తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈమధ్య ఎక్కువగా ఫామ్ హౌజ్లోనే ఉంటున్నారు. రాష్ట్ర వ్యవహారాలన్నీ కేటీఆరే చూసుకుంటున్నారు. ఈ పరిణామాల వెనుక కేసీఆర్ రచిస్తున్న చాలా పెద్ద పథకమే ఉంది. అదే ఢిల్లీ ప్లాన్. కేసీఆర్ ఛాన్నాళ్ల నుండి కేంద్ర స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాకుండా మూడవ ప్రత్యామ్నాయాన్ని నెలకొల్పాలని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత యేడాదిలోనే కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీలను ఏకంచేసే పని మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలోనే పలు రాష్ట్రాల్లో పర్యటించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, యూపీల నేతలతో సమన్వయమయ్యే ప్రయత్నం చేశారు. కానీ అవేవీ పెద్దగా ఫలించలేదు. ఆలోపే ఎన్నికలు రావడంతో నేతలందరూ రాష్ట్ర రాజకీయాల్లో మునుగిపోయారు. దీంతో కేసీఆర్ సైతం సర్దుకున్నారు.
మళ్లీ ఆ ప్రస్తావన రాలేదు. తాజాగా మరోసారి కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల మీద దృష్టి సారించారు. ఈ లాక్ డౌన్ సమయంలో కేసీఆర్ ఢిల్లీ ప్లాన్స్ తిరిగి అమలుచేయడం ఎలాగో ప్లాన్ చేసుకున్నారట. ఇకపై ప్రతి నెలా 15 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. అప్పుడే ఢిల్లీ రాజకీయాల మీద పూర్తి అవగాహన వచ్చి ఎలా ముందుకెళ్లాలో తెలిసొస్తుందనేది కేసీఆర్ ప్లానట. ఇప్పటికిప్పుడు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పనుల్ని తిరిగి స్టార్ట్ చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. అదే రాజకీయ శూన్యత. కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. ఇప్పటి వరకు ఆర్థిక వ్యవస్థ కోలుకునేలా మోదీ ఏదీ చేయలేదు. ఆత్మ నిర్భర భారత్ పేరుతో భారీ ప్యాకేజీ ప్రకటించినా ఎవరికీ దాని మీద నమ్మకం కుదరలేదు. పైగా కరోనా వ్యాప్తి నివారణలో కూడా ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి.
Read More : జగన్ కూడా నమ్మేసేలాగా ఆంధ్రప్రదేశ్ టాప్ మినిస్టర్ మీద ఎల్లో కథనం!
ఇక అయోధ్యలో రామ మందిరం నిర్మాణంతో ఒక వర్గం బయటకి కనబడకపోయినా బీజేపీ మీద గుర్రుగానే ఉంది. ఇవన్నీ బీజేపీకి ప్రతికూల అంశాలే. వీటిని క్యాష్ చేసుకోవడంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఆ పార్టీలో ప్రస్తుతం అధ్యక్ష పదవి భారం ఎవరు నెత్తిన పెట్టుకుంటారు అనే మీమాంస నడుస్తోంది. బలమైన, అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ సొంత రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉన్నాయి. మమతా బెనర్జీ, కెజ్రీవాల్, నితీష్ కుమార్, పినరయ్ విజయన్, నవీన్ పట్నాయక్ లాంటి కీలక నేతలంతా బీజేపీని రాష్ట్ర స్థాయిలో నిలువరించడానికే నానా తంటాలు పడుతున్నారు. అలాంటిది వీరు కేంద్ర స్థాయిలో మోదీ మీద యుద్దం చేయడం అంటే జరగని పని. ఆ వెసులుబాటు, సానుకూలత కేసీఆర్ కు మాత్రమే ఉన్నాయి.
Read More : ట్యాపింగ్ ఆరోణల్లో ఆధారాలుంటే ఇవ్వండి.. చంద్రబాబుకు డీజీపీ లేఖ
కారణం తెలంగాణ బాధ్యతలను చూసుకోవడానికి ఆయన వెనుక కుమారుడు కేటీఆర్ ఉన్నాడు. ఇప్పటికే ప్రభుత్వానికి, పాలనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. పార్టీలోని ప్రధాన నేతలంతా కేటీఆర్ వెంటే ఉంటూ పూర్తి సహకారం అందిస్తున్నారు. కాబట్టి రాష్ట్రం మీద కేసీఆర్ పెద్దగా సమయం వెచ్చించాల్సిన ఆవసరం లేదు. అందుకే ఢిల్లీలో క్యాంప్ వేయడానికి ఇదే సరైన తరుణమని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఇప్పటికే బీజేపీ బలాలు, బలహీనతల మీద సర్వే చేయించి నివేదికలు తెప్పించుకుని హోమ్ వర్క్ స్టార్ట్ చేశారట. రాజకీయ వర్గాల సమాచారం మేరకు 2022 లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ ఎన్నికల్లోనే సత్తా చూపలని కేసీఆర్ లక్ష్యం పెట్టుకున్నారట.
Read More : ట్రెండీ టాక్: త్రిష శింబుని పెళ్లాడబోతోందా?
లక్ష్యం గొప్పగానే ఉంది కానీ దాన్ని చేధించే శక్తిని కేసీఆర్ కూడగట్టుకోగలరా అనేదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నలకి కూడా గులాబీ నేతల వద్ద జవాబు ఉంది. బీజేపీ వ్యతిరేక పార్టీలు, నేతలు సొంతగా మోదీ మీద పోరు చేయలేకపోవచ్చు కానీ వారిని సంఘటితం చేసే నాయకుడు దొరికితే కలిసి నడవడానికి వారంతా సిద్దంగానే ఉన్నారట. బీజేపీతో పాటే కాంగ్రెస్ అంటే పడని నేతలు కూడా కేసీఆర్ కూటమిలో భాగస్వామ్యం కావొచ్చు. ఇక జాతీయ స్థాయిలో కేసీఆర్ ఆలోచనల నుండి పుట్టిన రైతు బంధు లాంటి పథకాలకు మంచి పేరుంది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తన కార్యదక్షత ఎలాంటిదో దేశానికి చాటారు కేసీఆర్. పైపెచ్చు ఈమధ్య పీవీ నరసింహారావు నినాదాన్ని అందుకోవడం, అంబేడ్కర్ వారసుల మద్దతు ఉండటం కూడా కేసీఆర్ కు బాగా కలిసొచ్చే అంశాలు. మరి ఈసారి గొప్ప స్కెచ్ వేసుకుని మరీ ఢిల్లీ వైపుకు కారు గేర్ మార్చిన కేసీఆర్ లక్ష్యం ఏమేరకు సఫలమవుతుందో చూడాలి.