అమెరికాలో ఆరోగ్య సమస్యలు రాజకీయ చర్చగా మారుతున్నాయి. తాజాగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ సోకిన విషయాన్ని ఆలస్యంగా ప్రకటించడంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోగ నిర్ధారణ చాలా ముందు జరిగిందని, గ్లీసన్ స్కోరు 9 లాంటి తీవ్రమైన స్థాయికి చేరుకోవడానికి ఎక్కువకాలం పడుతుందన్న వాదనతో ట్రంప్ బైడెన్ ఆరోగ్య సమాచారం విళంబంగా బయటపెట్టడాన్ని తీవ్రంగా ప్రశ్నించారు.
“ఇది కేవలం వైద్య విషయం మాత్రమే కాదు, దేశ భద్రతకు సంబంధించినది కూడా” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. బైడెన్ ఆరోగ్యంపై ప్రజలకు పూర్తి వివరాలు అందాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాధికారులు ఈ విషయంలో గోప్యత పాటించడం సరిఅవ్వదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బైడెన్ మానసికంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పిన వైద్యులు, ఇప్పుడు క్యాన్సర్ విషయాన్ని ఎలా మౌనంగా దాచారు అని ప్రశ్నించారు.
ఇక డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ కూడా విమర్శలలో వెనుకంజ వేయలేదు. జో బైడెన్ భార్య జిల్ బైడెన్‌ను “నకిలీ వైద్యురాలు” అని ట్వీట్ చేసి సంచలనానికి కారణమయ్యారు. డాక్టరేట్ పట్టా ఉన్న ఆమె, భర్త ఆరోగ్యం పట్ల స్పందించలేకపోయిందా? అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇప్పుడు బైడెన్ ఆరోగ్య పరిస్థితి, అధికార వర్గాల గోప్యతపై పెరుగుతున్న విమర్శలు.. అమెరికన్ పాలిటిక్స్‌లో కొత్త సంక్షోభానికి నాంది పలకే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఈ ఆరోపణలు మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.