తెలంగాణలో అప్పుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత షురూ అయ్యింది. అధికారంలోకి వచ్చి, ఆర్నెళ్ళు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే ఇంత వ్యతిరేకత ఏంటి.? నిజానికి, మూడు నెలలు కూడా పూర్తి కాలేదు.! ఆ మాటకొస్తే, నెల రోజులు కూడా పూర్తవకుండానే ఈ పరిస్థితి.!
తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. నిజానికి, చారిత్రక నిర్ణయం. అయితే, తగినన్ని బస్సులు అందుబాటులో లేకపోవడంతో వున్న బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం తాలూకు ఆనందం సంగతేమోగానీ, కిక్కిరిపోతున్న బస్సుల్లో ప్రయాణం నరకప్రాయంగా మారిపోయింది ప్రయాణీకులకి.
మగవాళ్ళెలాలూ ఈ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకసలు బస్సుల్లో చోటు దక్కడంలేదాయె.! ఇంకోపక్క, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఆందోళనలు చేయాల్సి వస్తోంది. వారిని బుజ్జగించేందుకు రేవంత్ సర్కారు నానా తంటాలూ పడుతోంది.
ఇదిలా వుంటే, రైతు బందు విషయంలోనూ, ‘ఆరు గ్యారంటీల’ విషయంలోనూ రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండడం గమనార్హం. ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారంటూ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, గత కేసీయార్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల్లో పసలేదన్న చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతోంది.
ఓ నెల రోజుల సమయం తీసుకున్నా, తగినన్ని బస్సుల్ని సమకూర్చి, మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసి వుండాల్సింది. ఆరు గ్యారంటీల విషయంలోనూ ముందుగా రేషన్ కార్డుల్ని సరిచేసి, ఆ తర్వాత ముందుకు వెళ్ళి వుండాల్సింది. అయితే, మూడు నాలుగు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ తొందరపడక తప్పలేదు. ఆ తొందర కాస్తా కొంప ముంచేస్తోందిలా.!