ఉరిశిక్ష ముప్పులో ముగ్గురు భారతీయులు

ఇండోనేషియాలో భారీ డ్రగ్స్ కేసులో ముగ్గురు భారతీయులు జీవితమరణ సమస్యను ఎదుర్కొంటున్నారు. తమిళనాడుకు చెందిన రాజు ముత్తుకుమారన్, సెల్వదురై దినకరన్, విమలకందన్ అనే యువకులు గత సంవత్సరం జులైలో డ్రగ్స్ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్టయ్యారు. సింగపూర్ జెండాతో కూడిన ఓడలో ప్రయాణిస్తున్న సమయంలో 106 కిలోల మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ పూర్తవగా, ఏప్రిల్ 15న తీర్పు వెలువడనుంది. స్థానిక న్యాయవ్యవస్థ ఉరిశిక్ష విధించే అవకాశముందని. నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం వీరి తరఫున భారతీయ న్యాయవాది జాన్ పాల్ వాదనలు వినిపిస్తున్నారు. కోర్టులో వాదిస్తూ, “ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ అక్రమ రవాణా కెప్టెన్‌కు తెలియకుండా జరిగిందనడం నమ్మశక్యం కాదు. అసలైన నేరస్థులు కుట్రపన్ని ముగ్గురు అమాయకులను ఇందులో ఇరికించారు,” అని స్పష్టంగా తెలిపారు. న్యాయస్థానం న్యాయంగా తీర్పు చెప్పి అమాయకులను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇండోనేషియాలో మాదకద్రవ్యాలపై చాలా కఠిన చట్టాలు అమలులో ఉన్నాయి. అలాంటి కేసుల్లో ఉరిశిక్ష అనేది సాధారణమే. దీనివల్ల ఈ కేసు మరింత తీవ్రతకు చేరింది. భారత్‌తో సంబంధాలున్నా, ఇండోనేషియా ఆ దేశ చట్టాల ప్రకారమే ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ద్వారా ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ కేసు తమిళనాడులో, భారతదేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మాదకద్రవ్యాల కేసుల్లో విదేశాల్లో చిక్కుకునే భారతీయుల సంఖ్య పెరుగుతోందని, ప్రభుత్వాలు వారికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఏప్రిల్ 15న వెలువడనున్న తీర్పుపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.