిలో చంద్రబాబు కాలిగోటి స్థాయికి కూడా వెళ్లలేకపోయారు. రాజకీయప్రవేశ సమయంలో కేవలం రెండు ఎకరాల ఆస్తిపరుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రెండువేల కోట్ల రూపాయలకు ఎదిగారని ఇరవై ఏళ్ళక్రితమే తెహల్కా పత్రిక వెల్లడించింది. అప్పట్లో చంద్రబాబు పాలనలో జరిగిన కుంభకోణాలు సరికొత్త చరిత్రను సృష్టించాయి. అయితే ఏ ఒక్క కుంభకోణమూ విచారణకు నోచుకోలేదు. ఎవరైనా కోర్టులో కేసు వేస్తె వెంటనే స్టే వచ్చేది. “చంద్రబాబు ఏనాడూ న్యాయస్థానం విచారణకు నిలబడలేదు” అంటూ ప్రసిద్ధ ఆంగ్ల పత్రిక దక్కన్ క్రానికల్ అనేకసార్లు కథనాలు ప్రచురించింది. ఎప్పుడో 2004 లో శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి చంద్రబాబు అవినీతిపై ఎసిబి కోర్టులో కేసు వేస్తే దానిమీద పదహారేళ్ళ తరువాత కూడా స్టేలు కొనసాగుతున్నాయి! స్టే అనేది ఆరు నెలలకన్నా ఎక్కువకాలం కొనసాగకూడదని సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు ఏ గంగలో కలిశాయో అర్ధం కాదు!
విచారణ జరపకూడదా?
రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎలాంటి విచారణనైనా ఎదుర్కోగల స్థైర్యాన్ని కలిగి ఉండాలి. ప్రజలు అయిదేళ్లపాటు అధికారం ఇచ్చింది దోపిడీ చేసుకుని మూటలు దాచుకోమని కాదు. అధికారంలో ఉన్న నాయకుల మీద ప్రజలు ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచుతారు. వారి కార్యకలాపాలను గమనిస్తుంటారు. వారు అవినీతికి పాల్పడి ప్రజాద్రోహం చేస్తే మరుసటి ఎన్నికల్లో బుద్ధి చెబుతారు. అధికారాన్ని ఇచ్చేది తమ ఆస్తులకు ధర్మకర్తల ఉంది కాపాడమని తప్ప ఇష్టం వచ్చినట్లు దోచుకోమని కాదు. “మనం ప్రతిరోజూ ఎన్ని గ్లాసులు మంచినీళ్లు తాగుతున్నామో కూడా ప్రజలు గమనిస్తుంటారు” అని చెప్పేవారు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు. తనమీద ఆరోపణలు వచ్చి జస్టిస్ విమద్ లాల్ కమీషన్ ను నియమించినపుడు “అవి రుజువయ్యేదాకా నేను అసెంబ్లీ లో అడుగు పెట్టను” అని శపథం చేసిన ధీమంతుడు. అలాగే ఎల్కే అద్వానీ మీద హవాలా ఆరోపణలు మోపబడినపుడు “అవి రుజువయ్యేదాకా లోక్ సభలో అడుగు పెట్టను” అని రాజీనామా చేశారు ఆయన. అది ఉత్తమజాతి నాయకుల లక్షణం!
ఎందుకంత భయం చంద్రబాబుకు?
నిజానికి రాజకీయనాయకులకు విచారణ అనేది అగ్నిపరీక్ష లాంటింది. నిజంగా పవిత్రులే అయితే, నిర్దోషులే అయితే, వారి నిజాయితీని రుజువు చేసుకునే మహత్తరమైన అవకాశం. ఎందుకు కాలదన్నుకుంటారు? మనదేశంలో వందలమంది రాజకీయనాయకుల మీద విచారణలు జరిగాయి. కొందరు పులుకడిగిన ముత్యాల్లా బయటపడ్డారు. కొందరు జైలుపాలయ్యారు. లాలూ ప్రసాద్ యాదవ్, మధుకోడా, జయలలిత లాంటి ముఖ్యమంత్రులు సైతం ఆరోపణలు రుజువై జైలు జీవితాన్ని అనుభవించారు. అద్వానీ, వెంగళరావు లాంటి వారు నిర్దోషులు అని రుజువు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గ సహచరులను సైతం వదలకుండా విచారణ జరిపించి కటకటాల వెనక్కు పంపించారు. తన మీద వచ్చిన ఆరోపణలను జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. న్యాయపోరాటం చేస్తున్నాడు. మరి చంద్రబాబేమిటి తన మీద విచారణ అంటే గజగజ వణికిపోతాడు?
ఇది దుష్ట సంప్రదాయం
గత ప్రభుత్వ నిర్వాకాల మీద విచారణ జరపకూడదని తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్లడం సిగ్గుచేటు. వారు దోపిడీ చేశారనడానికి ఇది చాలు. చంద్రబాబు నాయుడు విభాజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక అవినీతి భూతం ఆకాశాన్ని కూడా చీల్చుకుని చంద్రమండలం దాటిపోయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పోలవరం ప్రాజెక్టును ఏటీఎం లా వాడుకున్నాడని సాక్షాత్తూ దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఆరోపణ చేసిన తరువాత కూడా చంద్రబాబు మీద విచారణ జరగడంలేదంటే మన చట్టాలు, మన న్యాయస్థానాలు, మన దర్యాప్తు సంస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. వివిధ సంస్థల్లో తిష్ట వేసిన అవినీతిపరులు రాజకీయనాయకులను ఎలా కాపాడుతున్నారో కూడా నగ్నంగా దర్శనమిస్తున్నది. ఈ కేసులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు రాదని, రాకూడదని నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం జంకకుండా చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరుల అవినీతిపై తక్షణం అయిదారు దర్యాప్తు బృందాలను నియమించి విచారణ జరిపించాలి. అక్రమార్కులను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలి. న్యాయం జయించాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు