Tulasi Plant: తులసి మొక్క ఎండిపోతోందా.. ఇలా చేస్తే ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది..!

తులసి మొక్క అంటే కేవలం ఒక మొక్క మాత్రమే కాదు.. అది భక్తి, ఆధ్యాత్మికత, పాజిటివ్ ఎనర్జీకి ప్రతీకగా భావిస్తారు. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి తులసికి నీరు పోసి పూజ చేయడం ఎంతోమంది ఇళ్లలో సంప్రదాయంగా కొనసాగుతోంది. అలాంటి తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే చాలామందిలో ఆందోళన మొదలవుతుంది. అపశకునమని భావించే వారూ ఉన్నారు. కానీ వాస్తవానికి సరైన సంరక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు.

తులసి మొక్కకు నీరు పోస్తే చాలు అనుకోవడం పెద్ద పొరపాటు. అతిగా నీరు పోయడం, వాతావరణ మార్పులు, మట్టిలో పోషకాలు తగ్గడం, పురుగులు పట్టడం వంటి కారణాలతో మొక్క బలహీనపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఫంగస్, పురుగుల సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో కొన్ని సహజ చిట్కాలు పాటిస్తే తులసి మొక్క మళ్లీ గుబురుగా పెరుగుతుంది.

ఇంట్లోనే సులభంగా దొరికే పసుపు, వేప ఆకులు, టీ పొడి వంటి వాటితో తులసి మొక్కకు మంచి రక్షణ కల్పించవచ్చు. పసుపు కలిపిన నీరు మొక్కకు ఫంగస్ సమస్య రాకుండా చేస్తుంది. అలాగే వాడిన టీ పొడిని మట్టిలో కలపడం వల్ల సహజ ఎరువులా పని చేసి ఆకులను పచ్చగా ఉంచుతుంది. వేప ఆకుల పొడి పురుగులను దూరంగా ఉంచి వేర్లను బలపరుస్తుంది.

చలికాలంలో లేదా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కర్పూరం కలిపిన నీటిని కొద్దిగా మొక్క మొదట్లో పోస్తే పురుగులు దగ్గరకు రావు. అలాగే పాలు, నీటి మిశ్రమం మట్టిలో తేమను నిలిపి ఉంచి మొక్కకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. కట్టెల బూడిదను స్వల్పంగా మట్టిలో కలపడం వల్ల పొటాషియం అందించి మొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది.

తులసి మొక్క ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే విత్తనాలు వచ్చే సమయంలో వాటిని కత్తిరించడం చాలా ముఖ్యం. విత్తనాలు పెరిగితే మొక్క తన శక్తినంతా వాటికే వినియోగిస్తుంది. వాటిని తొలగిస్తే కొత్త కొమ్మలు వచ్చి మొక్క మరింత గుబురుగా పెరుగుతుంది. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంట్లో తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా కనిపిస్తుంది.