ఇంట్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా మనస్సుకు ప్రశాంతత దొరకట్లేదా? సంపద నిలవడం లేదా, పనులు అడ్డంకుల్లోనే ఆగిపోతున్నాయా? అయితే మీరు ప్రతి రోజూ చేసే ఒక చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదంటున్నారు పండితులు, వాస్తు నిపుణులు. అదే.. సాయంత్రం వేళ తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం.
హిందూ సంప్రదాయంలో తులసిని కేవలం ఒక మొక్కగా కాదు, లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తారు. విష్ణువుకు అత్యంత ప్రియమైన తులసి ఎక్కడ ఉంటే అక్కడ శుభకార్యాలే జరుగుతాయని నమ్మకం. అందుకే కార్తీక మాసంలోనే కాకుండా, సంవత్సరం పొడవునా సాయంత్రం తులసి వద్ద దీపారాధన చేస్తే ఇంట్లో దివ్యశక్తులు ప్రవహిస్తాయంటున్నారు భక్తులు.
ఈ దీపారాధన ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతికూల శక్తులను దూరం చేసి, సానుకూలతను పెంచుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి, పరస్పర అనురాగం పెరుగుతుందని విశ్వాసం. అంతేకాదు, సాయంత్రం దీపం వెలిగించిన వెంటనే మనస్సులో సహజంగానే ఒక ప్రశాంతత అలుముకుంటుంది. రోజంతా పేరుకుపోయిన ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క వద్ద నిత్యం దీపం వెలిగిస్తే ఇంట్లో ధనప్రవాహం స్థిరపడుతుందట. అనవసర ఖర్చులు తగ్గి, ఆదాయం పెరిగే అవకాశాలు మెరుగవుతాయట. ముఖ్యంగా అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారికి ఇది శుభపరిణామాలను తీసుకువస్తుందని నిపుణుల అభిప్రాయం.
ఇక ఆధ్యాత్మిక కోణంలో చూసుకుంటే, తులసి వద్ద వెలిగే దీపం లక్ష్మీ–విష్ణువుల ఆశీస్సుల సంకేతంగా భావిస్తారు. అందుకే “రోజూ ఒక్క దీపమే.. జీవితాన్ని వెలిగించే మహాశక్తి” అని పెద్దలు అంటుంటారు. ఇంట్లో శాంతి, మనస్సులో తృప్తి, పనుల్లో విజయం కావాలంటే ఈ చిన్న నియమాన్ని నెరవేర్చితే సరిపోతుందంటున్నారు భక్తులు.
