తిరుపతి వెళ్తున్నారా అయితే మీకో గుడ్ న్యూస్.. రూ.300 టికెట్లు దొరకక పోతే ఇలా చేయండి..!

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఆగస్టులో స్వామివారి దర్శనం కోసం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులో లేక పోయినా, మరో మార్గంలో భక్తులు సులభంగా స్వామివారి కృప పొందవచ్చు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో 300 రూపాయల టికెట్లు అయిపోతుండటంతో, భక్తులు నిరాశ చెందకూడదని టీటీడీ మరో ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది.

జూలై 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ‘శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం’ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఈ టికెట్ ధర ఒక్కటికి 1600 రూపాయలు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఒక్క టికెట్‌తో ఇద్దరు భక్తులు హోమంలో పాల్గొని, ఆ తర్వాత స్వామివారి దర్శనం పొందవచ్చు.

హోమం బుక్ చేసుకున్న భక్తులు హోమం జరిగే రోజు ఉదయం 9 గంటల లోపు తిరుపతి అలిపిరి వద్ద గల సప్తగృహ వద్ద రిపోర్ట్ చేయాలి. అక్కడ హోమం కార్యక్రమం ఉదయం 11 గంటలలోపు పూర్తవుతుంది. హోమం ముగిసిన తర్వాత, అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్‌లో స్వామివారిని దర్శించుకునే అవకాశం పొందుతారు.

ఇలా చూస్తే, హోమం పుణ్యం కూడా లభిస్తే, ప్రత్యేక దర్శనం కూడా లభిస్తుంది. అందువల్ల, రాబోయే ఆగస్టులో తిరుపతికి వెళ్లాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక దర్శన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అయిపోవడంతో.. ఈ అదనపు అవకాశం భక్తులకు ఎంతో ఉపయుక్తం కానుంది.

ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకి తరలివస్తారు. ఎక్కువ మంది భక్తులు తక్కువ ఖర్చులో త్వరిత దర్శనం కోసం 300 రూపాయల టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొన్ని సార్లు టిక్కెట్లు సౌలభ్యంగా దొరకవు. అలాంటి పరిస్థితుల్లో ‘శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం’ ద్వారా రెండు ప్రయోజనాలు పొందవచ్చు.. ఒకటి స్వామివారి పూజలో పాల్గొని ఆధ్యాత్మిక పుణ్యం పొందడం, మరొకటి స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకోవడం.