TTD: భక్తులకు బిగ్ అలర్ట్.. 10 రోజులు అన్ని సిఫారసులు రద్దు.. టీటీడీ పాలక మండలి నిర్ణయం..!

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి కీలక సమావేశం నిర్వహించి, అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా దివ్యదర్శనం జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నాయి.

ఈ నెల 23వ తేదీ అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ మినలగ్నంలో ధ్వజారోహణ జరగనుండగా, అక్టోబర్ 2వ తేదీ వరకు పది రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ముఖ్యంగా కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాల కావడంతో, ఈసారి పూర్వం కంటే భిన్నంగా అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించుకుంది.

సెప్టెంబర్ 24న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 25వ తేదీన ముఖ్యమంత్రి పీఏసీ-5 ప్రారంభించనున్నారు. 28వ తేదీన గరుడసేవ మహోత్సవం ఉండగా, దాదాపు మూడు లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అంచనా. భక్తులకు అసౌకర్యం కలగకుండా భద్రతా బలగాలు, వాలంటీర్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గరుడసేవ రోజు భక్తులకు మూడు లక్షల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు.

ఈ పది రోజుల ఉత్సవాల్లో భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు టీటీడీ వినూత్న చర్యలు చేపట్టింది. చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ విధానం అమలు చేయనున్నారు. అదేవిధంగా విద్యుత్ అంతరాయం రాకుండా ప్రత్యామ్నాయ సదుపాయాలు, తాగునీటి సరఫరా, వైద్య శిబిరాలు వంటి ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తోంది. ఉత్సవాల సమయంలో విపరీత రద్దీని క్రమబద్ధీకరించేందుకు టీటీడీ తొలిసారిగా ఇస్రో సహకారం పొందనుంది. శాటిలైట్ పిక్చర్ టెక్నాలజీ ఆధారంగా రద్దీ నియంత్రణ చేపట్టనున్నామని పాలక మండలి ప్రకటించింది. ఇది టీటీడీ చరిత్రలో తొలిసారి అమలు కాబోతున్న వినూత్న ప్రయత్నం.

బ్రహ్మోత్సవాలను ప్రపంచానికి చాటిచెప్పేలా, ముంబైకు చెందిన ఓ సంస్థ హైక్వాలిటీ వీడియో చిత్రీకరణ చేసి టీటీడీకి ఉచితంగా అందజేయనుంది. మరోవైపు, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ఆలయాల నిర్మాణానికి తీర్మానం తీసుకున్నామని బోర్డు వెల్లడించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు ఆలయాల వరకు నిర్మించాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. దీని ద్వారా మతమార్పిడులను అరికట్టడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఉత్సవాల సమయంలో భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా తిరుమలలో భక్తి సముద్రాన్ని ఆస్వాదించేందుకు టీటీడీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా టీటీడీపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేయడంలో వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. తిరుమల పర్వతాలపై జరుగబోయే ఈ బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక టెక్నాలజీ సాయంతో కొత్త చరిత్ర సృష్టించనున్నాయి.