ఇంట్లో ఈ విగ్రహాలు ఉంటే.. ఆర్థిక కష్టాలకు బ్రేక్, అదృష్టానికి గ్రీన్ సిగ్నల్..!

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆదాయం పెరగడం లేదా.. ఇంట్లో నిరంతరం టెన్షన్, మనసుకు ప్రశాంతత లేక ఇబ్బంది పడుతున్నారా. డబ్బు నిలవడం లేదని, చేస్తున్న పని ఫలితం ఇవ్వడం లేదని ఎంతోమంది మౌనంగా బాధపడుతుంటారు. కొందరు కష్టాన్ని విధియేనని నమ్ముతారు.. ఇంకొందరు అదృష్టం దూరమైందేమోనని అనుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం మాత్రం దీనికి భిన్నమైన సమాధానం చెబుతోంది. ఇంట్లో కొన్ని ప్రతీకలను సరైన చోట ఉంచితే… జీవితం పూర్తిగా కొత్త మలుపు తీసుకుంటుందనే నమ్మకాన్ని జ్యోతిష్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

పండితులు చెబుతున్న పలు సూచనలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించాలంటే కేవలం పూజలే కాదు.. కొన్ని శుభప్రదమైన విగ్రహాల్ని సరైన దిక్కుల్లో ఉంచడం కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. తాబేలు, ఏనుగు, ఆవు, ఒంటె, అలాగే ఒక జత హంసల విగ్రహాలు.. ఇవన్నీ కేవలం అలంకరణ కోసమే కాదు, జీవిత దిశనే మార్చే శక్తి కలవని ఆయన చెబుతున్నారు.

వాస్తు ప్రకారం తాబేలు విగ్రహం ఇంట్లో ప్రవేశిస్తే ఆర్థిక స్థితిలో స్థిరత్వం మొదలవుతుందని విశ్వాసం. తాబేలును విష్ణువు స్వరూపంగా భావిస్తారు. డ్రాయింగ్ రూమ్‌లో తూర్పు లేదా ఉత్తర దిక్కున ఉంచితే డబ్బు సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయని, ఆదాయ మార్గాలు విస్తరిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాపారాల్లో నష్టాలు తగ్గడం, నూతన అవకాశాలు రావడం వంటి మార్పులు కనిపిస్తాయంటున్నారు.

ఇక ఏనుగు విగ్రహం.. ఇది గృహానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని అనేక మంది నమ్మకం. వెండి ఏనుగు విగ్రహాన్ని తూర్పు దిశలో ఉంచితే కుటుంబ కలహాలు తగ్గి, ఇంట్లో ఆనందం పెరుగుతుందని చెబుతారు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారంలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి, స్థిరత్వం వస్తుందని వాస్తు పండితుల అభిప్రాయం. అంతేకాదు వాయువ్య దిక్కున ఒంటె విగ్రహాన్ని ఉంచితే నిలిచిపోయిన పనులు కదలికలోకి వస్తాయట. సంవత్సరాలుగా ఆలస్యం అవుతున్న పనులు ఒక్కసారిగా ఊపందుకోవడం, వ్యాపారాల్లో వేగంగా పురోగతి కనిపించడం వంటి అనుభవాలు చాలామందికి వచ్చాయని చెబుతున్నారు.

వైవాహిక జీవితంలో అనుకూలతలు తగ్గిపోయాయని భావిస్తున్నవారికి ఒక జత హంసల విగ్రహం శుభ సూచికగా మారుతుందని వాస్తు నిపుణుల మాట. బెడ్‌రూమ్‌లో ఉత్తర వైపున వీటిని ఉంచితే భార్యాభర్తల మధ్య అపోహలు తొలగి, ప్రేమానుబంధం బలపడుతుందని నమ్మకం. దాంపత్య జీవితంలో తిరిగి మాధుర్యం పూయించే శక్తి హంసల ప్రతీకకు ఉందని చెబుతున్నారు.

ఇవన్నిటితో పాటు ఆవు విగ్రహం ఉండటం ఇంటికి మహా శుభప్రదమని భావిస్తారు. ఇది కుటుంబానికి ఆర్థిక భద్రత, పిల్లలకు మంచి భవిష్యత్, ఇంటిముందు ఎప్పటికీ ఆనంద వాతావరణం ఉండేలా చేస్తుందనే విశ్వాసం ఉంది. ఈ విగ్రహాలన్నిటినీ శుభ్రంగా ఉండే, వెలుతురు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో ఉంచితే ఫలితాలు మరింత బలంగా కనిపిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.