బరువు తగ్గించే ఇంజెక్షన్ విడుదల.. దీని ధర ఎంతో తెలుసా..?

భారత్‌లో బరువు తగ్గాలనుకునే వారికి ఇప్పుడు మరో కొత్త ఆశాజనక పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. డానిష్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం నోవో నార్డిస్క్ విడుదల చేసిన తాజా ఇంజెక్షన్ వెగోవీ (Wegovy), జూన్ 24న అధికారికంగా భారత్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇది వారానికి ఒకసారి తీసుకునే ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న ఈ ఔషధం, ఇప్పుడు మన దేశానికి కూడా అందుబాటులోకి రావడం గొప్ప పరిణామంగా భావిస్తున్నారు.

వెగోవీ అనేది “సెమాగ్లుటైడ్” అనే యాక్టివ్ ఔషధ పదార్థంతో తయారు చేయబడిన ఇంజెక్షన్. ఇది ముఖ్యంగా ఊబకాయం మరియు అధిక బరువుతో బాధపడేవారికి సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడంతో పాటు, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి, శరీరంలోని కొవ్వును కరిగించేలా పనిచేస్తుంది. ఇది తీసుకునే వ్యక్తులకు తక్కువగా తినాలనే భావన కలిగిస్తుంది, తద్వారా వారు రోజూ తినే ఆహారం పరిమితమవుతుంది. ఇది ఆహార పరిమితి (క్యాలరీ కంట్రోల్) ద్వారా బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

ఈ ఇంజెక్షన్‌‍ను FlexTouch పెన్ అనే పరికరం ద్వారా వేయవచ్చు. వయల్స్, సిరంజీలు అవసరం లేదు. వీటిని చేతితో తేలికగా వాడేయొచ్చు. ఈ ఔషధం 0.25 mg నుండి 2.4 mg వరకు ఐదు వేర్వేరు మోతాదుల్లో లభ్యమవుతుంది. రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్లు తగిన మోతాదును సూచిస్తారు. భారత్‌లో ఇది మోంజారో తర్వాత బరువు తగ్గించే శాస్త్రీయ ఇంజెక్షన్‌గా అధికారిక గుర్తింపు పొందింది. అయితే ఇతర దేశాల్లో ఇప్పటికే Ozempic, Mounjaro, Wegovy వంటి మందులు వాడుతున్నారు. ఇప్పుడు అదే అవకాశాన్ని భారత్‌లోనూ వెగోవీ తీసుకొచ్చినట్లు చెప్పవచ్చు.

ఆధికారిక గణాంకాల ప్రకారం, భారత్‌లో దాదాపు 25 కోట్ల మందికి పైగా ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ తో బాధపడే వారు మాత్రం 35 కోట్లకు పైగా ఉన్నారు. దీంతో, బరువు తగ్గే ఔషధాల మార్కెట్ భారీగానే పెరుగుతోంది. 2021లో రూ.133 కోట్లు విలువైన ఈ విభాగం.. ఇప్పుడు రూ.576 కోట్ల మార్కెట్గా మారింది. అంటే డిమాండ్ ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ కొత్త ఔషధం ధర వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేకపోయినా.. ఇతర దేశాల లోగడ అనుభవాన్ని బట్టి ఇది తక్కువ ఖర్చులోనే పేషెంట్లకు లభించే ఛాన్స్ ఉంది. కానీ దీని వల్ల కలిగే ప్రయోజనాలు దీన్ని ప్రయోగించే వారి జీవితాల్లో స్పష్టమైన మార్పులను తీసుకురాగలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిని వైద్యుల సూచనల మేరకు మాత్రమే వాడాలి.