ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే జనాల రాకతో రికార్డులు క్రియేట్ కాగా ఇప్పుడు మరో సమస్యతో చెత్త రికార్డ్ నేమోదైంది. అధిక రద్దీ వల్ల ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 300 కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలిచిపోయాయంటే ఈ ట్రాఫిక్ జామ్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేక భక్తులు హైవేపైనే నిరాశతో గడిపే పరిస్థితి ఏర్పడింది.
వరల్డ్ లోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో సంగం రైల్వే స్టేషన్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. బస్సులు, కార్లు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి యూపీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులకు తాగునీరు, ఆహారం, ఔషధాలు వంటి అత్యవసర సదుపాయాలు కూడా అందుబాటులో లేవని సమాచారం.
ఈ పరిస్థితిని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ అసమర్థత వల్లే ఈ అప్రత్యక్ష సంక్షోభం తలెత్తిందని, భక్తులకు కనీస సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లతో పాటు రవాణా నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ యోగి ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి.