విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గత కొంతకాలంగా జరుగుతున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి తెరదించింది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుకు అప్పగించేది లేదని, దానిని కాపాడేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారంటూ వస్తున్న వార్తలను శ్రీనివాస వర్మ కొట్టిపారేశారు. ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్‌లో ప్లాంట్‌ను కాపాడేందుకు కొన్ని కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నట్లు వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.11,500 కోట్లు ఇచ్చిన విషయాన్ని శ్రీనివాస వర్మ గుర్తు చేశారు. ఇది పరిశ్రమను కాపాడేందుకేనని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని, కార్మికులు, ట్రేడ్ యూనియన్ నేతల సాయంతో తిరిగి పరిశ్రమను లాభాల బాట పట్టిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రయోజనాల కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని పేర్కొన్నారు.
జీఎస్టీపై కీలక నిర్ణయాలు: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని కేంద్రమంత్రి వెల్లడించారు. సామాన్యుల జీవితాల్లో సమూల మార్పులు రానున్నాయని పేర్కొన్నారు. 4 శ్లాబులు ఉన్న జీఎస్టీని 2 శ్లాబ్‌లకు తీసుకురావడంతో రానున్న రోజుల్లో ప్రజలకు మరింత వెసులుబాటు కలగనుందని తెలిపారు.
నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి: నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వేలు, నేషనల్ హైవేలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని శ్రీనివాస వర్మ వెల్లడించారు. ఎన్‌హెచ్-165 రహదారి విస్తరణకు రూ.3,200 కోట్లతో డీపీఆర్ సిద్ధమైందని స్పష్టం చేశారు. అతి త్వరలోనే నరసాపురం – చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానున్నట్లు వివరించారు. నరసాపురం – అరుణాచలం ఎక్స్‌ప్రెస్ రైలును రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఒకే దగ్గర ఉండేలా కలెక్టరేట్‌ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు.
కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ వ్యాఖ్యలు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు, స్థానికులకు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. ప్లాంట్ భవిష్యత్తుకు కేంద్రం కట్టుబడి ఉందని, దానిని లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.



