Vastu Tips: సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులు ఎవరికైనా ఇస్తే.. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఆర్థిక కష్టాలు తప్పవు..!

వాస్తు శాస్త్రం అనేది ప్రాచీన భారతీయ శాస్త్రం. గృహ నిర్మాణం, స్థల నిర్మాణం, దేవాలయాల నిర్మాణం వంటి అన్ని విషయాల్లో అనుసరించాల్సిన నియమాలను ఇది వివరిస్తుంది. ప్రకృతి శక్తులు అయిన భూమి, జలం, వాయువు, అగ్ని, ఆకాశం అనే ఐదు భూతాల సమతౌల్యం వాస్తు శాస్త్రం ఆధారం. ఇంటిని ఎటు వైపు తలుపు పెట్టాలి, గదులను ఎటు వైపు ఉంచాలి, ఏ పనిని ఎప్పుడు చేయాలి అనే అంశాల్లో వాస్తు ప్రత్యేక మార్గదర్శకత్వం ఇస్తుంది. దీని నియమాలను పాటిస్తే సంపద, ఆరోగ్యం, శాంతి కలుగుతాయని, విరుద్ధంగా ప్రవర్తిస్తే కష్టాలు ఎదురవుతాయని నమ్మకం ఉంది.

మన జీవితంలో సంపద, శాంతి, ఆరోగ్యం కాపాడుకోవడానికి వాస్తు శాస్త్రం కొన్ని నియమాలను సూచిస్తుంది. వాటిని పాటిస్తే శుభఫలితాలు వస్తాయి. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఏ వస్తువులు దానం చేయొద్దో, అప్పుగా ఇవ్వొద్దో అనేది అత్యంత ప్రాధాన్యం కలిగిన నియమం. ఎందుకంటే ఈ సమయంలో కొన్ని వస్తువులను ఇచ్చేస్తే లక్ష్మీదేవి మన ఇంటినుంచి వెళ్లిపోతుందని, అనర్థాలు సంభవిస్తాయని నమ్మకం ఉంది.

సాయంత్రం వేళ తెల్లని వస్తువులను, ముఖ్యంగా ఉప్పు, పెరుగు, పంచదార వంటి పదార్థాలను ఇవ్వకూడదని వాస్తు చెబుతోంది. ఇవి శుక్రగ్రహానికి సంబంధించినవిగా భావించబడతాయి. సాయంత్రం వీటిని దానం చేస్తే ఆనందం, శ్రేయస్సు తగ్గిపోతాయని, శనిదోషం కూడా పడుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే డబ్బు లావాదేవీలు సూర్యాస్తమయం తర్వాత అస్సలు చేయకూడదని చెబుతుంటారు. ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంటికి విచ్చేస్తారని నమ్మకం. ఆ సమయంలో డబ్బు ఇతరులకు ఇస్తే లక్ష్మీదేవి మన ఇంటినుంచి వెళ్లిపోతుందని విశ్వాసం ఉంది. దీంతో వ్యాపారంలో నష్టాలు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

మన సంస్కృతిలో పవిత్రంగా భావించే పసుపు, కుంకుమ వంటి పదార్థాలు కూడా సాయంత్రం ఇవ్వడం శుభం కాదని వాస్తు చెబుతుంది. గురుగ్రహం బలహీనపడుతుందని, అప్పులు పెరుగుతాయని, వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని నమ్మకం.ఇక రాహు ప్రభావాన్ని కలిగించే ఉల్లిపాయ, వెల్లుల్లి పదార్థాలను కూడా ఈ సమయంలో ఇతరులకు ఇవ్వడం మానుకోవాలి. ఇలాచేస్తే ఇంట్లో గొడవలు, ఆరోగ్య సమస్యలు వస్తాయని పెద్దలు హెచ్చరిస్తారు.

అదే విధంగా తులసి మొక్కను సాయంత్రం కోయకూడదు, దానం చేయకూడదు. తులసి లక్ష్మీదేవి స్వరూపం కనుక ఇలాచేస్తే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు రావచ్చని నమ్మకం ఉంది. చంద్రుడికి, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే పాలు, పాల ఉత్పత్తులు కూడా సూర్యాస్తమయం తర్వాత అప్పుగా ఇవ్వడం వాస్తు ప్రకారం అశుభంగా పరిగణించబడుతుంది. ఇంట్లో డబ్బు నిల్వ ఉండదని పెద్దలు అంటారు. ఇక చిన్న వస్తువులా కనిపించే సూది కూడా సాయంత్రం తర్వాత ఇవ్వరాదు. ఇది ఇంట్లో వివాదాలు, గొడవలు పెరగడానికి కారణమవుతుందని పండితులు చెబుతున్నారు.

పురాతన నమ్మకాల ప్రకారం సాయంత్రం సమయం అనేది దేవతల ఆరాధనకు, ధ్యానానికి అనుకూలమైన సమయం. ఈ వేళ వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోతుందని, మన ఇంటి శుభప్రభావం తగ్గుతుందని వాస్తు సూచిస్తోంది. కాబట్టి చిన్న అలవాట్లే అయినా ఈ నియమాలను పాటిస్తే కుటుంబం ప్రశాంతంగా, ధనసంపదతో ఉండగలదని పెద్దలు చెబుతున్నారు.