Maha Kumbh Mela: కుంభమేళా ప్రభావం.. పడవలతో 30 కోట్లు సంపాదించిన కుటుంబం

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన కుంభమేళా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మహోత్సవం మతపరంగా మాత్రమే కాకుండా, ఆర్థికంగా కూడా భారీ ప్రయోజనాలను అందించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకారం, కుంభమేళా కారణంగా పలు రంగాల్లో వాణిజ్యం విస్తరించి, వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అంచనా వేయబడింది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం, ఈ ఉత్సవం నిర్వహణకు రూ.7,500 కోట్లు ఖర్చు చేయగా, దాని ద్వారా దాదాపు రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు తేలింది. హోటల్, ఆహారం, రవాణా రంగాల్లో భారీగా ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ముఖ్యంగా రవాణా రంగంలో రూ.1.5 లక్షల కోట్ల మేర ఆదాయం సాధించినట్లు అధికారులు తెలిపారు.

అంతేకాదు, ఈ కుంభమేళా కొన్ని కుటుంబాలకు ఆశించిన దానికన్నా ఎక్కువ ఆదాయం తీసుకువచ్చింది. ముఖ్యంగా ఒక కుటుంబం 130 పడవలను నడిపించి రూ.30 కోట్ల మేర సంపాదించిందని సీఎం యోగి ప్రకటించారు. ఒక్క పడవ ద్వారా రోజుకు రూ.52 వేల వరకు లాభం వచ్చిందని, మొత్తం 45 రోజుల ఉత్సవంలో ఒక్కో పడవకు దాదాపు రూ.23 లక్షల వరకు ఆదాయం వచ్చిందని తెలిపారు.

అయితే, ఈ ఉత్సవం కారణంగా పడవ నడిపే వారు దోపిడీకి గురయ్యారనే ఆరోపణలు వచ్చినప్పటికీ, సీఎం యోగి వాటిని ఖండించారు. ప్రజల కష్టంతో కూడిన ఆదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కుంభమేళా విజయవంతంగా ముగిసిందని తెలిపారు. అంతేకాదు, ఈ మహోత్సవం దేశ జీడీపీ వృద్ధికి తోడ్పడిందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.5% వృద్ధికి ఇది సహాయపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

జనసేన మటాష్ || Director Geetha Krishna Reacts On Chiranjeevi Support To Pawan Kalyan Janasena || TR